Jinping: బ్రిక్స్‌ సదస్సులో జిన్‌పింగ్‌ అయోమయం.. వీడియో వైరల్‌!

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఊహించని పరిస్థితి ఏదురైంది. బ్రిక్స్‌ సదస్సుకు వెళ్తోన్న క్రమంలో ఆయన సహాయకుడిని భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు.

Published : 25 Aug 2023 01:56 IST

జొహాన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit)లో పాల్గొన్న చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)కు.. అక్కడి ఓ సభా ప్రాంగణంలో ఊహించని పరిస్థితి ఎదురైంది. తన వెంట వస్తోన్న సహాయకుడిని అక్కడి భద్రతా సిబ్బంది బలవంతంగా అడ్డుకోవడంతో.. ఏం జరుగుతోందో తెలియక ఆయన కొద్దిసేపు అయోమయానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్‌ ఓ హాల్‌ వైపు నడుచుకుంటూ బయల్దేరారు. మార్గమధ్యలో చైనా ప్రతినిధి ఆయన్ను అనుసరించేందుకు యత్నించారు. కానీ, ఆ హాలు ప్రవేశ ద్వారం వద్ద అక్కడి భద్రతాసిబ్బంది ఆ ప్రతినిధిని అడ్డుకున్నారు. బలవంతంగా అతడిని నిరోధిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ప్రవేశ ద్వారాన్ని మూసివేశారు. ఇది గమనించిన జిన్‌పింగ్‌ కాస్త ఇబ్బందిగా ముందుకెళ్లినట్టు కనిపించింది. అంతలోనే కొద్దిసేపు నిలబడిపోయారు. ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో.. వెనక్కు తిరిగి చూశారు. చివరకు నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. అయితే, చైనా ప్రతినిధిని ఎందుకు అడ్డుకున్నారో తెలియాల్సి ఉంది.

ముచ్చటించుకున్న మోదీ-జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌లోకి కొత్తగా 6 దేశాలు..!

ఇదిలా ఉండగా.. బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత జిన్‌పింగ్‌ల మధ్య ప్రత్యేక భేటీ ఉంటుందా? అనే విషయంపై ఆసక్తి నెలకొన్నప్పటికీ.. అటువంటి సమావేశం జరగలేదు. కానీ, వేదికపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఇరు నేతల మధ్య సంభాషణ చోటుచేసుకుంది. మోదీ ఏదో చెబుతుండగా.. జిన్‌పింగ్‌ దాన్ని వింటూ ముందుకు సాగారు. సమావేశం అనంతరం ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని