icon icon icon
icon icon icon

తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 17 May 2024 09:36 IST

ఊళ్లో లేకుండా చేస్తామని హెచ్చరికలు
పోలింగ్‌నాడు సొంతూరిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడి దాష్టీకం
గ్రామానికి తాగునీరు, విద్యుత్‌ సరఫరా బంద్‌
ఊరు వదిలి వెళ్లి తలదాచుకున్న బాధితులు

ఈనాడు, ఈనాడు డిజిటల్‌-నరసరావుపేట: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికలను ఏకపక్షంగా జరుపుకునేందుకు తెదేపాకు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉన్నవారిని బెదిరించారు. వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. చివరికి మహిళలనే కనికరం కూడా లేకుండా చేయిచేసుకున్నారు. గ్రామానికి నీళ్లూ, కరెంటూ తీసేశారు. వీరి ఆగడాలను తట్టుకోలేక అనేకమంది తెదేపా సానుభూతిపరులు గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ దారుణాలు  పోలింగ్‌ రోజున జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి సొంత ఊరైన వెల్దుర్తి మండలం కండ్లకుంటలో నాలుగు పోలింగ్‌ కేంద్రాలు ఉండగా తెదేపాతోపాటు ఇతర పార్టీలకు చెందిన 12 మంది పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చున్నారు. పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే వైకాపా ఏజెంట్లు తెదేపా తరఫున కూర్చున్న దుర్గంపూడి వెంకటరెడ్డి, మాణిక్యంను బయటకు వెళ్లిపొమ్మని బెదిరించారు.

కొందరు వెళ్లిపోగా ఈ ఇద్దరు మాత్రం వెరవకుండా కూర్చున్నారు. ఏకపక్షంగా పోలింగ్‌ సాగాలని పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి ముందురోజే వెబ్‌కాస్టింగ్‌ వైర్లు కత్తిరించేశారు. పోలింగ్‌ రోజు ఉదయం నుంచి విద్యుత్తు సరఫరా బంద్‌ చేయించారు. ఇంత చేసినా తెదేపా ఏజెంట్లు ధైర్యంగా, పట్టుదలతో కూర్చున్నారు. ఇది చూసిన వెంకట్రామిరెడ్డి మాకే ఎదురుచెబుతారా.. మీ సంగతి చూస్తాం.. ఊరిలో ఉండనివ్వం.. అంటూ బెదిరించి.. ఆతరువాత ఏజెంట్ల ఇళ్లకు అనుచరులతో వెళ్లి వారి కుటుంబసభ్యులపై కర్రలు, రాడ్లతో దాడులకు తెగబడ్డారు. వాళ్లు హాహాకారాలు చేస్తుండగా దుర్గంపూడి వెంకటరెడ్డి కుమారులు అంజిరెడ్డి, దిలీప్‌రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చారు.ఆ సమయంలో ఎస్సీ కాలనీ వైపు నుంచి వెంకట్రామిరెడ్డి అనుచరులు వీరిపైకి దూసుకొచ్చారు. ‘వీళ్ల నాన్న ఏజెంట్‌గా కూర్చున్నాడు. వీరిని కూడా చావబాదండి’ అంటూ ఆయన తన అనుచరులను రెచ్చగొట్టారు. అన్నదమ్ములను కొడుతున్న దృశ్యాలను వెంకటరెడ్డి కుమార్తె శివాంజలి సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా ఆమె చెంపపై కొట్టి సెల్‌ఫోన్‌ లాక్కొని వెంకట్రామిరెడ్డి పగలగొట్టారు. అంజిరెడ్డి, దిలీప్‌రెడ్డిని కొడుతుండగా తప్పించుకుని వారు ఇంట్లోకి వెళ్లి దాక్కోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

డీఎస్పీకి ఫిర్యాదు చేశారని..

ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న అంజిరెడ్డి డీఎస్పీకి ఫోన్‌ చేసి తమపై వైకాపా వారు దాడులకు పాల్పడుతున్నారని వచ్చి రక్షించాలని కోరారు. డీఎస్పీ వస్తున్నానని చెప్పారు. దాడి తర్వాత వెంకటరెడ్డి భార్య లక్ష్మి పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి భర్తకు పిల్లలను కొట్టిన విషయం చెప్పారు. తరువాత ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఈలోగా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మరోసారి వెంకటరెడ్డి ఇంటిపైకి దాడికి వచ్చారు. వస్తూ వస్తూనే డీఎస్పీకి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తార్రా? ఏజెంట్లుగా కూర్చునే దమ్ముందారా మీకు? ఊళ్లో లేకుండా చేస్తాం.. ఏమనుకుంటున్నారో అంటూ కర్రలతో వెంకటరెడ్డి కుమారులు అంజిరెడ్డి, దిలీప్‌రెడ్డిల తలలు పగలగొట్టారు. దీంతో స్పృహతప్పి పడిపోయారు.

అంబులెన్స్‌ను అడ్డుకుని..

అన్నదమ్ములు ఇద్దరూ దాడిలో గాయపడి స్పృహతప్పి పడిపోవడంతో వారి సోదరి శివాంజలి 108కి ఫోన్‌ చేసింది. గ్రామంలోకి వచ్చిన అంబులెన్స్‌ను వెంకటరెడ్డి ఇంటివద్దకు వెళ్లకుండా వైకాపా మూకలు గంటపాటు అడ్డగించాయి. గంట తర్వాత మరో వీధి గుండా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

భయంతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయి..

గాయపడినవారిని కండ్లకుంట గ్రామం నుంచి అంబులెన్స్‌లో నరసరావుపేట ఆసుపత్రికి తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం చేయించారు. అయితే ఆసుపత్రిలో ఉన్నవారిపై మళ్లీ దాడి చేయిస్తారన్న సమాచారంతో అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి తలదాచుకున్నారు. అంజిరెడ్డి, దిలీప్‌రెడ్డి, తల్లి లక్ష్మి అజ్ఞాతంలో గడుపుతున్నారు.  ఘటన తర్వాత వెంకటరెడ్డి కొందరి సాయంతో వెల్దుర్తికి చేరుకుని అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. కుమార్తె శివాంజలి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఇలా ఐదుగురు కుటుంబసభ్యులూ వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైకాపా మూకలు వెంకటరెడ్డి కుటుంబానికి చెందిన 10 బర్రెలను గొలుసులు తప్పించి ఎక్కడికో తరిమేశారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కండ్లకుంట ఎస్సీ కాలనీలో తెదేపా సానుభూతిపరుల నివాసాలు ఉన్నాయి. ఇక్కడినుంచి కొందరు  గ్రామం వదిలివెళ్లిపోయారు.గ్రామంలో విద్యుత్తు సరఫరా బంద్‌ చేశారు. తాగునీటి కనెక్షన్‌ను కూడా పీకేశారు. కనీసం ఆర్వోప్లాంట్‌కు వెళ్లి నీరు తెచ్చుకుందామన్నా కూడా ఇవ్వడం లేదు. ఊళ్లో నుంచి వెళ్లగొట్టేలా ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

డీఎస్పీకి ఫోన్‌ చేసిన విషయం వారికి ఎలా తెలిసింది?

కండ్లకుంటలో వైకాపా మూకలు దాడి చేసిన విషయాన్ని అంజిరెడ్డి ఫోన్‌ ద్వారా ఓ డీఎస్పీకి చెబితే ఆ సమాచారం నిమిషాల వ్యవధిలోనే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్పీకి ఫోన్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించి మరోసారి దాడి చేయడం గమనార్హం. ఇంట్లో తలుపులు వేసుకుని డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం వైకాపా వారికి తెలిసిందంటే తమకు ఇక భద్రత లేదని వారు ఆందోళన చెందుతున్నారు.

వలసపోయిన నేతలు

మాచర్ల నియోజకవర్గంలో తెదేపా తరఫున కీలకంగా పనిచేసిన నేతలంతా దాడులు జరుగుతాయన్న భయంతో ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరైతే  హైదరాబాద్‌, గుంటూరు తదితర నగరాలకు వెళ్లిపోయారు. మాచర్ల పట్టణం ప్రస్తుతానికి పోలీసుల రక్షణలో ఉన్నప్పటికీ తెదేపా నేతల భద్రతకు భరోసా లేకపోవడంతో వారు అక్కడ ఉండటానికి సాహసించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img