అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు

ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు.

Published : 27 Apr 2024 05:57 IST

వారం రోజుల్లో 550 మందికి పైగా అరెస్టు
అదుపులో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్‌
కొనసాగుతున్న పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు
పారిస్‌కూ పాకిన ఆందోళనలు

న్యూయార్క్‌: ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులతో చర్చలు జరుపుతుంటే, మరి కొన్నిమాత్రం పోలీసులను రంగంలోకి దింపుతున్నాయి. గురువారం ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన అచింత్య ప్రిన్స్‌టన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నారు. ఆందోళనల్లో భాగంగా వర్సిటీ ప్రాంగణంలో టెంట్లు వేయడానికి ప్రయత్నించిన ఆమెను అరెస్టు చేశారు. మరో విద్యార్థి హసన్‌ సయ్యద్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా వీరిద్దరిపై నిషేధం విధించారు.

జార్జివాషింగ్టన్‌ యూనివర్సిటీలోనూ పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలు జరిగాయి. ఇందులో విద్యార్థులతో పాటు.. ప్రొఫెసర్లూ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో వారం రోజుల్లో సుమారు 550కిపైగా విద్యార్థులు అరెస్టయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్‌లో 33 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనెక్టికట్‌ యూనివర్సిటీలో గుడారాలను పోలీసులు కూల్చివేశారు. ఒహాయో యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి. ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ చేసిన హెచ్చరికలను ఖాతరు చేయని వారిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా యూనివర్సిటీల ఆందోళనలు ఫ్రాన్స్‌నూ తాకాయి..ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ స్టడీస్‌ విద్యార్థులు పాలస్తీనియన్లకు సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు. క్యాంపస్‌లోకి ప్రవేశించే మార్గాలను మూసివేశారు. కార్యాలయాలను ఆక్రమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని