ఇజ్రాయెల్‌పై దాడి తథ్యం!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి అనివార్యమా..! రానున్న వారం రోజుల్లో ఎప్పుడైనా ఇజ్రాయెల్‌పై ఆ దేశం విరుచుకుపడనుందా..? అవుననే అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు.

Published : 07 Apr 2024 03:59 IST

మధ్యలో మీరు తలదూర్చకండి
అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌/వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి అనివార్యమా..! రానున్న వారం రోజుల్లో ఎప్పుడైనా ఇజ్రాయెల్‌పై ఆ దేశం విరుచుకుపడనుందా..? అవుననే అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై సోమవారం జరిగిన దాడిలో రెవిల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఏడుగురు కీలక సభ్యులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్‌ భగ్గుమంటోంది. ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ యంత్రాంగానికి కీలక సందేశం పంపింది. ఇజ్రాయెల్‌పై తాము దాడి చేయడం ఖాయమని అందులో పేర్కొంది. మధ్యలో అమెరికా తలదూర్చకూడదని కోరింది. ‘‘అమెరికా జాగ్రత్త..  నెతన్యాహు ఉచ్చులో పడొద్దు. ఈ విషయంలో మీరు దూరంగా ఉండాలి. అలా అయితే మీపై దాడి జరగదు’’ అని యూఎస్‌కు తాము పేర్కొన్నట్లు ఇరాన్‌ ఉన్నతాధికారి మహమ్మద్‌ జంషిది తెలిపారు. ఇందుకు అమెరికా స్పందిస్తూ.. పశ్చిమాసియాలో తమ స్థావరాలపై దాడి చేయొద్దని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ నేరుగా దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అగ్రరాజ్యం అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ వరకు పరిమితమైన ప్రస్తుత యుద్ధం.. మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని