Prigozhin: అసలు ప్రిగోజిన్‌ ప్లాన్ ఏమిటీ..?

ఇద్దరు కీలక వ్యక్తులను బంధించాలనే లక్ష్యంతో రష్యాలో వాగ్నర్‌ అధిపతి ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేశాడని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి.   

Updated : 29 Jun 2023 18:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా(Russia)లో తిరుగుబాటు చేసిన వాగ్నర్‌ బాస్‌ ప్రిగోజిన్‌ (Prigozhin)రక్షణశాఖలో ఇద్దరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొన్నాడని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ పేర్కొంది. వీరిని బంధించాలనే లక్ష్యంతో అతడు రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌లోని సైనిక స్థావరాన్ని ఆధీనంలోకి తీసుకొన్నాడని వెల్లడించింది. రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, ఆర్మీ జనరల్‌ గెరసిమోవ్‌ ఉక్రెయిన్‌ సరిహద్దుల సందర్శనకు వచ్చిన సమయంలో తన కుట్రను అమలు చేయాలని ప్రిగోజిన్‌ భావించాడు. ఈ కుట్రను రెండు రోజుల ముందే రష్యా ఫెడరల్‌ సెక్యూరిటి సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) పసిగట్టింది. దీంతో ప్రిగోజిన్‌ కూడా చివరి నిమిషంలో తన పథకాన్ని పూర్తి మార్చుకొని మాస్కో దిశగా కిరాయి సైన్యంతో కవాతు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మార్గం మధ్యలో ఉన్న రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌లోని సైనిక స్థావరాలను వాగ్నర్‌ గ్రూప్‌ ఆక్రమించుకొంది. ప్రిగోజిన్‌ తిరుగుబాటును నిలిపివేసే సమయానికి ఈ కిరాయి సైన్యం మాస్కో వైపు పయనం మొదలుపెట్టింది.

ఈ మొత్తాన్ని చూస్తే కీలక సైనిక నాయకత్వాన్ని బంధించాలనే ఉద్దేశంలో ప్రిగోజిన్‌ ఉన్నాడని ఐరోపాకు చెందిన భద్రతా నిపుణులు వెల్లడించారు. కాకపోతే అతడి వద్ద కచ్చితమైన ప్రణాళిక ఉందనడానికి ఆధారాలు లేవన్నారు. మరోవైపు రష్యా సైన్యంలోని ఓ కీలక కమాండర్‌కు కూడా శుక్రవారం రాత్రి  ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేస్తాడనే విషయం తెలుసని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. ఈ తిరుగుబాటు మొదలయ్యాక అతడే ప్రిగోజిన్‌ను వెనక్కి తగ్గాలని కోరాడని పేర్కొన్నాయి. ఈ రకంగా తాను పుతిన్‌ పక్షం వహిస్తున్నట్లు సంకేతాలు పంపినట్లు వెల్లడించాయి. ఐరోపాలోని కొన్ని ఇంటెలిజెన్స్‌ వర్గాలు మాత్రం.. ప్రిగోజిన్‌ పథకాల గురించి రష్యా భద్రతా దళాల్లోని కొన్ని వర్గాలకు తెలిసినా.. వాటిని ఉన్నత స్థాయిలోని వారికి తెలియజేయలేదని చెబుతున్నాయి. అతడి పథకాలు విజయవంతం కావాలని వారు ఆశించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు రష్యా నేషనల్‌ గార్డ్‌ డైరెక్టర్‌ విక్టర్‌ జొలోటోవ్‌ ఇటీవల మాట్లాడుతూ రష్యా సీనియర్‌ అధికారులకు ప్రిగోజిన్‌ పథకాల గురించి తెలుసని వెల్లడించారు. అతడితో సన్నిహితంగా ఉండేవారే వాటిని వెల్లడించారని చెప్పుకొచ్చారు. పశ్చిమదేశాల ఇంటెలిజెన్స్‌సంస్థల హస్తం దీనిలో ఉందని ఆరోపించాడు. అందుకే వారికి సైనిక తిరుగుబాటు గురించి వారాల ముందుగానే తెలుసన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు