Messina Denaro: వేట ముగిసింది.. 30 ఏళ్లకు చిక్కిన ఇటలీ మాఫియా బాస్!
ఇటలీ మోస్ట్ వాంటెడ్ మాఫియా బాస్ మాటియో మెస్సినా డెనారో ఎట్టకేలకు అరెస్టయ్యాడు. 30 ఏళ్ల పరారీ అనంతరం అతను తాజాగా పోలీసులకు చిక్కాడు.
రోమ్: దాదాపు 30 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇటలీ(Italy)కి చెందిన మోస్ట్ వాంటెడ్ మాఫియా బాస్ మాటియో మెస్సినా డెనారో(Matteo Messina Denaro) ఎట్టకేలకు పట్టుబడ్డాడు. సిసిలీ(Sicily) పాల్మెరోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికంగా వందలాది దారుణాలకు పాల్పడిన ‘కోసా నోస్త్రా(Cosa Nostra)’ మాఫియా గ్యాంగ్‌కు అతను అధిపతి అని చెబుతుంటారు. 1992లో యాంటీ- మాఫియా ప్రాసిక్యూటర్లు జియోవన్నీ ఫాల్కోన్, పాలో బోర్సెల్లినోల హత్యతోపాటు 1993లో మిలన్, ఫ్లోరెన్స్, రోమ్‌లలో బాంబు దాడుల కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. తన గ్యాంగ్ ద్వారా అక్రమ వ్యాపారాలు, మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా వంటి నేరాలకూ పాల్పడ్డాడు. తన శత్రువులతో శ్మశానవాటికను నింపగలనని డెనారో గతంలో ఒకసారి ప్రగల్భాలు పలకడం గమనార్హం.
కోసా నోస్త్రా రహస్యాలు తెలిసిన చివరి వ్యక్తి డెనారోనేనని అధికారులు భావిస్తున్నారు. అత్యంత భారీ స్థాయి నేరాలకు పాల్పడిన వారి పేర్లు, ఇతర సమాచారం అతని వద్ద ఉన్నాయని ఇన్‌ఫార్మర్లు, ప్రాసిక్యూటర్‌లు విశ్వసిస్తున్నారు. 1993 నుంచి పరారీలో ఉన్నప్పటికీ.. రహస్య ప్రదేశాల నుంచి తన గ్యాంగ్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం. చాలాసార్లు అతను పోలీసులకు చిక్కినట్లే చిక్కి.. తప్పించుకున్నాడు. 2013లో అతని సోదరి, సహచరులను అరెస్టు చేశారు. అతని విలువైన వ్యాపారాలనూ కట్టడి చేశారు. 1992ల నాటి ఫొటోలే ఉండటంతో.. ఎప్పటికప్పుడు డిజిటల్ మిక్సింగ్ ద్వారా ప్రస్తుతం ఎలా ఉంటాడో మార్పులు చేస్తూ వచ్చారు. 2021 సెప్టెంబరులో నెదర్లాండ్స్‌లోని ఒక రెస్టారెంట్‌లో డెనారోగా భావించి వేరే వ్యక్తిని అరెస్టు కూడా చేశారు.
డెనారోను అరెస్టు చేసి తీసుకెళ్తున్నప్పుడు ప్రజలు వీధుల్లో నిలబడి స్థానిక పోలీసులను అభినందిస్తూ చప్పట్లు కొడుతున్నట్లు స్థానిక మీడియాలో వీడియోలు ప్రసారమయ్యాయి. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా సోదరుడు పియర్సాంటిని 1980లో కోసా నోస్త్రా చంపేసింది. ఆ నేపథ్యంలో.. డెనారో అరెస్టుపై మత్తరెల్లా హర్షం వ్యక్తం చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సైతం.. నేర మాఫియాలోని అతి ముఖ్యమైన వ్యక్తిని బంధించడంపై భద్రతాసిబ్బందిని అభినందించారు. వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో దేశానికి ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. అతని అరెస్టులో 100 మందికి పైగా సాయుధ దళాల సభ్యులు పాల్గొన్నారు. సిసిలీలోని ఆస్పత్రిలో క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని, ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?