Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
29 గ్రామాల్లో భూసమీకరణ
భూ సమీకరణలో ఇళ్లకు మినహాయింపు
ప్రతి సమస్యకూ శాస్త్రీయ పరిష్కారం
అన్నదాతల కోర్కెలపై స్పందించిన సీఎం
రైతులతో చర్చించి ప్రతిపాదనలతో
రావాలని ప్రత్తిపాటి, శ్రావణ్‌లకు సూచన
ఈనాడు- హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే రైతుల అపోహలన్నీ పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు సూచించారు. భూసమీకరణ వ్యవహారంపై స్థానికంగా ఉన్న పరిస్థితులను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ప్రతి అంశానికీ వివరణ ఇచ్చి రైతులకు నచ్చజెప్పాలని సూచించారు. వెంటనే వీరిద్దరినీ క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో మరింత స్పష్టంగా మాట్లాడి వారి కోరికలపై మరింత నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఉపసంఘం సభ్యుల సమాచారం మేరకు.. తాను సింగపూర్‌ పర్యటనకు వెళ్లివచ్చిన తర్వాత మరోసారి దీనిపై కలిసి కూర్చొని చర్చిద్దామని చంద్రబాబు చెప్పారు. దీంతోపాటు ప్రతి గ్రామం నుంచి నలుగైదుగురు పెద్దలను హైదరాబాద్‌కు తీసుకొస్తే వారితో స్వయంగా మాట్లాడుతానని పేర్కొన్నారు. రైతులు లేవనెత్తే ప్రతి అనుమానాన్ని శాస్త్రీయపద్ధతిలో నివృత్తిచేయాలని, ప్రతి సమస్యకూ అదే తరహాలో పరిష్కారం చూపాలని సూచించారు. అందుకే రాజధాని ప్రాంత పరిధిలోని భూముల వివరాలన్నీ సేకరించాలని చెప్పారు. ఏరైతుకు ఎంతభూమి ఉంది? ఇళ్లులేని నిరుపేదలెంతమంది ఉన్నారో లెక్కలు తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రతి రైతుకూ న్యాయం చేసేలా చర్యలు తీసుకుందామని సమావేశంలో పాల్గొన్న మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావులకు చెప్పారు. రైతులతో భూసమీకరణ ఒప్పందాలు కుదర్చుకోవడానికి ఒక నమూనా పత్రాన్ని తయారు చేయాలని సూచించారు.
విభాగాలుగా రాజధాని విభజన: రాజధాని సరిహద్దుల పరిధిలో మొత్తం 40వేల ఎకరాల భూమి ఉంటుంది. దాని పరిధిలోకే 29 గ్రామాలు, జాతీయ రహదారి నుంచి ఆ గ్రామాలవైపున్న మంగళగిరి పట్టణం వస్తుంది. భూసమీకరణ సమయంలో ప్రభుత్వం ఈ గ్రామాలు, మంగళగిరి పట్టణంలోని ఇళ్ల జోలికి వెళ్లదు. వీటితోపాటు చెరువులు, కుంటలు, కొండలు, దేవాదాయ, ప్రభుత్వ, అటవీ భూములు కలిపి సుమారు పదివేల ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఇది మినహాయించి నికరంగా సమీకరించే భూమి 30వేల ఎకరాలకు పరిమితమవుతుంది. ప్రభుత్వం ఇదివరకు ప్రకటించిన గ్రామాల విషయంలో అపోహలు తలెత్తాయి. అందువల్ల దీనిపై మరింత స్పష్టతనిస్తూ శనివారం ఉదయం చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో మొత్తం 29 గ్రామాల పరిధిలో భూసమీకరణ జరపాలని నిర్ణయించారు. ఈ గ్రామాల్లో సుమారు 2,455 ఎకరాల పరిధిలో ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. రాజధాని ప్రాంతాన్ని ప్రతి ఐదువేల ఎకరాలను ఒక జోన్‌ చొప్పున విభజిస్తారు. ప్రతి జోన్‌లోనూ 650-850ఎకరాలతో ఆరేడు సెక్టార్లు ఏర్పాటుచేస్తారు. ప్రతి సెక్టార్‌లో ఉద్యానవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, వాణిజ్య సముదాయాల్లాంటి ఉమ్మడి అవసరాలకు స్థలం కేటాయిస్తారు. ఇవి పోను నయారాయపూర్‌లో మాదిరి ప్రతి ఎకరాలో 200 మంది జీవించడానికి వీలుగా ఆధునిక వసతులతో ఇళ్లు నిర్మించే వీలు కలిగిస్తారు.
రైతుల ప్రశ్నలకు బాబు సమాధానాలు: రాజధాని ప్రాంత పరిధిలోని రైతులు, వివిధపార్టీల నాయకులతో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ సమావేశమైనప్పుడు తలెత్తిన ప్రశ్నలు, కోర్కెలపై చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా రైతుల ప్రశ్నలకు చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...

రాజధానిప్రాంత పరిధిలో రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తారా?
ఇప్పటివరకూ ఈ అంశంలో ఎలాంటి నిషేధం లేదు. ఇకమీదటా ఇదే కొనసాగిద్దాం.

సమీకరణలో భూమి పోతే వ్యవసాయ కూలీల ఉపాధి పరిస్థితి ఏంటి?
జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. గుంటూరులో తక్షణమే నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేద్దాం. రాజధాని నిర్మాణ పనుల్లో ఉపయోగించుకొనే విధంగా కూలీలందరికీ వివిధ రకాల శిక్షణ ఇద్దాం. ఇప్పటికన్నా మరింత మెరుగైన ఉపాధి లభించేలా చూద్దాం.

భూ అభివృద్ధి చేసి జాగాలు (ప్లాట్లు) ఇచ్చేందుకు నిర్ణీత కాల వ్యవధి ఉండాలి
ఏడాదిలోగా అభివృద్ధి చేస్తాం. ఆ తర్వాత వీలైనంత త్వరగా వారికి అందజేస్తాం.

భూమిపై ఉన్న మొత్తం రుణాలు మాఫీ చేయాలి
లక్షన్నర రూపాయల వరకు ఉన్న బ్యాంకు రుణాలను ఏక మొత్తంగా (వన్‌టైం సెటిల్‌మెంట్‌) తక్షణం మాఫీచేద్దాం. రాష్ట్రవ్యాప్తంగా మిగతా వారికి 20 శాతం చొప్పున విడతలుగా ఇవ్వనున్నాం. ఇక్కడ ఒకేసారి ఇచ్చేస్తాం.

దేవాదాయ భూముల విషయంలో పరిహారం ఎలా?
సంబంధిత దేవాలయాల అభివృద్ధికే ఆ నిధులు ఇస్తాం.

భూసేకరణ ప్రాంతంలోనే అభివృద్ధి చేసిన జాగాలు (ప్లాట్లు) ఇవ్వాలి
ఆ ప్రాంతంలోని సెక్టార్‌లో స్థలం కేటాయిస్తాం. వీటిని లాటరీ ద్వారా ఇస్తాం.

రెవిన్యూ దస్త్రాలను క్రమబద్ధీకరించాలి
ఇప్పటికే దీనిపై కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశాం.

అసైన్డ్‌ భూములకు పరిహారం ఎలా?
ఇప్పటికే ప్రకటించినట్లుగా ఎకరాకు 750 గజాలు ఇస్తాం.

స్థలాలు లేని పేదలకు ఇళ్లు ఎలా?
పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుంది.

అభివృద్ధి చేసిన జాగా (ప్లాట్‌)తో పాటు వాణిజ్య వినియోగానికి కూడా స్థలం కేటాయించాలి
దీనిపై మంత్రివర్గఉపసంఘం ప్రతిపాదనలు సిద్దం చేయాలి.

కృష్ణా నదీతీర కరకట్టల పటిష్ఠత ఎలా?
నదీ తీరం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు ఉండవు. వివిధ రూపాల్లో పచ్చదనం, ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తాం. మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.

పంటభూములపై ఇచ్చే వార్షిక పరిహారం పెంచాలి.
తొలుత ఎకరాకు 25వేల చొప్పున లభిస్తుంది. తర్వాత ఏటా 1250 రూపాయల చొప్పున పెరుగుతుంది.

పంటల సాగుద్వారా ప్రస్తుతం లభిస్తున్న ఆదాయానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలి
ఆ ప్రాంతంలో సాగవుతున్న పంటలు, కూరగాయలు, అరటి, కంద, ఇతర పంటల సాగుపై పూర్తిస్థాయి నివేదిక తయారుచేయండి. ఏ పంట నుంచి ఎంత ఆదాయం వస్తోందో లెక్కించండి. దాని ఆధారంగా పరిహారం నిర్ణయిద్దాం.

సేకరించిన తర్వాత వచ్చిన స్థలాలను బదిలీ చేసుకోవడానికి హక్కులుంటాయా?
తప్పకుండా ఇస్తాం. పూర్తిస్థాయిలో హక్కులుంటాయి.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net