ఆ రాజ కిరీటం వెనుక..

ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న బ్రిటిష్‌     రాజ కిరీటం, సింహాసనం వెనుక ఆసక్తికరమైన చరిత్ర దాగుంది.

Updated : 04 May 2023 08:59 IST

రాజును చంపి.. కరిగించేసి  
విడాకుల కోసం పోప్‌పైనే తిరుగుబాటు
ఇంగ్లాండ్‌ రాచపీఠం వివాదాలమయం

ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న బ్రిటిష్‌     రాజ కిరీటం, సింహాసనం వెనుక ఆసక్తికరమైన చరిత్ర దాగుంది. అంతే కాదు.. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న అనేక     వివాదాలకు ఈ కిరీటం, సింహాసనం ప్రత్యక్ష సాక్షులు.  ప్రస్తుతం ఛార్లెస్‌-3 ధరించబోయే    రాజ కిరీటాన్ని సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటం అంటారు. 444 నవరత్నాలు, మాణిక్యాలు పొదిగి, పూర్తి  బంగారంతో తయారైన దీని బరువు 2.23 కిలోలు. 1661లో దీనిని ఛార్లెస్‌-2 పట్టాభిషేకం కోసం తయారు చేయించారు. నిజానికి అంతకు ముందు నుంచే  రాజ కిరీటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.

పోప్‌పై తిరుగుబాటు

1042-1066 మధ్యకాలంలో పాలన సాగించిన ఆంగ్లో-సాక్సన్‌ ఇంగ్లిష్‌ రాజు ఎడ్వర్డ్‌ ది కన్ఫెసర్‌ మరణానంతరం ఆయన వాడిన కిరీటం, రాజముద్రలను ఇంగ్లాండ్‌ రాజులకు పట్టాభిషేక సమయంలో ధరింపజేయడం ఆనవాయితీగా మారింది. 1229లో హెన్రీ-3 పట్టాభిషేకాన్ని రికార్డుల్లో నమోదైన తొలి ఉత్సవంగా చెబుతారు. అప్పట్నుంచి ప్రతి పట్టాభిషేకంలో కీలకమైన సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటం ప్రభ 1525 తర్వాత మసకబారడం మొదలైంది. రాజు హెన్రీ-8 భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాటికన్‌ పోప్‌ అంగీకారం ఉంటేనే అది సాధ్యం. పోప్‌ ఎటూ తేల్చకుండా నాన్చడంతో హెన్రీ-8 ఆగ్రహించి ఇంగ్లాండ్‌లో పోప్‌ అధికారాన్ని తొలగించారు. రోమన్‌ కాథలిక్‌ చర్చి బదులు చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌ను స్థాపించి దానికి తననే అధిపతిగా నియమించుకున్నారు. అలా ప్రొటెస్టెంట్‌ చర్చి ఆధిపత్యం మొదలైంది. అదే క్రమంలో సంప్రదాయబద్ధమైన రాజ కిరీట ధారణ ప్రాధాన్యం కోల్పోయింది.

అంతర్యుద్ధంలో కరిగించేశారు

ఆ తర్వాత ఇంగ్లిష్‌ అంతర్యుద్ధం (1642-1652) సమయంలో రాజ కిరీటం ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. 1625లో సింహాసనాన్ని అధిష్ఠించిన ఛార్లెస్‌-1 హయాంలో బ్రిటన్‌ పార్లమెంటు, రాజ కుటుంబం మధ్య అధికార యుద్ధం సాగింది. 1642లో ఎంపీలను అరెస్టు చేయించడానికి రాజు ప్రయత్నించగా.. ఒలివర్‌ క్రోమ్‌వెల్‌ సారథ్యంలోని పార్లమెంటరీ సైన్యం రాజు ఛార్లెస్‌-1పై దాడి చేసింది. పోరాటంలో చివరకు పార్లమెంటు సభ్యులదే పైచేయి అయింది. దేశద్రోహ అభియోగంపై 1649లో రాజు ఛార్లెస్‌-1ను బహిరంగంగా చంపేశారు. క్రోమ్‌వెల్‌ ప్రభుత్వ హయాంలో బ్రిటన్‌ రాజరికపు పెత్తనాన్ని వీడి... కామన్వెల్త్‌ రిపబ్లిక్‌గా ఆవిర్భవించింది. అదే సమయంలో రాజరికానికి గుర్తులైన సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటంతోపాటు.. అనేక రాజముద్రలను పార్లమెంటరీ ప్రభుత్వం కరిగించింది. మరికొన్నింటిని అమ్మేసింది. 1660లో పెత్తనం లేకుండా రాజరికాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఛార్లెస్‌-2 పట్టాభిషేకం కోసం కొత్తగా సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటాన్ని మళ్లీ తయారు చేయించారు.


ఇప్పటిదాకా ఐదుగురే..

బ్రిటిష్‌ అధికారిక రాజ కిరీటంగా పేరొందిన ఈ ఎడ్వర్డ్‌ కిరీటాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదుగురే.. ఛార్లెస్‌-2 (1661), జేమ్స్‌-2 (1685), విలియం-2 (1689), జార్జ్‌-5 (1910), ఎలిజబెత్‌-2 (1953) మాత్రమే ధరించారు. విక్టోరియా మహారాణి, ఎడ్వర్డ్‌-7లు బరువు ఎక్కువ ఉందనే కారణంతో ఈ కిరీటాన్ని కాకుండా తక్కువ బరువున్న మరోటి ధరించారు.

* 1689 తర్వాత 200 సంవత్సరాలపాటు ఏ పట్టాభిషేకంలోనూ దీన్ని వాడలేదు. ఐదో జార్జ్‌ (1910) పాలనలో ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. చివరిసారిగా 1953లో ఎలిజబెత్‌-2 ధరించారు. ఇప్పుడామె కుమారుడు ఛార్లెస్‌-3కి ఆ అవకాశం దక్కబోతోంది.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు