Depression: కుంగుబాటు మందులతో ‘ఆహ్లాదం’ ఆవిరి!

కుంగుబాటు చికిత్స కోసం వాడే యాంటీడిప్రెసెంట్ల వల్ల రోగుల్లో భావోద్వేగపరమైన స్తబ్దత నెలకొనవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Updated : 24 Jan 2023 09:35 IST

లండన్‌: కుంగుబాటు చికిత్స కోసం వాడే యాంటీడిప్రెసెంట్ల వల్ల రోగుల్లో భావోద్వేగపరమైన స్తబ్దత నెలకొనవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిసరాల నుంచి నేర్చుకునేందుకు వీలు కల్పించే ‘రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌’ అనే ముఖ్యమైన ప్రక్రియపై ఈ మందులు ప్రభావం చూపుతాయని వెల్లడైంది. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

దీర్ఘకాల లేదా తీవ్రస్థాయి కుంగుబాటు సమస్యకు సెలెక్టివ్‌ సెరోటోనిన్‌ రీఅప్‌టేక్‌ ఇన్‌హిబిటర్లు (ఎస్‌ఎస్‌ఆర్‌ఐ) అనే ఒక తరగతి ఔషధాలను ఉపయోగిస్తుంటారు. ఈ మందులు.. మెదడులోని నాడీ కణాల మధ్య సంకేతాలను మోసుకెళ్లే సెరోటోనిన్‌ అనే ఒక రసాయనాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి. దీన్ని ‘ఆహ్లాద రసాయనం’ అని కూడా పిలుస్తుంటారు. ఈ మందుల ప్రభావం వల్ల రోగుల్లో గతంలో ఉన్నంత ఆహ్లాద భావనలు కనిపించవని శాస్త్రవేత్తలు వివరించారు. 40-60 శాతం మందిలో ఈ దుష్ప్రభావం ఉంటోందని తెలిపారు. ‘‘ఈ మందులు ఎలా పనిచేస్తాయన్నది ఈ పరిశోధన స్పష్టంచేస్తోంది. కుంగుబాటు ఉన్నవారిలో కొంతమేర భావోద్వేగపరమైన బాధను ఇవి నిర్మూలిస్తున్నాయి. దురదృష్టవశాత్తు కొంత సంతోషాన్ని కూడా అవి హరిస్తున్నాయి’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన బార్బరా సాహాకియాన్‌ వివరించారు. కొందరు వాలంటీర్లపై 21 రోజుల పాటు ఈ అధ్యయనం జరిపి ఈ మేరకు తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని