Portugal: పోర్చుగల్‌లో భారతీయ గర్భిణీ మృతి.. దేశ ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా

పోర్చుగల్‌లో (Portugal) భారతీయ కుటుంబానికి విషాద ఘటన ఎదురయ్యింది.

Updated : 02 Sep 2022 09:06 IST

తీవ్రంగా పరిగణించిన పోర్చుగల్‌ ప్రభుత్వం.. దర్యాప్తునకు ఆదేశం

లిస్బన్‌: పోర్చుగల్‌లో (Portugal) భారతీయ కుటుంబానికి విషాద ఘటన ఎదురయ్యింది. గర్భిణిగా ఉన్న భారత మహిళకు సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోర్చుగల్‌ ప్రభుత్వం.. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అంతేకాకుండా ఈ దారుణ ఘటనకు అక్కడ వైద్య సదుపాయాల కొరతే కారణమని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మార్టా టెమిడో (Marta Temido) రాజీనామా చేశారు.

భారత్‌కు చెందిన 34 ఏళ్ల ఓ మహిళ పోర్చుగల్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఆమె.. ప్రసవం కోసం రాజధాని నగరంలోని సాంతా మారియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి ప్రసూతి విభాగంలో ఖాళీ లేకపోవడంతో నగరంలోని మరో ఆస్పత్రికి తరలించేందుకు నిర్ణయించారు. అలా తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్సులో ఉండగానే ఆ మహిళ గుండెపోటు వచ్చింది. మరో ఆస్పత్రికి చేరేలోపే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అత్యవసర సిజేరియన్‌ చేసిన వైద్యులు చిన్నారిని బయటకు తీశారు. ప్రస్తుతం ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

తాజా ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో పోర్చుగల్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోగ్యశాఖ బాధ్యతల్లో టొమిడో ఇక కొనసాగలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో టొమిడో విశేష సేవలు అందించారని.. అయినప్పటికీ తాజాగా చోటుచేసుకున్న ఘటనతో ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని పోర్చుగల్‌ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా వెల్లడించారు.

వేధిస్తోన్న నిపుణుల కొరత..

పోర్చుగల్‌లో ఇటువంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ గైనకాలజి నిపుణులతోపాటు ఇతర వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో పలు ప్రసూతి ఆస్పత్రులు మూసివేసినట్లు తెలుస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వైద్య నిపుణులను ఇతర దేశాల నుంచి నియమించుకుంటున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇదిలాఉంటే, మార్టా టెమిడో 2018 నుంచి ఆరోగ్య మంత్రిగా కొనసాగుతున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడంలో ఆమె విశేష కృషి చేశారనే పేరుంది. అయినప్పటికీ ఇటీవల అక్కడ వైద్యసేవల సంక్షోభం తీవ్రం కావడంతో వాటిని ఎదుర్కొనేందుకు మరో దారి లేకపోవడం.. దీంతో గర్భిణిలు  ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడడంతో టెమిడో రాజీనామా చేసినట్లు అక్కడి డాక్టర్స్‌ అసోసియేషన్స్‌ పేర్కొన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని