మూగబోయిన 320 ఏళ్ల వార్తాపత్రిక!

ప్రపంచంలోని అత్యంత పురాతన వార్తాపత్రికల్లో ఒకటైన ‘వీనర్‌ జైటుంగ్‌’ గొంతు మూగబోయింది! దాని రోజువారీ ముద్రణను నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

Published : 01 Jul 2023 05:10 IST

‘వీనర్‌ జైటుంగ్‌’ రోజువారీ ముద్రణ నిలిపివేస్తున్నట్లు ప్రకటన

బెర్లిన్‌: ప్రపంచంలోని అత్యంత పురాతన వార్తాపత్రికల్లో ఒకటైన ‘వీనర్‌ జైటుంగ్‌’ గొంతు మూగబోయింది! దాని రోజువారీ ముద్రణను నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మూడు శతాబ్దాలకుపైగా చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ పత్రిక చివరి సంచికను శుక్రవారం ముద్రించారు. ‘వీనర్‌ డయేరియం’ పేరుతో 1703 ఆగస్టు 8న ఈ పత్రిక ప్రారంభమైంది. తర్వాత దాని పేరు ‘వీనర్‌ జైటుంగ్‌’గా మారింది. ఆస్ట్రియా ప్రభుత్వమే దీనికి యాజమాన్యంగా ఉన్నా.. ఎడిటోరియల్‌ పరంగా స్వతంత్రంగానే కొనసాగింది. ప్రింట్‌ మీడియాకు సంబంధించిన ఓ చట్టంలో ఇటీవల మార్పులు చోటుచేసుకోవడం.. వియన్నా కేంద్రంగా నడిచిన ఈ పత్రికకు శరాఘాతంగా మారింది. దాని ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా ముద్రణను నిలిపివేశారు. ‘320 ఏళ్లలో 12 మంది అధ్యక్షులు, 10 మంది చక్రవర్తులు, 2 దేశాలు, ఒకే పత్రిక’ అంటూ చివరిరోజు ఎడిషన్‌ మొదటి పేజీలో వీనర్‌ జైటుంగ్‌ ప్రచురించింది. రోజువారీ ప్రింటింగ్‌ను నిలిపివేస్తున్నప్పటికీ- ఆన్‌లైన్‌ ఎడిషన్‌ కొనసాగుతుందని యాజమాన్యం వెల్లడించింది. మాసపత్రిక రూపంలో అందుబాటులో ఉండేందుకూ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు