నాడు సరేనని.. నేడు మాదేనని!

నిత్య జగడాల చైనా... మరోమారు భారత్‌తో కయ్యానికి కన్నుకొడుతోంది! అంతర్జాతీయంగా కీలకమైన జీ-20 శిఖరాగ్ర సదస్సుకు దిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతున్న వేళ అరుణాచల్‌ప్రదేశ్‌ తమదే అంటూ మళ్లీ పటాలు విడుదల చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.

Updated : 31 Aug 2023 07:26 IST

అరుణాచల్‌పై చైనా పితలాటకం 
అసలు లక్ష్యం తవాంగ్‌!

నిత్య జగడాల చైనా... మరోమారు భారత్‌తో కయ్యానికి కన్నుకొడుతోంది! అంతర్జాతీయంగా కీలకమైన జీ-20 శిఖరాగ్ర సదస్సుకు దిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతున్న వేళ అరుణాచల్‌ప్రదేశ్‌ తమదే అంటూ మళ్లీ పటాలు విడుదల చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఇంతకూ భారత అంతర్భాగమైన అరుణాచల్‌పై చైనా ఎందుకని పదేపదే కన్నేస్తోంది? పేర్లు మార్చి తమ భూభాగం అని ఎందుకంటోంది?
ఈశాన్య భారతంలో అరుణాచల్‌ప్రదేశ్‌ అతిపెద్ద రాష్ట్రం! టిబెట్‌, మయన్మార్‌, భూటాన్‌లతో అంతర్జాతీయ సరిహద్దులున్న రాష్ట్రమిది. మొత్తం ఈశాన్య భారతానికి ఇది రక్షణ కవచంలా ఉంటుంది. చైనా తమదిగా ప్రకటించుకుంటున్న తైవాన్‌ కంటే వైశాల్యంలో మూడు రెట్లు పెద్దదీ రాష్ట్రం! దీన్ని దక్షిణ టిబెట్‌గా పరిగణిస్తూ... అరుణాచల్‌ అంతటినీ తమ భూభాగంలో భాగమంటోంది చైనా. అంతేకాదు దీనికి తమ భాషలో జంగ్నామ్‌ అని పేరు కూడా పెట్టుకుంది. పైకి అరుణాచల్‌ప్రదేశ్‌ అంతా తమదే అని అంటున్నా ఆ దేశం ప్రధానంగా కన్నేసింది మాత్రం ఈ రాష్ట్రంలోని తవాంగ్‌ జిల్లాపైనే! అరుణాచల్‌ప్రదేశ్‌లోని నైరుతి ప్రాంతమైన తవాంగ్‌.. భూటాన్‌, టిబెట్‌లతో సరిహద్దులు పంచుకుంటోంది.

తవాంగ్‌ ఎందుకంటే..

భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం- తవాంగ్‌. ఈశాన్య భారతంలోకి అడుగుపెట్టడానికి.. టిబెట్‌, బ్రహ్మపుత్ర లోయ మధ్య కూడా ఇది కీలకం. దీంతోపాటు తవాంగ్‌ గాండెన్‌ బౌద్ధారామంను చూపించి అరుణాచల్‌ను తమదే అంటోంది చైనా! టిబెట్‌ బౌద్ధారామం తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్దది ఈ తవాంగ్‌ గాండెన్‌. 1680లో దీన్ని ఐదో దలైలామా కోరిక మేరకు నిర్మించారు. పురాతన కాలం నుంచీ టిబెట్‌ ఆరామానికి, తవాంగ్‌కు మధ్య సంబంధాలున్నాయి. కాబట్టి అరుణాచల్‌ తమదేనని చైనా వాదిస్తోంది. ఆ లెక్కన చూసినా దాని వాదన సరికాదు. ఎందుకంటే అసలు టిబెట్‌ కూడా దానిది కాదు. దాన్ని చైనా స్వాధీనం చేసుకుంది.

నాడు అంగీకారం

టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకోవటానికి చాలా ఏళ్ల ముందే.. 1914లోనే భారత్‌, టిబెట్‌, చైనా మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) నిర్ణయమైంది. బ్రిటన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ మెక్‌మోహన్‌ 1914లో సిమ్లా సదస్సు సందర్భంగా ఈ రేఖను ఖాయం చేశారు. ఈ సదస్సుకు చైనా ప్రతినిధి కూడా హాజరై రేఖను అంగీకరించారు. చైనా, భారత్‌ల మధ్య అప్పటి నుంచి ఇదే వాస్తవాధీన రేఖగా ఉంటూ వస్తోంది. తూర్పు భాగంలోని ఈ వాస్తవాధీన రేఖను మెక్‌మోహన్‌ రేఖగా పిలుస్తారు.

ఎందుకీ మాట మార్పు?

1949లో అధికారంలోకి వచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ వాస్తవాధీన రేఖను తర్వాత గుర్తించటానికి నిరాకరిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను తమ పురాతన పట్టణంగా కూడా పేర్కొంటోంది. ఇందుకు రాజకీయ, భౌగోళిక కారణాలు లేకపోలేదు.

  • చైనా అణచివేత నుంచి తప్పించుకొని ప్రస్తుత దలైలామా 1959లో టిబెట్‌ నుంచి భారత్‌లోకి అడుగుపెట్టింది తవాంగ్‌ ద్వారానే! అప్పట్లో తవాంగ్‌ బౌద్ధారామంలో ఆయన కొన్నాళ్లు ఆశ్రయం పొందారు కూడా!
  • ఇప్పటికీ తవాంగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో టిబెట్‌ బుద్ధిజాన్ని అనుసరించేవారున్నారు. వీరికి టిబెట్‌తో సాంస్కృతిక సంబంధాలున్నాయి. ముఖ్యంగా మోన్పా ఆదివాసీ ప్రజలు టిబెటన్‌ బుద్ధిజాన్ని పాటిస్తారు. అరుణాచల్‌లోని ఈ తెగలు... టిబెట్‌లో ప్రజాస్వామ్య ఉద్యమం ఆరంభిస్తాయన్నది చైనా అనుమానం. అందుకే ఈ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకొని వారి గొంతు నొక్కేయాలన్నది బీజింగ్‌ ఆలోచన అని చెబుతుంటారు.

కొత్త ల్యాండ్‌-బోర్డర్‌ లాతో...

అరుణాచల్‌ప్రదేశ్‌పై పట్టు సంపాదిస్తే భారత్‌పై దాడి చేయడం చైనాకు సులభమవుతుంది. వ్యూహాత్మకంగానే కాకుండా భౌగోళికంగానూ దానికిది దగ్గరి ప్రాంతం. దీంతోపాటు ఈశాన్య భారతానికి నీటి సరఫరాను కూడా నియంత్రించగలుగుతుంది. పైన అనేక డ్యామ్‌లు కట్టిన చైనా కావాలంటే కరవు సృష్టించగలదు. లేదంటే వరదలు పుట్టించగలదు. టిబెట్‌లో పుట్టిన ట్సాంగ్పో నది... భారత్‌లో బ్రహ్మపుత్రగా మారుతుంది. 2000 సంవత్సరంలో టిబెట్‌లోని ఓ డ్యామ్‌ కారణంగా ఈశాన్య భారతంలో వరదలు వచ్చి దాదాపు 30 మంది మరణించారు. కొద్దికాలంగా అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం సరిహద్దుల్లో చైనా భారీగా తమ సైన్యాన్ని మోహరించింది. ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఫిబ్రవరిలో ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్లారు కూడా. ల్యాండ్‌ బోర్డర్‌ లా పేరిట 2022లో చైనా కొత్త చట్టం తీసుకొచ్చింది. సరిహద్దుల్లో సైన్యంతో కలసి పౌర పాత్రను పెంచటం దీని ఉద్దేశం. దీనికింద భారత సరిహద్దులను ఆనుకొని అనేక భారీ నిర్మాణాలు చేపడుతోంది. రోడ్డు, రైలు సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటోంది. తమ ప్రాంతాలుగా ప్రకటించుకొని వాటి పేర్లు కూడా మార్చేస్తోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌ను తమ పటంలో చూపించటం, ప్రాంతాల పేర్లు మార్చటం అందులో భాగమే.

అక్సాయ్‌ చిన్‌ను కూడా..

1949లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక టిబెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లే భారత లద్దాఖ్‌లోని భూభాగమైన అక్సాయ్‌ చిన్‌ను 1950 తర్వాత క్రమంగా చైనా చుట్టుముడుతూ వచ్చింది. 1962 యుద్ధంతో ఆ స్వాధీనం అధికారికమైంది.

  • నివాసాలకు అనువుగాని శీతల ఎడారి ప్రాంతమిది. పెద్దగా వానలు కురవవు. మంచూ పడదు. ఏమీ మొలవదు. విస్తీర్ణంలో భూటాన్‌ అంత ఉంటుంది. వెయ్యేళ్ల కిందట తమ రాజ్యంలో ఇది భాగమని చెప్పి అక్సాయ్‌ చిన్‌ స్వాధీనాన్ని సమర్థించుకుంటోంది చైనా! 1920కి ముందు ఏ అధికారిక చైనా పటం కూడా అక్సాయ్‌ చిన్‌ చైనాదని చూపలేదు. కానీ తాము స్వాధీనం చేసుకున్న టిబెట్‌కు, షిన్‌జియాంగ్‌ రాష్ట్రానికి అనుసంధానం చేయటానికిగాను అక్సాయ్‌ చిన్‌పై అది కన్నేసింది. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ అక్సాయ్‌ చిన్‌ మీదుగా భారీ రహదారిని నిర్మించింది. తద్వారా భారత్‌తో వాస్తవాధీన రేఖ దగ్గరకు తన సైన్యాలను మోహరించటానికీ మార్గం వేసుకుంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు