Air pollution: వాయు కాలుష్యంతో మర్చిపోలేని నష్టం

వాయు కాలుష్యం ధాటికి శరీరంలోని అవయవాలన్నీ పొగచూరిపోతున్నాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

Updated : 31 Jul 2023 10:21 IST

వాయు కాలుష్యం ధాటికి శరీరంలోని అవయవాలన్నీ పొగచూరిపోతున్నాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఊపిరితిత్తులు, గుండె వంటి భాగాలనే కాకుండా మెదడునూ అది దారుణంగా దెబ్బతీస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఆలోచనశక్తి, విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతోందని ఇప్పటికే వెల్లడైంది. స్వల్పస్థాయిలో ఈ కలుషిత గాలి బారినపడ్డా తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనకర అంశాన్ని   బ్రిటన్‌, స్వీడన్‌ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు స్టాక్‌హోమ్‌లో 2500 మందిపై దృష్టి సారించారు. వీరి సరాసరి వయసు 73 ఏళ్లు. వీరిపై 12 ఏళ్ల పాటు పరిశోధన సాగింది. వీరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు, నర్సులతో విస్తృత స్థాయిలో పరిశీలనలు సాగించారు. అధ్యయనం ప్రారంభం కావడానికి ముందు పరీక్షార్థుల ఇళ్ల వద్ద వార్షిక సరాసరి ‘పీఎం 2.5’ స్థాయిని కొలిచారు. ఇవి గాల్లో ఉండే సూక్ష్మ రేణువులు. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీస్తాయని ఇప్పటికే వెల్లడైంది.

ఏం తేలింది?

  • పీఎం 2.5 రేణువులు స్వల్ప మొత్తంలో పెరిగినా.. డిమెన్షియా ముప్పు 70% అధికం కావొచ్చు.
  • అధ్యయన ప్రారంభ సమయంలో పరీక్షార్థుల రక్తంలో విటమిన్‌-బితో ముడిపడిన హోమోసిస్టీన్‌, మెథియోనైన్‌ అనే రెండు అమినో ఆమ్లాల స్థాయిని శాస్త్రవేత్తలు కొలిచారు. వీటి పరిమాణాల్లో వచ్చే మార్పులు డిమెన్షియాకు కొంతమేర కారణమవుతున్నట్లు తేలింది. హోమోసిస్టీన్‌, మెథియోనైన్‌లతో కలుషిత గాలి జరిపే చర్యలే ఇందుకు దోహదపడుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
  • వాహన కాలుష్యానికి సంబంధించిన ప్రతి క్యూబిక్‌ మీటరు సూక్ష్మ రేణువుల వల్ల డిమెన్షియా ముప్పు 3% మేర పెరగొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.  
  • మెదడు, నాడీ వ్యవస్థలో ఇన్‌ఫ్లమేషన్‌ ఈ పరిస్థితికి దారితీస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు.

బుర్ర తొలిచేస్తోంది..!

పుడమిపై 99 శాతం మంది పీల్చేగాలి.. సురక్షిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడాన్ని బట్టి వాయు కాలుష్య జాడ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు పరిశోధనల్లో కొన్ని కఠోర వాస్తవాలు బయటపడ్డాయి.

  • వాయు కాలుష్యం కారణంగా శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ ప్రతిస్పందన కలుగుతుంది. తీవ్రస్థాయి ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల నాడీ కణాలు, నాడీ వ్యవస్థకు సంబంధించిన నియంత్రణ ప్రతిస్పందనలు దెబ్బతినే ప్రమాదం ఉందని జంతువులపై జరిగిన పరిశోధనల్లో తేలింది.
  • ముక్కు, మెదడుకు మధ్య సంధానకర్తగా ఉండే ఆల్ఫాక్టరీ న్యూరాన్లలోకి ప్రవేశించడం ద్వారా కలుషిత రేణువులు న్యూరాన్లను దెబ్బతీస్తాయి.
  • జీర్ణాశయంలో ఎంటెరిక్‌ నాడీ వ్యవస్థ ఉంటుంది. దీన్ని ‘రెండో మెదడు’గా అభివర్ణిస్తారు. అక్కడ తిష్ఠ వేయడం ద్వారా మన భావోద్వేగాలు, ఆరోగ్యాన్ని ఈ రేణువులు ప్రభావితం చేస్తాయి.
  • రక్తంలోని సూక్ష్మజీవులు, విషతుల్య పదార్థాల నుంచి రక్షించే బ్లడ్‌-బ్రెయిన్‌ బ్యారియర్‌ను దాటి ఈ కాలుష్య రేణువులు మెదడులోకి ప్రవేశించి, అక్కడ నష్టం కలిగించొచ్చు.
  • కలుషిత రేణువులు.. గర్భస్థ పిండంలోని మాయ, కాలేయం, ఊపిరితిత్తులతోపాటు మెదడులోకీ ప్రవేశిస్తున్నట్లు స్కాట్లాండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
  • గర్భిణిగా ఉన్నప్పుడు నైట్రోజన్‌ డైఆక్సైడ్‌ను ఎక్కువగా పీల్చిన మహిళలకు పుట్టే సంతానానికి వ్యవహారశైలి సంబంధ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు