పోటీకి చైనా భయపడదు

దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

Published : 27 Apr 2024 05:58 IST

అమెరికాకు డ్రాగన్‌ స్పష్టీకరణ
రెండు దేశాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం

బీజింగ్‌: దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇందులో అంతర్జాతీయ, ప్రాంతీయ వివాదాలపై సంప్రదింపులు కొనసాగించడం, రెండు దేశాల ప్రత్యేక దూతల మధ్య కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడం, ఇరు దేశాల ప్రభుత్వాధినేతల సూచనలకు అనుగుణంగా ద్వైపాక్షిక మైత్రిని వృద్ధి చేసుకోవడం, అన్ని స్థాయిల్లోనూ ఉన్నతాధికారులు పరస్పర పర్యటనలు చేపట్టడం ఇందులో ఉన్నాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య శుక్రవారం ఇక్కడ భేటీ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు, చౌక వస్తువులతో ప్రపంచ మార్కెట్‌ను డ్రాగన్‌ ముంచెత్తడం సహా అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జిన్‌పింగ్‌, బ్లింకెన్‌తో భేటీపై చైనా అధికారిక మీడియా ఓ కథనాన్ని వెలువరించింది.

దీని ప్రకారం.. పోటీకి చైనా భయపడబోదని జిన్‌పింగ్‌ స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు ఇవ్వడం, దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌తో ఉద్రిక్తతలను పెంచుతున్న డ్రాగన్‌ చర్యలను బ్లింకెన్‌ ప్రస్తావించారు. అమెరికాతో సహకారానికి తాము సిద్ధమేనని, అయితే అది ఇచ్చిపుచ్చుకునేదిగా ఉండాలని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ‘‘పోటీకి చైనా భయపడదు. అయితే ఆ పోటీ.. ఉమ్మడి పురోగతికి ఉద్దేశించిందై ఉండాలి’’ అని తెలిపారు. అలీనోద్యమానికి చైనా కట్టుబడి ఉందని చెప్పారు. అయితే చిన్నపాటి కూటములను ఏర్పాటు చేయడం వంటివి అమెరికా మానుకోవాలని కోరారు. భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాతో అగ్రరాజ్యం ఏర్పాటు చేసిన క్వాడ్‌ కూటమి వంటివాటిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు వేర్వేరుగా మైత్రీబంధాలు, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. పరస్పరం లక్ష్యంగా చేసుకోవడం, వ్యతిరేకించుకోవడం, నష్టం చేసుకోవడం వంటివి చేయకూడదన్నారు.

‘‘రెండు దేశాలు భాగస్వాములుగా ఉండాలి. ప్రత్యర్థులుగా కాదు’’ అని స్పష్టంచేశారు. రష్యాకు చైనా మద్దతు ఇవ్వరాదన్నది అమెరికా, ఐరోపా సంఘం, నాటో దేశాల కోరిక అని బ్లింకెన్‌ స్పష్టంచేశారు. లేకుంటే అదనపు చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. చైనాకు చెందిన 100కుపైగా సంస్థలపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చైనా సంస్థలు రష్యా ఆయుధ కంపెనీలకు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. చైనా ప్రజల అభివృద్ధి హక్కును ఎవరూ అడ్డుకోజాలరని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ స్పష్టంచేశారు. చైనా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీని లక్ష్యంగా చేసుకొని అమెరికా అనేక చర్యలు చేపట్టిందన్నారు. ఇది న్యాయబద్ధమైన పోటీ కాదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని