Israel: ఇజ్రాయెల్‌కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత

రఫాపైకి దూకుడుగా వెళుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా గట్టి షాక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన బాంబుల సరఫరాను ఆపేసింది. 

Published : 08 May 2024 10:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాటలను పెడచెవిన పెట్టి గాజాలోకి చొచ్చుకెళుతున్న ఇజ్రాయెల్‌ (Israel)కు ఓ షాక్‌ ఎదురైంది. వాషింగ్టన్‌ నుంచి అందాల్సిన కీలక ఆయుధాల షిప్‌మెంట్‌ను నిలిపేసినట్లు తెలుస్తోంది. ఒక్కోటీ 900 కేజీల బరువుండే 1,800 బాంబులు,  226 కేజీల బరువుండే మరో 1,700 బాంబులు ఇప్పుడు టెల్‌అవీవ్‌కు అందవు. ఈ విషయాన్ని బైడెన్‌ కార్యవర్గంలోని కీలక అధికారి ధ్రువీకరించారు. రఫాలో పౌరుల భద్రత, వారికి మానవీయ సాయంపై అమెరికా ఆందోళనలు పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఆపరేషన్‌పై అమెరికా మొదటి నుంచి అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. 

తాము సరఫరా చేస్తున్న ఆయుధాలను జనసాంద్రత తీవ్రంగా ఉన్న చోట్ల ఏ విధంగా ఉపయోగిస్తారనే ఆందోళనలు కూడా అగ్రరాజ్యంలో ఉన్నాయి. ప్రస్తుతం రఫాలో దాదాపు 10 లక్షల మందికిపైగా తలదాచుకొంటున్నారు. ఈ నేపథ్యంలో  ‘‘రఫాలో భారీ ఆపరేషన్లు చేపట్టకూడదని. ఆ ప్రాంతంలోకి మానవీయ సాయం పంపించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు వీలుగా చర్చలు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ రఫాలో వాడుతుందని అనుమానిస్తున్న ఆయుధాల ఎగుమతిని పునఃసమీక్షిస్తున్నాం’’ అని అమెరికా వర్గాలు వెల్లడించాయి.  వీటిల్లో జేడామ్‌ కిట్స్‌ సరఫరా అంశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్‌ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 

మరో వైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్‌ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్‌ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఐడీఎఫ్‌ యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ తమకు తెలిపినట్లు ఈజిప్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ రఫా క్రాసింగ్‌ నుంచే ఆదివారం రాత్రి హమాస్‌ దళాలు దక్షిణ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించాయి. 

రఫాపై సోమవారం ఇజ్రాయెల్‌ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. కాల్పుల విరమణకు హమాస్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇది తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ బెంజమిన్‌ నెతన్యాహు తిరస్కరించారు. ఆ వెంటనే ఇజ్రాయెల్‌ యుద్ధ కేబినెట్‌ సమావేశమై.. రఫాపై మిలిటరీ ఆపరేషన్‌కు పచ్చజెండా ఊపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని