సమస్య మీది.. పరిష్కారం యాప్‌ది..

తాజావార్తలు


సమస్య మీది.. పరిష్కారం యాప్‌ది..
ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక యాప్‌లు
చిత్రాలు తీసి పంపితే చాలు చర్యలు
దేశాభివృద్ధిలో ఇలా భాగస్వాములు కావొచ్చు
నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా అమలుచేసిన సంచలనాత్మక నిర్ణయం పెద్దనోట్ల రద్దుపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యేక ‘మోదీ’ యాప్‌ ద్వారా ప్రధానమంత్రి తెలుసుకుంటున్నారు. ఇదే కోవలో ప్రధాన సమస్యల పరిష్కారానికి సైతం పలు యాప్‌లను ప్రధాన మంత్రి గతంలోనే ప్రజల చెంతకు తెచ్చారు. వాటి విశేషాలు తెలసుకుందామా....

మీ కాలనీ వీధులు చెత్తతో నిండిపోయాయా.. రహదారులు బాగా లేక ఇబ్బందులు పడుతున్నారా.. స్థానిక అధికారులు.. ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదా.. ఉన్నతాధికారులకు చెప్పండి.. అక్కడా ఫలితం లేదా.. నేరుగా ప్రధానమంత్రి దృష్టికీ తీసుకెళ్లండి. ఇవన్నీ ఆచరణలో సాధ్యమయ్యేవేనా అనుకుంటున్నారు కదూ! ఆ సందేహమే అవసరం లేదు. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు. నిర్ణీత గడువులోగా ఆ సమస్య పరిష్కారమవుతుంది.. సంబంధిత సమాచారం కూడా మళ్లీ మీకు చేరుతుంది.. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ‘యాప్‌’లతో సుసాధ్యమే.

క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకుంటోంది. స్వచ్ఛత, రహదారులు, వ్యవసాయం తదితరాలతో పాటు ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజా సమస్యలను నేరుగా ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా యాప్‌లను రూపొందించింది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మన వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉంటే సమస్య లేదా సంబంధిత పరిస్థితికి సంబంధించిన చిత్రాన్ని తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు అది నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుంది. తద్వారా సమస్య పరిష్కారమవుతుంది.

పాలనా పరుగుల కోసం..మై గవర్నమెంట్‌
క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వారినుంచి నేరుగా సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మై గవర్న్‌మెంట్‌’ అనే యాప్‌ను రూపొందించింది. ఇందులో పాలన తీరు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు కలుగుతున్న మేలుతో పాటు ప్రభుత్వం ఇంకా మెరుగ్గా పనిచేయాలంటే ఏయే విధానాలు అనుసరించడానికి అవకాశం ఉందనే అభిప్రాయాలను తెలియచేయవచ్చు.
రైతుల కోసం.. కిసాన్‌ సువిధ
పంట సాగులో రైతులు ఎప్పుడు ఏ మందు పిచికారీ చేయాలో, ఎరువులు ఎంత మోతాదులో వేయాలి, మార్కెట్‌ ధరలు, వాతావరణ వివరాలు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పొందేందుకు రూపొందించిన యాప్‌ ‘కిసాన్‌ సువిధ’. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ‘కిసాన్‌ సువిధ’ అని టైప్‌ చేశాక ఒక యాప్‌ తెరపై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తెరపై కనిపించే బాక్స్‌లో రైతు తన వివరాలను నమోదు చేయాలి. సస్యరక్షణ విభాగంలో పంటల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జిల్లాల వారీగా అందుబాటులో ఉండే శాస్త్రవేత్తల వివరాలు ఉంటాయి. పంట, సోకిన తెగులు వివరాలు నమోదు చేస్తే సస్యరక్షణ చర్యలను శాస్త్రవేత్తలు సూచిస్తారు. ఏ మార్కెట్‌లో ఏ పంటకు ఎంత ధర ఉందనే వివరాలను ఏ రోజుకారోజే తెలుసుకోవడానికి మార్కెట్‌ ధరల ఆప్షన్‌ ఉంది. దేశంలో ఎక్కడ ఎక్కువ ధర ఉందనే వివరాలూ తెలుసుకునే వీలుంది. యాప్‌లో డీలర్ల వివరాలు, వారి చరవాణి నెంబర్లు ఉంటాయి. దుకాణాలకు ఫోన్‌చేసి ఏయే ఎరువులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు, రప్పించుకోవడానికీ వీలుంది. యాప్‌లో వాతావరణం అంశం ప్రత్యేకంగా ఉంది. జిల్లాలో గాలిలో తేమ, వర్ష సూచనలు, ఉష్ణోగ్రత వివరాలూ తెలుస్తాయి.
ప్రగతి మార్గాలకు...: మేరీ సడక్‌ యోజన
రహదారులు లేక ఇబ్బంది పడుతున్నారా.. నిధులు మంజూరైనా రోడ్డు వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా.. నాణ్యత లోపించి వేసిన కొద్ది నెలలకే చెడిపోయాయా.. స్థానిక అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదా.. దీని కోసం ప్రభుత్వం ‘మేరీ సడక్‌ యోజన’ పేరిట కొత్త యాప్‌ను రూపొందించింది. యాప్‌ ఓపెన్‌ చేయగానే చరవాణి నెంబర్‌ అడుగుతుంది. అందులో ఉన్న ఫీడ్‌బ్యాక్‌లోకి వెళ్లి టేక్‌ ఫొటో ఆప్షన్‌ తెరవాలి. అది జీపీఎస్‌కు అనుసంధానమై కెమెరా తెరుచుకుంటుంది. సమస్యను ప్రతిబింబించే ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. రాష్ట్రం, జిల్లా, ప్రాంతం తదితర వివరాలతో పాటు రహదారి సమస్య వివరాలను నమోదు చేయాలి.
‘స్వచ్ఛ’భారత్‌ సాధనకు...: స్వచ్ఛత
మీ కాలనీలో చెత్తాచెదారాన్ని తొలగించ లేదా.. మురుగు కాలువలో మురుగు నీరు నిండి నా అధికారులు పట్టించుకోవడం లేదా.. మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు రావడం లేదా.. ఇలాంటి సమస్యల పరిష్కారం లక్ష్యంగా, స్వచ్ఛ భారత్‌ సాధన కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. చరవాణితో సమస్య ఫొటో తీసి ‘స్వచ్ఛత’ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు.. గడువులోగా సమస్య పరిష్కారమవుతుంది. సమస్య చిత్రాలను తీసి జిల్లా, ప్రాంతం, పేరు వంటి వివరాలతో యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. పురపాలక అధికారులు, ఉన్నతాధికారులకు ఈ యాప్‌ ఉండటంతో వివరాలు వెంటనే వారికి చేరతాయి. క్షేత్రస్థాయి అధికారులు సమస్యను పరిష్కరిస్తారు. తర్వాత దాన్ని తెలిసిన వారికి సమాచారం అందిస్తారు. ఇది జీపీఎస్‌ ఆధారంగా పనిచేస్తుంది. సమస్య పరిష్కారానికి గడువును ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. పరిష్కరించిన విషయాన్నీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సిఉండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది పరిష్కారానికి చొరవ చూపే వీలుంది.
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత ప్రవేశపెట్టిన యాప్‌ ‘మై గవర్నమెంట్‌’. దీనికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించడంతో పథకాల అమలుకు సంబంధించిన చాలా యాప్‌లకు రూపకల్పన చేశారు. ఇందులో సమాజాభివృద్ధికి దోహదపడే అంశాలను వివరించే వీలుంది. ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలియచేయవచ్చు. ఇందులో పొందుపరిచిన చాలా అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అమలు చేసిన సందర్భాలున్నాయి. ఇదే కోవలో ఆర్‌టీఐ(సమాచార హక్కు చట్టం), పర్యటక శాఖ, రైల్వేశాఖ, పాస్‌పోర్టు సేవలు తదితరాలకు సంబంధించిన ప్రత్యేకమైన యాప్‌లను ఆయా శాఖలు ఏర్పాటుచేశాయి.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.