BRICS: ముచ్చటించుకున్న మోదీ-జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌లోకి కొత్తగా 6 దేశాలు..!

ఇప్పటివరకు ఐదు దేశాల కూటమిగా ఉన్న ‘బ్రిక్స్‌’ (BRICS)లో కొత్తగా మరో ఆరు దేశాలు చేరనున్నాయి. ఇందుకు కూటమి సభ్యదేశాలు అంగీకరించాయి.

Published : 24 Aug 2023 16:34 IST

జొహాన్నెస్‌బర్గ్‌: ఇప్పటివరకు ఐదు దేశాల కూటమిగా ఉన్న ‘బ్రిక్స్‌’ (BRICS) మరింత విస్తరించనుంది. కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, అర్జెంటీనా, యూఏఈ, సౌదీ అరేబియాలు ఈ కూటమిలో శాశ్వత సభ్యులుగా చేరతాయని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోస ప్రకటించారు. భారత ప్రధాని మోదీతోపాటు ఇతర సభ్యదేశాధినేతల సమక్షంలో ఈ ప్రకటన చేసిన సిరిల్‌.. వచ్చే జనవరి 1 నుంచి ఆ దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ‘బ్రిక్స్‌’లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.

బ్రిక్స్‌ విస్తరణకు సై.. ఏకాభిప్రాయంతో సభ్యత్వం ఇద్దామన్న మోదీ

బ్రిక్స్‌ (BRICS) విస్తరణకు భారత్‌ ఎప్పుడో మద్దతు తెలిపిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కూటమి విస్తరించాలనే నిర్ణయం.. భిన్న ధ్రువాల ప్రపంచంలో అనేక దేశాల విశ్వాసాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. కాలానుగుణంగా మార్పులు అవసరమనే సందేశం ఈ కూటమి విస్తరణ ఇస్తోందన్నారు. కొత్తగా ఆరు దేశాలు చేరికకు సభ్య దేశాలు అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మూడు రోజుల పాటు జరిగిన సదస్సులో (BRICS Summit) అనేక సానుకూల ఫలితాలు వచ్చాయని భారత ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

మోదీ, జిన్‌పింగ్‌ ముచ్చట

బ్రిక్స్‌ సదస్సులో భారత్‌-చైనా అధినేతల మధ్య ప్రత్యేక భేటీ ఉంటుందా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నప్పటికీ అటువంటి సమావేశం జరగలేదు. కానీ, వేదికపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ల (Xi Jinping) మధ్య సంభాషణ చోటుచేసుకుంది. మోదీ ఏదో చెబుతుండగా.. జిన్‌పింగ్‌ దాన్ని వింటూ ముందుకు సాగారు. సమావేశం అనంతరం ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని