Israel Hamas Conflict: ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు

Israel Hamas Conflict: ఇజ్రాయెల్‌పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు.

Published : 06 May 2024 08:19 IST

జెరూసలెం: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధంపై (Israel Hamas Conflict) వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. తమని తాము రక్షించుకోవడం నుంచి ఏ ఒత్తిడీ ఆపలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ పోరాటంలో ఒంటరిగా వెళ్లాల్సి వస్తే.. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

‘‘రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. మాకు అప్పుడు ఎలాంటి రక్షణ లేదు. ఏ దేశమూ మాకు అండగా నిలవలేదు. మా విధ్వంసం కోరుకుంటున్న ప్రత్యర్థులను ఈరోజు మళ్లీ ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో ఏ నాయకుడు, ఎలాంటి ఒత్తిడి, ఏ అంతర్జాతీయ సంస్థ నిర్ణయమూ మమ్మల్ని మేం రక్షించుకోవడం నుంచి ఆపలేదు’’ అని తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నెతన్యాహు (Benjamin Netanyahu) అన్నారు.

అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో గాజా యుద్ధానికి వ్యతిరేకంగా కొనసాగుతన్న నిరసనలనూ నెతన్యాహు తప్పుబట్టారు. వాటిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ వర్సిటీల్లో జరిగిన వివక్షాపూరిత ఘటనలతో పోల్చారు. అవి తాము కొనసాగిస్తున్న యుద్ధంపై నిరసనలు కావని.. తమ ఉనికిని సవాల్‌ చేయడమని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒత్తిడీ తమ చేతులను బంధించలేదన్నారు. విజయం సాధించే వరకు పోరాడతామని పునరుద్ఘాటించారు.

కీలక క్రాసింగ్‌పై హమాస్‌ దాడి

హమాస్‌ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ (Israel) యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోరులో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రూ.లక్షల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది పొట్టచేతపట్టుకొని సాయం కోసం అర్థిస్తున్నారని ఇప్పటికే పలుసార్లు ఐరాస తెలిపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తీరును అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తప్పుబడుతున్నాయి. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. వీలైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. నరమేధానికి పాల్పడుతోందన్న ఆరోపణలతో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌లోని ఓ విభాగంపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. కొన్ని సంస్థలు, వ్యక్తులపైనా చర్యలకు ఉపక్రమించింది. రఫాలోనూ భూతల దాడులకు పాల్పడితే తమ సహకారం ఉండబోదని హెచ్చరించింది. బ్రిటన్‌ సైతం పలు సందర్భాల్లో ఈ తరహా హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు (Benjamin Netanyahu) తాజా వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని