రష్యా చేతికి అణు సునామీ ఆయుధం..!

ప్రపంచ నౌకాదళ చరిత్రంలో గత వారం అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఆవిష్కారమైంది. ఈ ఆయుధం సముద్రంలోని అత్యంత లోతుల్లో రహస్యం ఉండగలదు.. అవసరమైతే సముద్రపు అలలనే ఆయుధంగా మార్చి శత్రుదేశ తీరప్రాంత నగరాలపైకి సునామీ వలే ప్రయోగించగలదు. అదే ‘కే-329 బెల్గోరోడ్‌

Published : 15 Jul 2022 01:56 IST

 పశ్చిమదేశాలను భయపెడుతున్న ‘బెల్గోరోడ్‌’ జలాంతర్గామి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచ నౌకాదళ చరిత్రలో గత వారం అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఆవిష్కృతమైంది. ఈ ఆయుధం సముద్రంలోని అత్యంత లోతుల్లో రహస్యంగా ఉండగలదు.. అవసరమైతే సముద్రపు అలలనే ఆయుధంగా మార్చి శత్రుదేశ తీరప్రాంత నగరాలపైకి సునామీ వలే ప్రయోగించగలదు. అదే ‘కే-329 బెల్గోరోడ్‌’ జలాంతర్గామి. దీని రాకతో సముద్రంపై జరిగే యుద్ధాల్లో కొత్త శకం మొదలైంది. ఇటీవల రష్యాకు అత్యంత కీలకమైన కోలా ద్వీపకల్పానికి సమీపంలోని తెల్ల సముద్రంలో సెవెరోడిన్స్క్‌లో రష్యా అమ్ములపొదిలోకి చేరింది. 604 అడుగుల పొడవుతో ఉన్న ఈ సబ్‌మెరైన్‌  ప్రపంచంలోనే భారీదని నిపుణులు చెబుతున్నారు. గతంలో రష్యా నిర్మించిన ఆస్కార్‌శ్రేణి సబ్‌మెరైన్‌ పొడవును పెంచి అణు టార్పిడో పొసైడాన్‌ను ప్రయోగించేలా ఏర్పాట్లు చేశారు.

గతేడాదే రహస్యంగా సముద్రంలోకి..

బెల్గోరోడ్ సబ్‌మెరైన్‌ గతేడాదే రహస్యంగా తొలిసారి సముద్రంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో నల్ల సముద్రంలో ఉన్న అమెరికా, బ్రిటన్‌ నౌకలను దెబ్బతీస్తుందని భయపడ్డారు. కానీ, ఈ ఏడాది జనవరిలో సముద్రంలో పరీక్షలు పూర్తిచేసుకొందని రష్యా వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి జులై 31న దీనిని నౌకాదళానికి అందజేయాల్సి ఉన్నా.. రష్యా సేనలు యుద్ధంలో ఉండటంతో వాటిల్లో నైతికస్థైర్యం పెంచేందుకు మూడు వారాల ముందే కమిషన్‌ చేశారు. దీనిని నౌకాదళానికి అందజేసే సమయంలో రష్యా నేవీ చీఫ్‌ నికోలాయ్‌ యెమినేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సబ్‌మెరైన్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌లకు, లోతైన ప్రదేశాల్లో రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు డీప్‌సీ, అటానమస్‌ అండర్‌ వాటర్‌ వెహికల్స్‌ను తీసుకెళ్లగలదని వెల్లడించారు. ఈ అంశాలను విశ్లేషించిన పశ్చిమదేశాల సైనిక నిపుణులకు కొన్ని కీలక విషయాలు అర్థమయ్యాయి. ఈ సబ్‌మెరైన్‌కు అనుబంధంగా మరో చిన్న అణుశక్తి సబ్‌ మెరైన్‌ కూడా ఉంటుంది. 

సముద్రంలోని అత్యంత లోతుల్లో ఉండే కేబుల్స్‌ను ధ్వంసం చేసేందుకు బెల్గోరోడ్‌ను ఉపయోగించే అవకాశాలున్నాయని గుర్తించారు. ఇదే నిజమైతే యుద్ధ సమయంలో పశ్చిమ దేశాల కమ్యూనికేషన్లను ఈ సబ్‌మెరైన్‌ తీవ్రంగా దెబ్బతీయగలదని అట్లాంటిక్ కౌన్సిల్‌ సంస్థ పేర్కొంది. కోవర్టు ఆపరేషన్లకు, సమాచార తస్కరణకు దీనిని ఉపయోగించే అవకాశం ఉంది.  97శాతం ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌తోపాటు రోజుకు 10 ట్రిలియన్‌ డాలర్లు విలువైన లావాదేవీలు ఈ అండర్‌ వాటర్‌ కేబుల్స్‌పై ఆధారపడి ఉన్నాయి.  

అణుటార్పిడోల మోహరింపు..

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’గా అభివర్ణించిన అణు టార్పిడోలను అమర్చేందుకు వీలుగా ఆస్కార్‌-2క్లాస్‌ సబ్‌మెరైన్‌ పొడవును 100 అడుగులకు పెంచారు. ఈ సబ్‌మెరైన్‌లో ఒక్కోటి 79 అడుగుల పొడవైన ఎనిమిది  పొసైడన్‌ అణు టార్పిడోలు ఉంటాయి. ఈ టార్పిడోలు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తాయి. ఇవి గంటకు 70 నాట్స్‌ నుంచి 125 నాట్స్‌ వేగంతో పనిచేస్తుంటాయి. 

ఈ ఆయుధాన్ని రష్యా ప్రతిదాడికి మాత్రమే వినియోగిస్తుంది. పొసైడన్‌ను తీర ప్రాంతంలోని లక్ష్యాలపై దాడికి వినియోగిస్తారు. ఇవి ఆయా లక్ష్యాల సమీపంలోకి వెళ్లి అణుపేలుడు జరుపుతాయి. దీనిలో కనీసం 2 టన్నుల కోబాల్ట్‌ వార్‌హెడ్‌ అమర్చినా.. కొన్ని వందల కిలోమీటర్ల మేరకు నీరు కలుషితమైపోతుంది. ఫలితంగా రేడియో యాక్టివ్‌ పదార్థాలు కలిసిన భారీ నీటి అలలు సునామీ వలే ఆ లక్ష్యాలపై పడతాయి. దీనిని తీర ప్రాంతంలో రద్దీగా ఉండే నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, సముద్రంలోని క్యారియర్‌ బ్యాటిల్‌ గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తారు.  

2015 రష్యా టీవీలో పొసైడాన్‌కు సంబంధించిన సమాచారం అనుకోకుండా లీకైంది. వాస్తవానికి రష్యానే కావాలని అమెరికాను హెచ్చరించేందుకు సమాచారాన్ని లీక్‌ చేసినట్లు ఆ తర్వాత సీఐఏ నిర్ధారించింది. పొసైడాన్‌ రకం ఆయుధాల్లో పలు వేరియంట్లు ఉన్నాయని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. కొన్ని అండర్‌వాటర్‌ డ్రోన్లు కాగా.. మరికొన్ని తీర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలుగా భావిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని