Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu


jaateeyalu
పేరిగాడి రాజ్యం
తెలివితక్కువ వాడి వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. దారిని పోయే దానయ్య, ఎల్లయ్య, పుల్లయ్య ఇలాంటి పేర్లను అనామకులు అనే అర్థంలో వాడటం ఓ అలవాటుగా ఉంది. ఇక్కడున్న పేరిగాడు కూడా ఆ జాబితాలోవాడే. వీళ్లంతా ఏ ఒక్క వ్యక్తిని మాత్రమే సూచించేవారుకాక మొత్తం సమాజంలోని తెలివితక్కువ వారికి, అనామకులకు మారుపేర్లుగా వ్యవహారంలోకి రావడం విశేషం. ఈ విశేషాన్ని అనుసరించే ఎవరైనా తెలివితక్కువగా ఓ వ్యవహారాన్ని నడుపుతున్నప్పుడు, నాయకత్వ లక్షణాలు సరిగాలేనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

సొరకాయకోత
సొరకాయ మిగిలిన కూరగాయలకన్నా ఎంతో మెతకగా ఉంటుంది. అదే సొరకాయ మరింత లేతగా ఉంటే దాని మెతకదనానికి సాటి మరొకటి ఉండదు. అలాంటి
లేత సొరకాయను కొయ్యటం ఎంతో సులభం. లేత సొరకాయలను ఇట్టే కోసినంత సులభంగా కొంతమంది తెగ గొప్పలు చెబుతుంటారు. గొప్పలు చెప్పటాన్ని కోతలు
కొయ్యడం అని అంటారు. ఇది వాస్తవానికి మరీమరీ దగ్గరగా ఉంటే, అంటే విపరీతంగా ఎవరైనా గొప్పలు చెబుతుంటే ‘వాడు సొరకాయలు కోస్తున్నాడురోయ్‌’ అని
అనటం కనిపిస్తుంది.

ఉప్పు నిప్పు
ఇద్దరి మధ్యన ఉండే మనస్పర్ధలను, తగాదాలను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. తగాదా వల్ల ఎప్పుడూ తిట్టుకోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇదంతా శబ్దానికి సంబంధించినది. నిప్పులో ఉప్పు వేసినప్పుడు చిటపటమంటూ శబ్దం వస్తుంటుంది. ఈ చిటపటలను తగాదా వల్ల కలిగే తిట్లతో లేదా అభిప్రాయభేదాలతో పోల్చి చెప్పటం ఇక్కడ విశేషం. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు నిప్పనుకుంటే మరొకరు ఉప్పు అని భావించడం వల్ల ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.
నెత్తుటికూడు
హింసతో సంపాదించిన ధనం అని ఈ జాతీయానికున్న అర్థం. పాపాన్ని తెచ్చిపెట్టే విధంగా ప్రవర్తించి సంపాదించటం, ఒకరిని కష్టపెట్టి వారి సొమ్ముతో తాను సుఃంచటం అనేలాంటి వాటిని గురించి చెప్పాల్సినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

అంకుశం
చాలాపెద్ద మదపుటేనుగును మావటివాడు చిన్న అంకుశంతో నియంత్రిస్తుంటాడు. ఆ మదపుటేనుగు ఆకారంతోకానీ, శక్తితోకానీ పోల్చుకుంటే అంకుశం చాలా అల్పమైనదే. కానీ అంత ఏనుగును లొంగదీసే శక్తి ఆ అంకుశానికే ఉంటుంది. అలాగే కొంతమంది ఎంతో బలవంతులనుకున్నవారిని, పెద్దవారిని తమ తెలివితేటలతోనో, ఇతరత్రా వ్యవహారాలతోనో లొంగదీసుకుంటుంటారు. అలాంటి వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అంకుశంతో వారిని పోల్చి చెప్పటం ఈ జాతీయం విశేషం.
ఏనుగు మీద ఎలుక
భారం అనిపించని విషయం, తేలికైనది, సులువైనది అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏనుగుతో పోలిస్తే ఎలుక చాలా అల్పమైన జంతువు. ఎలుకను ఒకవేళ ఏనుగు మొయ్యాల్సివస్తే దానికి ఎలుక బరువు అని అనిపించదు. అసలు తన మీద ఎలుక ఉందన్న భావం ఏనుగుకు ఉండనే ఉండదు. అలాగే సంపన్నులు కొద్దిపాటి సహాయాన్ని చెయ్యటానికి ఏ మాత్రం బాధపడరు. ఆ సహాయం వారికి భారం కానీ, నష్టమని కానీ అనిపించదు. అలాంటి సంఘటనలను గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.
నిండుచెరువు
బాగా సమృద్ధిగా ఉండటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చెరువు నిండుగా ఉన్నప్పుడు వ్యవసాయానికి లేదా మంచినీటికి కొరతే ఉండదు. అంతా సమృద్ధిగా ఉంటుంది. చెరువులో నీరులాగే సిరిసంపదలు ఎవరి దగ్గరైనా సంమృద్ధిగా ఉన్నప్పుడు అలాంటి వారిని నిండుచెరువుతో పోల్చి చెప్పటం కనిపిస్తుంది.
చితగ్గొట్టడం
చితగొట్టడం లేదా చితుకకొట్టడం అనే రూపంలో ఈ జాతీయం కనిపిస్తుంటుంది. ఇటీవలి కాలంలో బహుళ ప్రచారంలోకి వచ్చిన జాతీయం ఇది. ఏ విషయంలోనైనా గొప్ప విజయాన్ని సాధించాడని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. క్రికెట్‌ లాంటి ఆటలాడే సమయంలో, చలనచిత్రాల్లో నటుల నటన బాగా ఉందని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా ఏదైనా సరే సంపూర్ణ విజయ సూచనగా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

డేగకన్ను
నిశితదృష్టి, జాగ్రత్తగా కనిపెట్టి ఉండటం, పరీక్షగా చూడటం అనే లాంటి అర్థాలు ఈ జాతీయానికున్నాయి. పక్షులలో డేగ కంటిచూపు చాలా నిశితంగా ఉంటుందంటారు. ఆకాశంలో చాలా ఎత్తున తిరుగుతూనే నేల మీద తనకు కావలసిన ఆహారాన్ని కనిపెట్టగల కంటిచూపు డేగకుంటుంది. అంత నిశితంగా ఎవరైనా, ఏదైనా విషయాన్ని చూస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

చిటికలో..
త్యంత తక్కువ సమయంలో, వెనువెంటనే అనే అర్థాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. శారీరక స్వభావాన్ని అనుసరించి చేతి బొటనవేలు, మధ్యవేలు రెండింటినీ గట్టిగా అదిమిపెట్టి బొటనవేలును వేగంగా కదిపినప్పుడు చిటుక్కుమనే శబ్దం వస్తుంది. ఈ శబ్దం వచ్చే సమయం చాలా తక్కువ. అంత తక్కువ సమయంలో ఏ పనైనా చేయవచ్చు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.
దిగబట్టటం
కిందకి లాగటం, కష్టాలపాలు చేయటం, అభివృద్ధికి ఆటంకంగా నిలవటం లాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. దిగువ భాగమంటే కింది భాగం. పైకి ఎదుగుతున్న దేనినైనా పట్టుకొని కిందికి లాగటమే ఈ దిగబట్టడం. అంటే అభివృద్ధి జరగకుండా పతనం చేయటం అనేది ఈ జాతీయానికున్న అర్థం.
పోకకు పుట్టెడు
ధికంగా దొరకటం, పంట బాగా పండటం, తక్కువ ధరకు ఎంతో ఎక్కువ ఫలితం లభించటం అనే అర్థాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. పోకచెక్క అనంటే వక్క అని అర్థం.
కేవలం అతి స్వల్పధర ఉన్న వక్కముక్కను ఇచ్చి పుట్టెడు ధాన్యాన్ని తెచ్చుకొన్న తీరులో లాభం వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఇదే పద్ధతిలో ఎప్పుడు ఎక్కడ
కొద్దిపాటి శ్రమకు కానీ, ధనానికి కానీ అంతకంటే ఎక్కువరెట్ల లాభం వచ్చినప్పుడు ఈ జాతీయంతో సూచిస్తుంటారు.

లేనిబతుకు
నీచపుబతుకు. బాగా దరిద్రంలో బాధపడుతూ జీవించటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. లేనితనం. లేనివాళ్లు అనంటే పేదరికం, పేదవాళ్లు అనే అర్థాలున్నాయి. ఈ అర్థాలాధారంగా లేనిబతుకు అనే జాతీయం దారిద్య్రాన్ని సూచించేదిగా కనిపిస్తుంది.

దొరపాడు వూరుపాడు
జాతీయంలో ఉన్న రెండు భాగాలలోనూ కనిపించే పాడు అనే పదానికి అర్థం పాడుబడిపోవటం అని. యథారాజ తథాప్రజా అనే సంస్కృత లోకోక్తికి దగ్గరదగ్గరగా ఉండే జాతీయం ఇది. వూరిని ఏలే దొర పాడుబుద్ధితో ఉంటే ఆ వూరి వారంతా అదే పాడుబుద్ధితో ఉంటారని ప్రజాపాలకులు ఈ కారణం చేతనే ఎప్పుడూ సన్మార్గంలో నడుచుకొంటూ పాలన మంచిగా ఉండేలా చూసుకోవాలనే సూక్తిని ఈ జాతీయం తెలియచెబుతుంది.
ముఖం చిట్లించటం
నిషి స్వభావం, హావభావ ప్రకటనల తీరు కూడా జాతీయాల ఆవిర్భావానికి వేదిక అయింది. మనసులో ఉన్న భావం శారీరకంగా ఉండే కదలికల వల్ల కూడా ప్రకటితమవుతూ ఉంటుంది. ఆనందం కలిగినప్పుడు కళ్లు విప్పారినట్టే కోపం కలిగినప్పుడు ముఖాన్ని చిట్లించినట్లు, కనుబొమ్మలు ముడిపడేటట్లు చేసి చూడటం అనేవి స్వభావసిద్ధంగా జరుగుతుంటాయి. కోపాన్ని ప్రకటించే ముందు జరిగే ప్రక్రియే ముఖం చిట్లించటం.
అడ్డుగోడ
టంకంగా నిలవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి అభివృద్ధికి కానీ, అభీష్టానికి కానీ ఆటంకం కలిగిస్తూ ఇబ్బంది పెడుతుండే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. కంటిచూపు మేర చూడటానికి గానీ, చక్కగా నడిచి వెళ్లడానికి కానీ వీలున్న సందర్భంలో ఎవరైనా మధ్యలో అడ్డంగా గోడ కడితే ఇటువారు అటు వెళ్లటం కానీ, చూడటం కానీ వీలుకాదు. హాయిగా గడిచిపోవాల్సిన పనులు నిలిచిపోతాయి. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. అతడు తన దుర్మార్గ ప్రవర్తనతో మన అభివృద్ధికి అడ్డుగోడగా నిలుస్తున్నాడు అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని గమనించవచ్చు.
తలదూర్చటం
లగచేసుకోవటం, జోక్యం చేసుకోవటం అనేవి ఈ జాతీయానికున్న అర్థాలు. తల అంటే ఆలోచన అని అర్థం. విషయం జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని పరిష్కరించేందుకు ఆ సందర్భంలో బయటి వ్యక్తి తన ఆలోచనలను చెప్పి అలా చేస్తే బాగుంటుందని అనటం తల దూర్చటానికున్న ప్రధాన లక్షణం. ఇక్కడ భౌతికంగా కాకపోయినా ఆలోచన రూపంలో సమస్య పరిష్కారానికి పూనుకోవటం అనే భావం ఈ జాతీయం ద్వారా స్ఫురిస్తుంది.

నోరు నొక్కటం
మాట్లాడనివ్వకుండా చేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నొక్కటం, నొక్కిపట్టడం అనే మాటలను పైకి రానివ్వకుండా అదుపు చేయటం అనే అర్థాలున్నాయి. ఈ అర్థాల నేపధ్యంలోనే ఈ జాతీయం అవతరించింది. చెప్పాలనుకుంటున్న మాటను చెప్పనీయకుండా ఏ విధంగా అడ్డుపడినా ఆ పరిస్థితిని ఈ జాతీయంతో పోల్చి చెప్పటం కనిపిస్తుంది. ‘నా నోరు నొక్కేశారు. అందుకే నేనేం చేయలేకపోయాను’ అనే లాంటి ప్రయోగాలు ఉన్నాయి.

నిప్పులు కక్కటం
తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కోపంగా మాట్లాడే మాటలు పరుషంగా ఉండి ఎదుటివారి మనసును బాధతో దహింపచేస్తాయి. దహించటమనేది నిప్పులకున్న లక్షణం. కోపానికి కూడా ఇటువంటి లక్షణమే ఉండటంతో దాన్ని నిప్పుతో పోల్చి చెబుతుంటారు. ఇలా ఈ జాతీయం బాగా కోపగించి పరుషంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ప్రయోగంలో కనిపిస్తుంది.

నోరు రావటం
మాట్లాడటం, మనసులోని భావాన్ని ప్రకటించటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మాటకు ప్రత్యాన్మాయ పదంగా నోరు అనే పదాన్ని వాడటం అలవాటుగా ఉంది. మాట నోటి నుంచే వస్తుంది. కనుక అలా మాట, నోరు సమానార్థకాలయ్యాయి. ఏ విషయాన్ని గురించైనా చెప్పాల్సింది చెప్పలేనప్పుడు నోరు రాలేదు అని అనటం కనిపిస్తుంది. అంటే ఈ సందర్భాన్ని బట్టి నోట మాట రాలేదు అనేదే దీనికున్న అర్థం.
పూటగడవటం
సామాన్యమైన రాబడి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. రోజులో మూడు పూటలుంటే కనీసం ఒక పూటైన తినటానికి తగిన ఆదాయం రావటమంటే అది చాలా సామాన్యమూ, సాధారణమూ అయిన రాబడికింద లెక్క. అంత రాబడి కూడా లేని నాడు పూటగడవటం కూడా కష్టంగా ఉంది అని అనటం వ్యవహారంలో వినిపిస్తుంది. ఏ పూటకాపూట గడవటమే అంతంత మాత్రం అని అన్నా ఇట్లాంటి అర్థమేవస్తుంది.
మూడు ముక్కల్లో చెప్పటం
సంగ్రహంగా, సంక్షిప్తంగా చెప్పటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. రామాయణం మొత్తాన్నీ కట్టె, కొట్టె, తెచ్చె అనే మూడు మాటల్లో చెప్పొచ్చంటారు. అంత పెద్ద రామాయణ కథను అలా సంగ్రహంగా, సంక్షిప్తంగా చెప్పినట్టుగానే కర్త, కర్మ, క్రియలు ఉంటూనే ఎక్కువ నిడివిలేకుండానే అందరికీ అర్థమయ్యేలా విషయాన్ని చెప్పటమే ఈ జాతీయానికున్న అర్థం. మాట అనే పదానికి ముక్క అనే పదం పర్యాయపదంగా వాడుకలో ఉంది. ఒక్కమాట కూడా మాట్లాడలేదు అని అనటానికి బదులు ఒక్క ముక్కా చెప్పలేదు అని అనంటం అందరికీ తెలిసిందే.

రెక్కలు కట్టుకు వాలటం
త్యంత వేగంగా రావటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. రెక్కలున్న పక్షులు మనిషి కన్నా వేగంగా ఒక చోట నుంచి మరోచోటికి మరలివెళతాయి. అంతటి వేగంతో ఎక్కడికైనా వెళ్లటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇష్టమైనవారి దగ్గరకు ఎవరైనా వేగంగా వచ్చి చేరుతున్న సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. రెక్కలు కట్టుకు వాలేవాడిని, రెక్కలు కట్టుకురావాలనిపించింది లాంటి ప్రయోగాలున్నాయి.

చేయెత్తి చెప్పటం
స్పష్టం చేయటం, నిర్భయంగా భావాన్ని ప్రకటించటం అనే లాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎవరైనా దీన్ని నేనే చేసాను అని స్పష్టం చేయటాన్ని కూడా ఈ జాతీయంతోనే పోల్చి చెప్పటం కూడా కనిపిస్తుంది. జంకు, భయంలాంటివి లేనప్పుడు చేసిన పనిలో తప్పు లేదని అనిపించినప్పుడు ఎవరైనాసరే ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి దీన్ని చేసింది నేనే అని చెప్పటం అనేది ఈ జాతీయంలోని ప్రధానార్థం.

గోడకేసిన సున్నం
కరికి ఇచ్చిన తర్వాత తిరిగిరానిది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గోడలు అందంగా ఉండేందుకు సున్నం వేస్తుంటారు. సున్నం గోడలకు వెయ్యటానికి సిద్ధం చేసినప్పుడు పెద్దపెద్ద తొట్లలో ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అదే సున్నాన్ని గోడకు వేసినప్పుడు గోడలు చూడటానికి చక్కగా ముచ్చటగా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంటాయి. కానీ ఆ గోడలకు వేసిన సున్నాన్ని తిరిగి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే దానివల్ల శ్రమతప్ప ఫలితం ఉండదు. వేశ్యలలాంటి వారికి ఇచ్చిన ధనం గోడలకు వేసిన సున్నంలాంటిదని అంటుంటారు.

పులి మీసాలను మెలిపెట్టడం
సాధ్యమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పులిని ముచ్చటపడితే దూరం నుంచి చూస్తే చూడవచ్చేమో. కానీ దగ్గరకు వెళ్లటం ప్రాణాంతకం. దగ్గరకు వెళ్లటమేకాక ఆ పులి మీసాలను పట్టుకొని మెలివేయటమంటే అది దాదాపు అసాధ్యమైన పని, ప్రమాదకరమైన పని అవుతుంది. అలా చేసినట్లు ఎవరైనా చెప్పినా నమ్మబుద్ధి కాదు. అదే పద్ధతిలో సామాన్య మానవుడికి చెయ్యటానికి కుదరని ప్రమాదకరమైన పనిని ఎవరైనా చేసినట్లు చెప్పినప్పుడు దాన్ని ఈ జాతీయంతో పోల్చి చెబుతుంటారు.

విశ్వరూపం
పూర్తి ప్రతిభా సామర్ధ్యాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. విశ్వరూప ప్రదర్శన అనేలాగా కూడా ఇది ప్రయోగంలో ఉంది. దీనికి మూలం మహాభారత కథే
అవుతుంది. భారతంలో కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభ సందర్భంలో ఎదుటి పక్షంలో ఉన్న బంధువులను, గురువులను చూసి అర్జునుడు కాళ్లూచేతులు ఆడక తాను యుద్ధం చేయనంటూ
వెనుతిరిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి వెంట తాను ఉన్నానని, తన గొప్పతనమేంటో అతడికి వివరించి చెప్పటానికి విశ్వరూపాన్ని ప్రదర్శించి గీతోపదేశం చేశాడు. ఆ విశ్వరూప
సందర్శనంతో అర్జునుడు కార్యోన్ముఖుడయ్యాడు. విశ్వరూపంలో శ్రీకృష్ణుడి ప్రతిభా సామర్థ్యాలు వెల్లడి అయిన స్థితికి అనుగుణంగా ఈ జాతీయం రూపొందింది. ఎవరైనా అత్యంత క్లిష్టమైన
పనిని తమ శక్తి సామర్థ్యాలన్నింటినీ ప్రదర్శించి సానుకూలం చేసినప్పుడు ‘‘అతడు తన విశ్వరూపాన్ని చూపి కార్యాన్ని ఫలవంతం చేశాడు’’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం మనకు
కనిపిస్తుంది.

గాడిద చాకిరి
మితిమీరిన సేవ అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వకాలం వస్తువులను మోసుకెళ్లేందుకు గాడిదలాంటి జంతువులను వినియోగించేవారు. చాకిరేవుల దగ్గర దుస్తులు ఉతకటం కోసం వాటి మూటలను గాడిదలమీదే వేసుకెళ్లేవారు. ఉప్పు కొఠారుల దగ్గర ఉప్పుమూటలను మొయ్యటానికి కూడా గాడిదలనే వినియోగించేవారు. ఇలా ఎక్కువ బరువును మోసేందుకు ఈ జంతువులను ఎంచుకొనేవారు కానీ, వాటికి కావలసిన ఆహారాన్ని అందించటంలోనూ, విరామాన్ని ఇవ్వటంలోనూ వాటి యజమానులు అంతగా శ్రద్ధచూపేవారు కారు. అయినా ఆ జంతువులు యజమాని తమ మీద వేసిన భారాన్ని మోస్తూనే కాలం గడిపేవి. ఇలాంటి సేవనే కొంతమంది మనుషులు కూడా చేస్తుంటారు. అలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ‘ఇంటిలోని వారంతా తినేందుకు అతడొక్కడే పొద్దుటి నుంచి అర్ధరాత్రి దాకా గాడిద చాకిరిలా ఏదో ఒకపని చేస్తున్నాడు’ అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
మంటమారితనం
అతికోపాన్ని ప్రదర్శించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కోపం అగ్నితో సమానం. అందుకే కోపాగ్ని అనే పదం ప్రయోగంలోకి వచ్చింది. కోపాగ్నికి ప్రతిరూపమే మంటమారితనం. మండిపడటం అన్నా కూడా విపరీతమైన కోపాన్ని ప్రదర్శించటం అనే అర్థముంది. ఈ అర్థాల క్రమంలోనే ఈ జాతీయం కూడా ప్రయోగంలోకి వచ్చింది.

లక్కలేని నగ బొక్కలేని మాంసం
సారహీనంగా డొల్లతనంగా ఉండే వాటిని గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. కొన్ని రకాల బంగారపు నగలు తయారుచేసే సందర్భాలలో ముందుగా లక్కతో నగరూపాన్ని రూపొందించి దానిమీద బంగారం తాపడం చేస్తుంటారు. దాంతో నగ గట్టిగా కనిపిస్తుంది. లక్క లోపల లేకపోతే ఆ బంగారు నగకు గట్టితనం ఉండదు. కొంతమంది మాంసాహారులు కూడా ఎముకతో కూడుకొని ఉన్న మాంసాన్నే ఇష్టపడుతుంటారు. బంగారునగలో లక్క లేకపోయినా, మాంసానికి ఎముక లేకపోయినా అవి అంత నాణ్యమైనవి కావు అనే భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

పూచిన తంగేడు
చెట్టూచేమ మొక్కమోడు రాయిరప్ప అన్నీ మన జాతీయాల ఆవిర్భావానికి స్ఫూర్తిప్రదాతలే. ఈ జాతీయంలోని తంగేడు అనే పదానికి అర్థం తంగేడు మొక్క అని. తంగేడు మొక్క ఆకులు కనిపించనంతగా పూత పూస్తుంది. దూరం నుంచి చూస్తే మొక్కంతా పువ్వులే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది జాతీయంగా అయ్యేసరికి ఒంటినిండా నగలను అలంకరించుకొని లేదా బాగా ఎక్కువగా ఎంత అలంకారమైతే చేసుకోవాలో అంతకన్నా ఎక్కువ అలంకారం చేసుకొని తిరిగేవారిని గురించి చెప్పేందుకు వాడుకలోకొచ్చింది. తంగేడు మొక్క పూలతో ఎలా అయితే నిండి ఉందో ఆ వ్యక్తి కూడా అలంకారాలతో అలా నిండి ఉన్నాడన్నది జాతీయంలోని భావన. అలాగే తంగేటి మొక్క పాలను జున్ను అని అంటారు. ఈ తంగేటి జున్ను పూర్వకాలంలో ఆహారంగా వాడుకలో ఉండేది. కాస్తంత తాగితే చాలా ఆకలి తీరి హాయిగా ఉండేది. పేదవారికి ఇది ప్రాణదాతగా, కడుపునిండి ఆహారపదార్థాంగా ఉంటూ ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే గృహస్థుడైనవాడు అందరికీ అందుబాటులో ఉండే తంగేటి జున్నులాంటివాడని మనుచరిత్రలో పెద్దన వర్ణించి చెప్పాడు.
బంగారం చిలుము పట్టదు
త్తడికి చిలుము పట్టినట్టు బంగారానికి చిలుము పట్టదు. అయితే ఇక్కడ ఈ రెండు లోహాలను ఒకటి సత్పురుషులకు, మరొకటి దుర్మార్గులకు పోలికగా తీసుకోవటమే విశేషం. ఇత్తడి దుర్మార్గులకు ప్రతీక. దానికి పట్టే చిలుము చెడ్డతనానికి పోలిక. బంగారానికి చిలుము పట్టదు అనంటే మంచిమార్గంలో నడవాలని స్థిర నిర్ణయం తీసుకొని జీవితాన్ని సాగించేవారికి అవినీతి అక్రమాల లాంటివి అబ్బవని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం కనిపిస్తుంది.
చీకిపోయిన గుండెలు...
ధికమైన వ్యథ, తీరని దుఃఖం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గుండె బద్దలు కావటం లాంటిదే ఇది. అయితే పాతవస్త్రాలు, చివికి (చీకి) పోయినట్లుగా బాధతో గుండె కూడా అలా అయిపోయింది అని కొద్దిగా అతిశయోక్తిగానే చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏదేమైనా మితిమీరిన మనోవ్యధ, విరహబాధ లాంటి వాటి తీవ్రతను ఈ జాతీయంతో సూచించటం కనిపిస్తుంది.
చీకటిని నెత్తినేసుకొని వెళ్లటం...
తెల్లవారుజామునే బయటకు వెళ్లిపోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. తెల్లవారుజామున చీకటిగానే ఉంటుంది. ఎండలో అయితే రక్షణ కోసం గొడుగును నెత్తిన పట్టుకొని వెళ్లటం జరుగుతుంటుంది. అదే చీకటిలో బయటకు వెళ్లేటప్పుడు ఆ చీకటినే గొడుగులాగా నెత్తిన పెట్టుకు వెళ్లాడన్న భావనతో రూపొందింది ఈ జాతీయం. చీకటితో వెళ్లటం, చీకటితో ప్రయాణం కావటం అనేలాంటి అర్థాల్లో కూడా ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

టకటకా...
ది ధ్వని అనుకరణానికి సంబంధించిన జాతీయం. త్వరత్వరగా అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అడిగిన ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు చెప్పటం అనే అర్థంలో టకటక చెప్పటం అనే రూపం ఉంది. కొన్నికొన్ని సందర్భాలలో చెప్పులు టకటకలాడించుకుంటూ వెళ్లిపోయాడు అని కూడా వినిపిస్తుంటుంది. ఈ సందర్భంలో నిర్లక్ష్యం, గర్వం అనేలాంటి అర్థాలు ఈ జాతీయానికి ఆపాదించటం కనిపిస్తుంది.

చచ్చి కడుపున పుట్టడం...
కొన్ని జాతీయాలు కొన్ని విశ్వాసాల ఆధారంగా అవతరించాయి. అలాంటి జాతీయాలలో ఇదొకటి. సంతానం కలగటమనేది రుణానుబంధానికి సంబంధించిందన్నది చాలా కాలం నుండి వస్తున్న ఓ విశ్వాసం. పశువులు, పుత్రులు, సుతులు, గృహాలు ఇలాంటివన్నీ పరస్పరం రుణానుబంధానికి సంబంధించినవే. నీటిరుణం, నిద్రరుణం అనేవి ఉంటాయని, ఆ రుణం తీరటం కోసమే కొన్ని చోట్లకు వెళ్లి నీళ్లు తాగటం, నిద్రపోవటం అనే లాంటివి జీవనక్రమంలో జరుగుతుంటాయని చెబుతుంటారు. ఈ జన్మలో ఒకరివల్ల సహాయం పొందితే మరుసటి జన్మలో వారికి సంతానంగా జన్మించి ఆ రుణాన్ని తీర్చుకోవచ్చనేది కొందరిలో ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసం ఆధారంగా ఈ నాటికీ ఏదైన గొప్పసహాయం పొందబోతున్నప్పుడు కానీ, పొందినప్పుడుకానీ ఈ జాతీయం వాడుకలో కనిపిస్తుంది.

కాళ్లు చల్లబడటం
నిరాశ, నిస్పృహలు ఆవరించడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సాధారణంగా ఒంట్లో శక్తి అంతా తగ్గి నిరాశపడ్డప్పుడు కాళ్లు చల్లబడుతుంటాయి. అది
ప్రాణాపాయస్థితికి సూచన కూడా. కొన్ని సందర్భాలలో నచ్చని విషయాలు, అనుకున్న పని కాకపోవడం అనేలాంటివి ఎదురైనప్పుడు మనిషికి పూర్తిగా నీరసం ఆవరిస్తుంది. ఆ స్థితి
ప్రాణాపాయస్థితితో సమానం అన్న భావనను వ్యక్తపరిచేందుకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

ఉడుకుబోతు
డుక్కోవడం అనంటే బాగా అసూయతోనో, కోపంతోనో ఉండటం అని అర్థం. ఉడుకు, పోతు ఉడుకుపోతు అనవుతుంది. తాగుబోతులాంటి రూపమే ఇది. ఉడుకుమోతుగా కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా ప్రతి చిన్నదానికి కోపగించుకునేవాడు, అసూయ చెందేవాడు అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.
పాలపొంగు
క్షణికం, స్వల్పకాల వ్యవధి అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. పాలను కాచినప్పుడు కొంతసేపటికవి పొంగుతాయి. అంయితే ఆ పొంగు ఎంతోసేపు ఉండదు. చాలా తక్కువ సమయంలోనే దిగిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని యవ్వనం లాంటివి జీవితంలో చాలా తక్కువ సమయమే ఉంటాయని చెప్పటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. అలాగే కొంతమంది పొందే సంతోషాలు, సుఖాలను కూడా పాలపొంగుతో పోల్చి చెప్పటం కనిపిస్తుంది.

నీటిబుడగ...
నీళ్లల్లో పుట్టిన బుడగ చాలా స్వల్ప వ్యవధిలోనే పగిలి కనుమరుగవుతూ ఉంటుంది. ఈ భావార్థాన్ని ఆధారంగా చేసుకొని అత్యంత తక్కువ కాలవ్యవధిని గురించి చెప్పేందుకు ఈ జాతీయాన్ని ఉదాహరణగా తీసుకుంటారు. లోక వ్యవహారంలో ఆయుప్రమాణం గురించి మాట్లాడేటప్పుడు మనిషి ఆయువునదే చాలా తక్కువని చెబుతూ జీవితం నీటిబుడగలాంటిదని అంటుంటారు.


నోరంతా పళ్లు.. వూరంతా అప్పులు
కొన్ని వాస్తవాలను మరికొన్ని వాస్తవాలతో పోల్చి చెబుతూ కొన్నికొన్ని జాతీయాలు ఆవిర్భవించాయి. అలాంటి వాటి వరుసలో ఇది కూడా ఒకటి. సర్వసాధారణంగా నోట్లో పైనా, కిందా పళ్లు ఉండటం మామూలే. నోరంతా పళ్లు అనంటే నోటిలో ఉండాల్సినన్ని పళ్లు అన్నీ ఉండటం అని అర్థం. అది ఎంత సహజమో అంతే సహజంగా ఓ వ్యక్తికి వూరంతా అప్పులున్నాయట. అలా వూరంతా అప్పులున్న వ్యక్తిని గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

పైత్యరోగికి పంచదార చేదు
జాతీయంలో కనిపించే పైత్యరోగి అనే పదానికి అధర్మాన్ని అనుసరించేవాడు అని అర్థం. పైత్యం ఉన్నప్పుడు పద్ధతి ప్రకారం కాక తన ఇష్టం వచ్చినట్టు ఏదేదో పిచ్చిగా ప్రవర్తించటం సహజం. అలా పైత్యరోగిలాగా ఏదేదో మాట్లాడుతూ ధర్మవిరుద్ధంగా నడుచుకొనేవాడికి పంచదారను పోలిన మంచి మాటలను ఎవరు ఎంతగా చెప్పినా నచ్చవు. పైగా ఆ మాటలను చేదును అసహ్యించుకున్నట్టు అసహ్యించుకుంటాడు. ఈ భావం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.

వెనకేసుకురావటం
క్షించటం, సమర్థించటం అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కొన్నికొన్ని సందర్భాలలో తమ వారిని ఎవరైనా ఎదుటివారు ఏ విషయంలోనైనా తప్పుపడుతూ ఉంటే తమవారిదే ధర్మమని సమర్థించి తప్పుపట్టటానికి వచ్చినవారిని దబాయించి పంపేస్తుంటారు కొంతమంది. అలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఆయన మీకేమౌతాడని? తప్పు చేశాడని తెలిసినా అలా వెనకేసుకొస్తున్నారు? అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ఎత్తుకొని
దే పదం ఎత్తుక అనే రూపంలో కూడా కనిపిస్తుంది. ఎత్తుకొని అనంటే సాధారణంగా దేన్నైనా భుజాలకెత్తుకోవటం, నెత్తికి ఎత్తుకోవటం అనే అర్థాలు వినిపిస్తాయి. అయితే ఎత్తుకొని అనే పదం జాతీయంగా మారినప్పుడు బిచ్చమెత్తుకోవటం అనే అర్థం ధ్వనిస్తుంది. ఎత్తుకొని, ఎత్తుక జీవించటం అనంటే హీనంగా, దీనంగా భిక్షాటన చేయటం అనే అర్థం వ్యాప్తిలో ఉంది. ఏకచక్రపురాన పాండవులు ఎత్తుక తిరిగారు’ అనే ప్రయోగం కనిపిస్తుంది.

అద్దంలో ముడుపు
న్నట్టు కనిపిస్తున్నా ఉపయోగం లేనిది, పనికిరానిది, పేరుకు మాత్రమే ఉన్నది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ముడుపు కట్టిన మూట వాస్తవంగా చేతికందితే దానిలో ఉన్న ధనం ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. కానీ అదే ముడుపు మూటను అద్దంలో చూపించి దాన్ని తీసుకోమంటే అద్దంలోని ముడుపు మూటను తీసుకోవటం కానీ, దానివల్ల ఏదైనా ప్రయోజనం పొందటం కానీ అసలు వీలుపడదు. అద్దంలోని ముడుపు మూటలాగానే కొంతమంది వ్యక్తుల ప్రవర్తన తీరు ఉంటుంది. వారు ఉన్నారన్న మాటేకానీ వారివల్ల ఎలాంటి ప్రయోజనం సమకూరదు. అలాంటి వారిని గురించి కానీ, అలాంటి పరిస్థితులను గురించి కానీ తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

గాలిలో మేడలు
కేవలం వూహకు మాత్రమే అందేవని వాస్తవానికి సాధ్యం కానివని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గాలిలో ఎలాంటి ఆధారమూ లేకుండా మేడలు కట్టడమనేది సాధ్యమయ్యే పనికాదు. అలాంటి అసాధ్యమైన పనులు కూడా మేం చేసేస్తాం, మావల్లే అవన్నీ అవుతాయి అని మభ్యపెట్టడం, మోసం చేయడం, లేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పటం చేస్తుంటారు కొందరు. అవన్నీ వినటానికి బాగానే ఉన్నా వాస్తవానికి ఎవరైనా చెబుతున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

కుక్కవంటి మనసు కూర్చుండనివ్వదు
నసును నిగ్రహించటం అంత తేలికైన పనికాదని తత్త్వచింతనతో పెద్దలు చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మనసు కుక్కలాంటిదంటారు. కుక్క పని ఉన్నా లేకపోయినా ఏదో తొందరపని ఉన్నట్టు పరుగెడుతూనే ఉంటుంది. ఒక చోట స్థిమితంగా ఉండదు. మనసు కూడా అలాంటిదేనన్న విషయాన్ని వివరించే సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ముఖం
పదానికి సాధారణ అర్థం మొగము. అయితే ఇది జాతీయంగా మారేసరికి భిన్నార్థాలు ధ్వనిస్తూ కనిపిస్తుంది. ఆ అర్థాలన్నీ దాదాపు నిరసనను వ్యక్తం చేసేందుకు ఉపయోగపడేవే. ునీ ముఖం.. నీకేం తెలుసు?’ అని అన్నప్పుడు అవతలి వ్యక్తికి ఏమీ తెలియదు. జ్ఞానహీనుడు అనే అర్థాలు ధ్వనిస్తాయి. అలాగే ుఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు’ అని అన్నప్పుడు అవతలి వ్యక్తి అంతకుముందు చేసిన ద్రోహం, అన్యాయంలాంటి వాటిని నిరసించే ధోరణి కనిపిస్తుంది. ఇలా ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.
వానాకాలపు చదువు
రిగా సాగని చదువు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వకాలం గురుకుల వ్యవస్థలో చెట్ల కింద చదువులు సాగుతుండేవి. అలాంటిప్పుడు ఏ కొద్ది వానజల్లు పడ్డా ఆ పూట చదువుకోవటానికి ఇబ్బందయ్యేది. దీనికి తోడు మబ్బుపట్టి సూర్యుడు కనిపించని రోజును అనధ్యయన దినం అని అంటూ ఆ రోజున చదువుసాగేది కాదు. వర్షాకాలంలో చదువుకోవటానికి ఇంతకు ముందు రోజుల్లో ఇన్ని అడ్డంకులుండేవి. ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈనాడు కూడా సరిగా చదువు సాగకపోయినా, సరిగా చదువుకోకపోయినా అలాంటి చదువును వానాకాలపు చదువు అని అనటం కనిపిస్తుంది.
తలబొప్పి కట్టడం..
లచింది జరక్కపోగా కష్టాల పాలుకావటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు లేదా మరేదైనా పనిచేస్తున్నప్పుడు తలకు ఏ వస్తువైనా తగిలి బొప్పి కడితే బాధపడుతూ ఆ మనిషి అక్కడే కాసింతసేపైనా ఆగిపోవటం జరుగుతుంటుంది. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. ుప్రతిపక్షం వారు వేసిన ప్రశ్నలతో ప్రభుత్వానికి బొప్పి కట్టింది’ అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి.

చదరంగం
మామూలుగా అయితే ఇది క్రీడావిశేషం. ఈ క్రీడలో ఎత్తులు, పైఎత్తులు ఉంటాయి. ఎదుటి వారిని పూర్తిగా ఎలా జయించాలో మనసులో ఆలోచిస్తూ ఈ ఆటలోని పావులను కదుపుతూ ముందుకు వెళ్లటం జరుగుతుంటుంది. ఇదే తీరులో సునిశితంగా పరిశీలిస్తూ, ఆలోచిస్తూ తమ శత్రువర్గాన్ని జయించటం కోసం ఎవరైనా పథక రచనచేస్తూ ఉంటే ఆ సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ప్రధానంగా రాజకీయవర్గాల నడుము సాగే వ్యవహారాలను ఈ జాతీయంతో సూచిస్తుంటారు. ుఈ రాజకీయ చదరంగంలో ఈ పక్షంవారు ఎదుటివారిని తమ శక్తియుక్తులతో జయించగలిగారు’లాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడుతారు.

ఇక్ష్వాకుని కాలం
ంతో ప్రాచీన కాలం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇక్ష్వాకు అనే రాజు జీవించిఉన్న కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని ఏర్పడింది ఈ జాతీయం. సూర్యుడికి సంజ్ఞాదేవి వల్ల వైవశ్వతుడు, యముడు అనే కుమారులు, యమున అనే కుమార్తె జన్మించారు. వైవశ్వతుడు మనువుల వరుసలో ఏడో మనువుగా అయ్యాడు. వైవశ్వత మన్వంతరం ఆయన పేరు మీదే వచ్చింది. ఈయననే శ్రద్ధదేవుడు అని కూడా అంటారు. ఈయన భార్య పేరు శ్రద్ధాదేవి. ఈ దంపతులకు తొమ్మిదిమంది బిడ్డలు కలిగారు. వారిలో పెద్దవాడి పేరు ఇక్ష్వాకు. శ్రీరామచంద్రుడి వంశానికి ఈయనే మూలపురుషుడు. ఈ ఇక్ష్వాకు అంత పురాతన కాలానికి చెందినవాడు. ఆ భావనతోనే ఎంతో పాతకాలం నాటిది అని చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఇక్ష్వాకుకాలంనాటిది అని అనటం కనిపిస్తుంది.


కాగల కార్యం గంధర్వులు తీర్చారు
చెయ్యాలనుకున్న పని ఎంతో కష్టమైనదైనప్పటికీ దాన్ని ఇంకొకరెవరో చేసి వెళ్లిపోతే వాస్తవంగా ఆ పని చేయవలసిన వారికి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడు, ఎక్కడ కనిపించినా ఈ జాతీయం వినిపిస్తుంటుంది. ఇది మహాభారతంలోని ఓ సన్నివేశం ఆధారంగా వాడుకలోకొచ్చింది. రాజభోగాలను అనుభవించాల్సిన పాండవులను కుయుక్తులు పన్ని వనవాసానికి పంపాడు దుర్యోధనుడు. అయినా దుర్యోధనుడి మనసులో పాండవుల మీద అసూయ తగ్గలేదు. దాంతో అడవులలో కష్టాలనుభవిస్తున్న వారిముందు తన రాజభోగాలన్నిటినీ ప్రదర్శించాలనుకున్నాడు. తన తండ్రి ధృతరాష్ట్రుడికి చెప్పాల్సిన మాయమాటలు చెప్పి తన పరివారాన్నంతటినీ తీసుకొని ద్వైత వనంలో పాండవులు నివాసం ఉంటున్న ప్రదేశానికి సమీపంలో ఉన్న ఒక సరోవరం ఒడ్డుకు చేరాడు. అవతలి ఒడ్డున పాండవులు సాధారణ జీవితం గడుపుతుంటే ఇవతలి ఒడ్డున పాండవులందరికీ కనిపించేలా తన భోగభాగ్యాలను, విలాసాలను అన్నిటినీ ప్రదర్శించసాగాడు దుర్యోధనుడు. అయితే దుర్యోధనుడు విడిది చేసిన ప్రాంతం చిత్రసేనుడు అనే గంధర్వుడికి చెందింది. తన ప్రదేశంలో తన అనుమతి లేకుండా దుర్యోధనుడు సేనాసపరివారంగా దిగటం గంధర్యుడికి కోపం తెప్పించింది. గంధర్వుడికి, కౌరవసేనకు నడుమ భీకరయుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో గంధర్వుల చేతిలో కౌరవులు ఓడిపోయి గంధర్వులకు బందీలయ్యారు. ఆ విషయాన్ని అవతలి ఒడ్డున ఉన్న భీముడు విని దుర్మార్గులైన కౌరవులను తాము జయించాల్సి ఉండగా కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు అని అన్నాడు. అయితే ధర్మరాజు మాత్రం కౌరవులు ఎన్ని దుర్మార్గాలు చేసినా తమ సోదరులే కనుక వారిని రక్షించుకోవాలనుకున్నాడు. చిత్రసేనుడు అర్జునుడికి స్నేహితుడు. కనుక అర్జునుడిని ఆ గంధర్వుడి దగ్గరకు పంపి దుర్యోధనాదులను విడిపింపచేశాడు. తన భోగాలను ప్రదర్శించి పాండవులను హేళన చేయాలనుకున్న దుర్యోధనుడు అలా చివరకు పాండవుల దయవల్ల బతికి బయటపడి తామే అవమానాలపాలయ్యాడు. భారతంలోని ఈ ఘట్టం ఇలా జాతీయంగా మారింది.
వేషం...
స్త్రాలను, ఆభరణాలను అలంకరించుకోవటం అనేది ఈ పదానికున్న సామాన్య అర్థం. ఇదే జాతీయంగా మారేసరికి భిన్నార్థం కనిపిస్తుంది. చేష్టలు అంటే ఒక వ్యక్తి చేసే పనులు అనే అర్థంలో జాతీయమై ప్రయోగంలో ఉంది ఈ పదం. ‘‘వాడివన్నీ పిచ్చి వేషాలు’’, ‘‘పిచ్చిపిచ్చి వేషాలువెయ్యకు’’ అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
నాథుడు
సామాన్యంగా ఈ పదానికి గృహపరంగా చూస్తే భర్త అని, రాజ్యపరంగా చూస్తే రాజు అని అర్థాలున్నాయి. అయితే ఈ పదం జాతీయంగా మారి వ్యవహారంలోకి వచ్చే సరికి అర్థం మారిపోయింది. దిక్కు, ఆధారం అనేలాంటి అర్థాలు జాతీయంగా మారిన నాథుడు అనే పదానికున్నాయి. నా బాధ తీర్చే నాథుడెవరో, నాకు ఉద్యోగం ఇచ్చే నాథుడెవరో అనేలాంటి రూపాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తోంది.

దిగు...
దిగు అనే పదానికి కిందికి రావటం, దిగుమతి కావటం, ప్రయాణం చేసి రావటం అనేలాంటి అర్థాలు మామూలుగా కనిపిస్తాయి. అయితే ఇదే పదం జాతీయంగా మారి ప్రయోగంలోకి వచ్చినప్పుడు సంబంధం కలుపుకోవటం అనే అర్థంలో ప్రయోగంలో కనిపిస్తుంది. ‘‘కిందకి దిగి వచ్చాడు’’, ‘‘దిగుమతి అయింది’’, ‘‘పది గంటల బండికి దిగాడు’’ అనే లాంటి అర్థాలు మామూలుగా దిగు అనే పదానికి ఉన్నాయి. కానీ ‘‘వాడితో వ్యాపారంలోకి నేను దిగను’’ అని అన్నప్పుడు వ్యాపారపరంగా సంబంధాన్ని కలుపుకోవటం అనే అర్థం ఈ జాతీయానికి స్ఫురిస్తుంది. అలాగే కొన్నిచోట్ల పౌరుషాన్ని తగ్గించుకోవటం, పట్టిన పట్టును కొద్దిగా సడలించటం, మరొకరికి అనుకూలంగా మారటం అనే అర్థాలు కూడా కనిపిస్తాయి. ‘‘ఓ మెట్టు కిందకి దిగాడు’’ అని అన్నప్పుడు పట్టిన పట్టును కొద్దిగా సడలించాడు అనే భావం స్ఫురిస్తుంది. ఇలా ఈ ఏకపద జాతీయం సందర్భానుసారంగా భిన్న అర్థాలలో వ్యాప్తిలో ఉంది.

కొయ్య...
సాధారణంగా ఈ పదానికి కట్టె అని అర్థముంది. ఏదైనా చెట్టుకు సంబంధించిన కట్టెను కొయ్య అని అంటుంటారు. జాతీయంగా మారేసరికి ఇది మనిషి అనే పదానికి ప్రత్యామ్నాయంగా వాడుకలోకి వచ్చింది. కొరకరాని కొయ్య అని అన్నప్పుడు మొండివాడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. అలాగే కట్టె అనే పదం కూడా శరీరాన్ని తెలిపే పదంగా వాడుకలో ఉంది. ప్రాణం పోయాక ఈ కట్టె కట్టెల్లో కలిసేదేగా అని అనటం కనిపిస్తుంది.
వడ్డన
భోజనం వడ్డించటమనేది దీనికున్న అర్థం. వండిన పదార్థాలను తినేందుకు వీలుగా పెట్టడం అనేది వడ్డన. అయితే ఈ పదం జాతీయంగా మారేసరికి తిట్టడం, కొట్టడం, భారం మోపటంలాంటి అర్థాలు వచ్చాయి. ుచెప్పిన పని చెయ్యకపోతే ఆయన నాలుగు వడ్డిస్తాడు.’ మళ్లీ ఛార్జీలను వడ్డించారు’, వీపు మీద నాలుగు వడ్డిస్తే తప్ప వీడు మాట వినేటట్టులేడు’’ అనేలాంటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి.


చంపటం..
మామూలుగా అయితే ఈ పదానికి ప్రాణాలు తియ్యటం అని అర్థం. చచ్చు అనే ధాతువు నుంచి చంపు అనే పదం ఏర్పడింది. ఈ చంపు లేదా చంపటం అనేది జాతీయంగా మారేసరికి విసిగించటం అనే అర్థం వ్యాప్తిలోకి వచ్చింది. ‘‘ఆ పని చెయ్యమని నన్ను చంపొద్దు.. ఎందుకు చంపుకుతింటావ్‌’’ ఇలాంటి ప్రయోగాలలో విసిగించటం అనే అర్థం ఈ పదానికి కనిపిస్తుంది.
బందరు లడ్డు
కొన్ని కొన్ని ప్రాంతాలు, అక్కడి విశేషాల ఆధారంగా కూడా జాతీయాలు ఏర్పడుతుంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. బందరు లడ్డు, కాకినాడ కాజా, చిలకలపూడి బంగారం, బంగినపల్లి మామిడిపండు, గుంటూరు గోంగూర, బాపట్ల వంకాయ ఇలాంటివన్నీ ఈ కోవకు చెందినవే. ఆ పదార్థాలు, వస్తువులు ఆయా ప్రాంతాలలో దొరుకుతూ ఆ ప్రాంతాలకు పేరు తేవటంతోపాటు జాతీయాలుగా మారే విశేషార్థంలో ప్రయోగంలో కనిపిస్తుంటాయి. బాగా తియ్యగా, రుచిగా, చూడముచ్చటగా ఉండే లడ్డూ బందరులో తయారౌతుందన్న అర్థం వాస్తవానికి ఉంది. కానీ చూడముచ్చటగా, ముద్దుగా, బొద్దుగా ఉన్న వారిని గురించి చెప్పేటప్పుడు బందరు లడ్డులాగుంది అని అనటం కనిపిస్తుంది.

సందు
పదానికి సాధారణ వ్యవహారంలో ఇరుకుగా ఉండే వీధి అనే అర్థముంది. విశాలంగా ఉండే వీధులు, రాజమార్గాలు వేరేగా ఉంటాయి. కొన్నికొన్ని చోట్ల ఇళ్ల మధ్య అటూఇటూ తిరగటం కోసం సన్నగా ఉండే జాగాలను వదులుతారు. వాటినే సందులు అని అంటారు. అయితే సందు అనే పదం జాతీయంగా మారేసరికి దాని అర్థం మారిపోయింది. ‘కొద్దిగా సందు దొరికితే చాలు మాటల్లోకి దిగుతారు’ అనే లాంటి సందర్భాలలో వ్యవధి, అవకాశం అనే అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
చేతడి ఆరటం
చేతికి ఉన్న తడి ఆరటం అనేది దీనికున్న సామాన్య అర్థం. చేతికి పట్టిన చెమట, అంటిన నీరు ఆరేందుకు పట్టేంత సమయం అని అర్థం అంటే చాలా తక్కువ వ్యవధి అనే అర్థంలో ఇది జాతీయంగా ప్రయోగంలో ఉంది. చేతడి ఆరకముందే ఈ పని చేయాలి అని అనటం కనిపిస్తుంది.
పెట్టు
ఉంచటం, ఇవ్వటం అనే అర్థాలు దీనికున్నాయి. అయితే ఇదే పదం జాతీయంగా ప్రయోగంలోకి వచ్చేసరికి సమానం అనే అర్థం కనిపిస్తుంది. పెట్టిపోతలు అన్నప్పుడు ఎదుటివారికి ఏవైనా వస్తువులనుకానీ, పదార్థాలనుకానీ ఇవ్వటం అనే అర్థం వస్తుంది. అక్కడపెట్టు, ఇక్కడపెట్టు అన్నప్పుడు ఒక వస్తువును అక్కడకానీ, ఇక్కడకానీ పెట్టడం అనే అర్థం ధ్వనిస్తుంది. కానీ జాతీయంగా వాడేటప్పుడు మాత్రం సమానం అనే అర్థం కనిపిస్తుంది. వీడొక్కడే వందమంది పెట్టు అని అన్నప్పుడు ఒక వ్యక్తి వందమందికి సమానం అని అర్థం.

పచ్చి
పదానికి ఎండనిది, కాయస్థితిలో ఉన్నది అనే అర్థాలు సహజంగా ఉన్నాయి. అయితే ఇదే పదం జాతీయంగా మారేసరికి అర్థం మారిపోయింది. అచ్చం, స్వచ్ఛం, కచ్చితమైన లాంటి అర్థాలలో ఇదే ప్రయోగంలో కనిపిస్తుంది. పచ్చినిజం చెబుతున్నాను విను అనేటప్పుడు స్వచ్ఛమైన సత్యం అనే అర్థంలో పచ్చినిజం వాడుకలో కనిపిస్తుంది.

తైలం
జాతీయ పదానికి సాధారణార్థాం నూనె. తిలల నుంచి వచ్చినది తైలం. కానీ ఇదే పదం జాతీయంగా మారేసరికి డబ్బు అనే అర్థం కనిపిస్తుంది. దీపం వెలగటానికి నూనె ఎంత అవసరమో మనిషి జీవితం గడవటానికి డబ్బు అంతే అవసరమన్న భావనతో ఇలా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చిందన్నది భావన.‘‘ఆ పని పూర్తిచేయటానికి సరిపోయినంత తైలం నా దగ్గర లేదు’’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.

గొడ్డు
క పదాలలో ఉన్న జాతీయాలలో ఇది కూడా ఒకటి. సాధారణంగా గొడ్డు అనే పదానికి పశువు అని అర్థం. మనిషికి, పశువుకు, పోలికలు చాలా ఉన్నా ప్రధానమైన భేదం మాత్రం ఒకటుంది. ఆహార భయ నిద్ర మైధునాల వంటివి మనిషికైనా, గొడ్డుకైనా సమానమే. అయితే భేదం మాత్రం జ్ఞానం. ఇదే ప్రధానం. జ్ఞానం ఉండబట్టి మనిషికి, గొడ్డుకు తేడా కనిపిస్తోంది. జ్ఞానంలేని కారణంగానే గొడ్డు మనిషికన్నా హీనంగా కనిపిస్తుంది. ఈ భావార్థంలోనే గొడ్డు అనేది జాతీయమైంది. జ్ఞానంలేని మనిషి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ‘‘వాడికి మాట్లాడటం చేతకాదు వాడొక గొడ్డు’’ అని అనటం కనిపిస్తుంది.
తూగు
జాతీయాలు పదబంధాలుగానే కాక అనంతర కాలంలో ఒక్కొక్క పదంగా కూడా ప్రయోగంలోకి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఏకపద జాతీయాలకు ఇదొక ఉదాహరణ. తూగు అనే పదానికి గటం, నిద్రపోవటం అనేవి సర్వసామాన్య అర్థాలు. అలాకాక ఆ పదం జాతీయంగా పరిణామం చెందేక వేరొక అర్థంలో ప్రయోగంలో కనిపిస్తుంది. ‘‘మీతో మేము తూగగలమా’’ అని అన్నప్పుడు ఈ ప్రయోగంలో కనిపించే తూగుకు సమానం, సామర్థ్యం అనే అర్థాలు ప్రయోగంలో ఉన్నాయి.

తలరాత
వాస్తవానికి ఈ రాత ఎవరికీ కనిపించదు. మరి ఇదెలా ఉంటుంది అనంటే ఎవరు ఏం చెప్పరు కానీ ఇదంతా నా తలరాత అని అనటం కనిపిస్తుంది. దీని అర్థమేమంటే పూర్వజన్మ కర్మానుభవం అని గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితాలే ఈ జన్మలో ఎవరైనా అనుభవించాల్సి వస్తుందని అంటుంటారు పెద్దలు. పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. పాపం చేసుకుంటే మాత్రం కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అలా కష్టాలను అనుభవించే సమయాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ప్రస్తుత జీవితం జరిగే తీరును బ్రహ్మదేవుడు నుదిటి మీద రాస్తాడన్న భావనతో దాన్ని తలరాత, నుదిటిరాత, బ్రహ్మరాత అనే విధాలుగా అంటుండటం కనిపిస్తుంది.

ఉద్ధరించటం...
క్షించటం, పైకిలాగటం అనేవి దీనికున్న అసలర్ధాలు. అయితే సహాయం చేయటం, సాధించటం అనే అర్థాల్లో జాతీయంగా మారేక ఇది ప్రయోగంలో కనిపిస్తుంది. ‘‘ఇప్పుడు చదువుకొని నువ్వు ఉద్ధరించేదేముంది, ‘‘నువ్వేదో ఉద్ధరిస్తావని నేనేనాడు అనుకోలేదు’’ అనేలాంటి ప్రయోగాలు వాడుకలో ఉన్నాయి. వంశోద్ధారకుడు, దేశోద్ధారకుడు, లోకాద్ధారకుడు అనేలాంటి చోట్ల రక్షకుడు అనే అర్థంలో ఇది ప్రయోగంలో ఉంది.
అవతారం
మయానికి తగ్గ ఏదో ఒక వేషం వేయటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. హిందూ పురాణాలననుసరించి ఉన్న దశావతారాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పడింది ఈ జాతీయం. వాస్తవానికి దిగిరావటం దీనికున్న అర్థం. కానీ జాతీయమయ్యేసరికి ఒక వ్యక్తి ధరించిన వేషం అనే అర్థం వాడుకలోకి వచ్చింది. ‘‘అబ్బబ్బ ఏమి అవతారంరా బాబు ఇది’’ అని విసుక్కోవడం, హాస్యాలాడటంలాంటి సందర్భాలలో ప్రయోగంలో కనిపిస్తుంది.
నాలుక కొనన నిలవటం...
క విషయాన్ని గురించి సంపూర్ణ జ్ఞానం ఉండటం అని, ఏమడిగినా వెనువెంటనే చెప్పగలిగినంతటి తెలివితేటలు ఉండటం అనే అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. విషయాన్ని చెప్పడానికి నోట్లో నాలుక ఉండాలి. అంటే దీన్నే మాటకారితనం అని కూడా అంటారు. నాలుక అనేది విషయ ప్రకటన లేదా భావప్రకటనలలో అంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. అలాంటి నాలుక చివరన చెప్పాల్సిన విషయమంతా ఉండటమంటే ఇక అవతలి వారికి ఆ విషయం చేరటమే తరువాయిగా ఉంటుంది. ఆ భావంతోనే ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

చెవికి చేదు
వీనులవిందులాంటి జాతీయాలకు ఇది వ్యతిరేకార్థాన్ని ఇచ్చే జాతీయం. కనులవిందు, వీనులవిందు అంటే కళ్లకు, చెవులకు ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉండటమని అర్థం. విందు రుచిగా ఉంటుందన్న భావనతో ఆ అర్థం వ్యాప్తిలోకి వచ్చింది. అదే చేదు అంటే ఎవరికీ రుచించదు. ఇబ్బందిగా ఉంటుంది. అంటే వినటానికి బాధను, ఇబ్బందిని కలిగించే అంశాలు ఉన్నప్పుడు దాన్ని చెవికి చేదు అని అనటం కనిపిస్తుంది.

దశ తిరగటం...
కాలం కలిసిరావటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇది జ్యోతిష్యశాస్త్ర సంబంధంగా ఆవిర్భవించిన జాతీయం. జ్యోతిష్యం ప్రకారం కొంతమందికి కొన్ని గ్రహాల దశలు అనుకూలంగా ఉంటాయన్నది నమ్మకం. ఆ అనుకూల కాలంలో ఏ కార్యం తలపెట్టినా చాలా సులువుగా విజయం లభిస్తుందని అంటారు. ఈ భావన ఆధారంగా అప్పటి దాకా ఎన్నెన్నో కష్టాలను అనుభవించి ఏ కారణం చేతనైనా ఒక్కసారిగా సంపదలు రావటమో, సుఖాలు ప్రాప్తించటమో జరిగితే ుఆహా వీడి కష్టాలు ఇన్నాళ్లకు తీరాయి. వీడి దశ తిరిగింది’ అని అనే లాంటి సందర్భాలలో ఈ జాతీౖయం వినిపిస్తుంది.
కల్లలాడైనా కాపురం నిలుపు
ర్మసూక్ష్మాన్ని ప్రకటించే జాతీయం ఇది. ఎప్పుడూ సత్యాన్నే పలకమన్నది ధర్మం. అయితే కొన్నికొన్ని సందర్భాలలో సత్యం పలికినందువల్ల ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. అటువంటి ప్రమాదాలు ఏర్పడకుండా సమాజం అంతా సుఖంగా ఉండగలగాలంటే పెద్దలు, అనుభవజ్ఞులు కొన్నికొన్ని ధర్మసూక్ష్మాలను చెప్పారు. వీటిని పురాణాలు, భారతంలాంటి గ్రంథాలు కథల రూపంలో కూడా అందిస్తున్నాయి. వివాహ సందర్భాలలోనూ, ప్రాణాపాయ పరిస్థితులలాంటి పరిస్థితులలోనూ అసత్యం చెప్పినా అది సత్యఫలితాన్నే ఇస్తుందన్నది ధర్మసూక్ష్మం. కల్లలు అనంటే అబద్ధాలు. అబద్ధాలాడైనాసరే ఓ భార్యభర్తను కలిపి వారి సంసారం సుఖమయంగా ఉండేలా చూడాలన్నది ఈ జాతీయంలోని సారాంశం.

ఉక్కుతునకలు
గొప్పబలవంతులు, శూరులు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఉక్కులోహానికి ఉన్న బలాన్ని, గట్టితనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. తునక అంటే ముక్కు అని అర్థం. ఉక్కుముక్కును వంచాలన్నా, విరవాలన్నా అంతంత మాత్రానికి సాధ్యమయ్యే పనికాదు. అలాగే శూరులు కూడా సాధారణంగా ఎవరికీ లొంగరని, వారి బలం ముందు మిగతా వారెవరూ చాలరని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

అక్కర గండడు
మయానికి ఆదుకొన్నవాడు, అవసరం తీర్చేవాడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గండడు అంటే సమర్థుడు అనే అర్థాననుసరించి చెయ్యాల్సిన పనిని ఎంతో సమర్థంగా చక్కగా నిర్వహించేవాడు అని ఎవరినన్నా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయం వాడుకలో కనిపిస్తుంది.

ఆడింది ఆట.. పాడింది పాట
మితిమీరిన స్వేచ్ఛ అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఆటకు, పాటకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఆ నియమనిబంధనలకు తగ్గట్టుగా ఆడకుండా పాడకుండా తమ ఇష్టం వచ్చిన తీరులో ఆటాడటం, పాటపాడటమనేది మితిమీరిన స్వేచ్ఛకు, నిరంకుశత్వానికి, కొన్ని సార్లు తలబిరుసుతనానికి కూడా ప్రతీకగా కనిపిస్తుంది. అలా ఎవరైనా నియమనిబంధలను పక్కకు తోసి తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

గంపతిరుగుడు
చాలా చిక్కులు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గంప అనే పదం అధికం, చాలా, గుంపు, సమూహం అనే లాంటి అర్థాల్లో ప్రయోగంలో ఉంది. గంపగుత్త అన్నప్పుడు మొత్తం గుత్త తీసుకోవటం అనే అర్థం కనిపిస్తుంది. అలాగే గంపతిరుగుడు అన్నప్పుడు అనేక చిక్కులు ఒక్కసారిగా వచ్చిపడటం అనే అర్థం వస్తుంది. తిరుగుడు పడటమంటే అనుకున్నది కాకపోవటం, చిక్కుల్లోపడటం అనేలాంటి అర్థాలు వ్యాప్తిలో ఉన్నాయి.

జుంజుము
జుంజము అనే రూపంలో కూడా ఇది ప్రయోగంలో ఉంది. దీనికర్థం దివ్వెనకోల అని బ్రౌణ్యం చూపిస్తోంది. అంటే దివిటీ అని అర్థం చెప్పుకోవచ్చు. పూర్వకాలం దీపావళినాడు వెలిగించే దివిటీని కూడా జుంజుము అని అంటుండేవారు. జుంజుము అన్నా, జుంజము అన్నా అర్థభేదమేమీ లేదు. వాడి ముఖం దివిటీలాగా వెలిగిపోతుంది అని చెప్పుకొనే అర్థంలోనే దివిటీకి బదులుగా జుంజుము వాడి ఒక వ్యక్తి పొందుతున్న ఆనందాన్ని తెలియచెప్పేందుకు దీన్ని జాతీయంగా వాడటం కనిపిస్తోంది.

కైత్కాలతనం
జాతీయం తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది. కైత్కాలతనమంటే కైతగల తనమని అర్థం. కైత అనే పదం కవిత్వానికి సమానార్థకం. దాన్ని రకరకాలుగా చిత్రించటం, అలంకారిక ధోరణిలో అందంగా చెప్పటం అనేది భావన. దీంట్లో అక్కడక్కడా రవ్వంత వ్యంగ్యం, హాస్యం కూడా మిళితమై ఉంటే ఆ పద్ధతిని కైత్కాలతనం అని గ్రామప్రాంతవాసులు అంటుంటారు. ‘అక్కడ జరిగిందేందో సరిగా తెలియకపోయినా వాడు చెప్పిన దాంట్లో కైత్కాలతనం బాగుంది’ అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.
బ్రహ్మకాయ
దేమి విచిత్రమైన కాయ అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ బ్రహ్మకాయ జాతీయాల వరుసలో చేరి కనిపిస్తుంది. సొరకాయ, బీరకాయలాంటి కాయ మాత్రం కాదు. కొంతమంది ఎంతో పురాతనమైన విషయాలను కూడా తమకు బాగా పరిచయమున్నట్టు చెప్పేస్తుంటారు. మరికొంతమంది భారతంలో భీష్మాచార్యుడి లాగా చాలా పాతతరం వారుంటారు. అలాంటి వారిని గురించి పేర్కొనటానికి ఆయనకు బ్రహ్మకాయ అని అనటం కనిపిస్తుంది. అలాగే బ్రహ్మ శబ్దం అధికం అనే అర్థంలో కూడా ప్రయోగంలో ఉంది. కొంతమంది చాలా ఎక్కువగా కదిలిస్తేచాలు గడగడ మాట్లాడేస్తుంటారు. ఇలాంటి వాచాలుడిని కూడా ఈ జాతీయంలో సూచించటం కనిపిస్తుంది.
కూడుగూటిప్రాయం
చిన్నవయసు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కూడు అంటే తిండి, గూడు అంటే ఇల్లు. పసివయసు ఈ రెండిటికీ మాత్రమే పరిమితమై ఉంటుంది. అమ్మ పెడితే తినటం, నిద్రవస్తే పడుకోవటం తప్ప మరొకటి ఏదీ ఆ వయసులో ఉండదు. అంత చిన్న వయసు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.
అట్టుపుట్టానవాలు
విషయానికి సంబంధించిన సంపూర్ణమైన విషయాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఆ విషయం ఎలా పుట్టింది. అది విస్తరించిన తీరు, దాని ఆనవాళ్లు వీటన్నింటినీ వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా తెలుసుకోవటమనేది ఈ జాతీయానికున్న అర్థం. ఎట్టు పుట్టింది అంటే ఎలా పుట్టింది అని ఎవరైనా ప్రశ్న వేస్తే అది అట్టు పుట్టింది. దాని ఆనవాళ్లు ఇవి అని తెలియచెప్పటమే దీనిలోని అంతరార్థం.
కళ్లనిప్పులు రాలటం
తి తీవ్రమైన కోపం కలిగి ఉండటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కోపం నిప్పుతో సమానమంటారు. నిప్పు వస్తువులను దహించినట్టు కోపస్వభావం ఎదుటివ్యక్తులను బాగా బాధిస్తుంది. కోపం వచ్చినప్పుడు కళ్లు నిప్పుకణికల్లా ఎర్రబడతాయి. అలాంటి కోపం తీవ్రతను సూచించేందుకు కళ్లనిప్పులు రాలటం అనే ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
నెరవాది
సౌమ్యంగా, ఆకర్షణీయంగా మాట్లాడే వ్యక్తి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అయితే నెర అని రాసేటప్పుడు బండిరను వాడాలని వ్యాకరణవేత్తలు సూచిస్తున్నారు. కానీ వ్యవహారంలో అలా కనిపించటం లేదు. నెర అనంటే మంచి, సౌమ్యం, ప్రీతికరంలాంటి అర్థాలున్నాయి. వాది అనంటే మాట్లాడేవాడు అని అర్థం. ఇలా నెరవాది అనే జాతీయం ఎంతో సున్నితంగా, ప్రేమపూర్వకంగా మాట్లాడే వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు వాడుకలో కనిపిస్తుంది.

మిన్నుదన్ను
ధికమైన అభివృద్ధి, ఎంతో ఎత్తుగా ఉండటం అనే అర్థాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మిన్ను అంటే ఆకాశం అని అర్థం. దన్ను అనంటే హద్దు, ఆధారం అనేలాంటి అర్థాలు ఉన్నాయి. స్థూలంగా చూస్తే ఆకాశమే హద్దు అనే భావనలో వూహించలేనంత ఎత్తు, ఎంతెంతో అభివృద్ధి చెందటం అని అర్థాలు స్ఫురిస్తాయి. బాగా అభివృద్ధిని సాధించారు అని ఎవరి గురించైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

గురుడు ఏకాదశంలో ఉండటం
గొప్ప ఉచ్ఛదశ, అభ్యుదయకరమైన కాలం అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. జ్యోతిషశాస్త్రపరంగా ఉన్న కొన్ని సాంకేతిక అంశాలు కూడా జాతీయాలుగా అవతరించాయనటానికి ఇదొక ఉదాహరణ. పూర్వం నుంచి మానవ జీవనశైలిలో కూడా చాలామంది జ్యోతిష శాస్త్రాన్ని విశ్వసిస్తున్న నేపథ్యంలో ఇలాంటి జాతీయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కారణంగా ఎవరైనా ఎంతో గొప్పస్థితిలో ఉన్నారని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

ఏనుగు నిద్ర..
బెరుకుతో, భయంతో నిద్రపోయే పద్ధతిని ఏనుగునిద్రతో పోల్చి చెబుతారు. ఏనుగుకు సింహం అంటే భయం. సింహం ఎప్పుడొచ్చి తన మీదపడి చంపుతుందోనని అది నిరంతరం భయం భయంగానే ఉంటుంటుంది. చివరకు నిద్రపోయేటప్పుడు కూడా పూర్తిగా కళ్లుమూసుకొని నిద్రపోవటంకాక సగం కన్నుతెరచి నిద్రపోతూ ఉంటుంది. ఇలా ఎవరైనా బెరుకుభయంతో నిద్రకూడా సరిగా పోకుండా శత్రువుల గురించే ఆలోచిస్తున్న సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

పాతాళప్రశ్న
అంతు తేలని చిక్కుప్రశ్న అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాతాళం భూమికి అడుగున ఉండే చిట్టచివరి లోకం. దాని దగ్గరకు చేరటం అంత సామాన్యమైన విషయం కాదు. కొన్నికొన్ని ప్రశ్నలకు సమాధానాలు అదే తీరులో ఎన్నెన్నో చిక్కుముడులను విప్పుకొంటూ పోయినా సూచనమాత్రంగా కూడా తెలియవు. అలాంటి ప్రశ్నలను గురించి తెలియచెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.
అయిదు పది చేయటం
రు నూరు కావటం అనేలాంటిది కాదిది. అది ఎంతటి అసాధ్యమైనా సరే సాధ్యం చేయటం అనే అర్థంలో వాడుతుంటారు. కానీ ఈ జాతీయానికి, ఆరు నూరు కావటానికి సంబంధం ఏదీలేదు. సంఖ్యాపరంగా ఒకే పోలికలాగా కనిపిస్తాయంతే. మనిషి చేతికి అయిదు వేళ్లుంటాయి. రెండు చేతులకు కలిపి పదివేళ్లుంటాయి. రెండు చేతులను జోడించటమంటే నమస్కరించటం అవుతుంది. ఈ భావంలో అయిదు పది చేయటం లేదా అయిదు పది కావటమంటే ఒకరు మరొకరికి వినయంగా భక్తిపూర్వకంగా రెండు చేతులను జోడించి నమస్కరించారనే అర్థం ప్రకటితమవుతుంది.
ఏనుగుదాహం
త్యాశ అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. సర్వసాధారణంగానే ఆశకు అంతం ఉండదు. దీన్ని ఏనుగు దాహంతో పోల్చుకున్నందువల్ల ఇది జాతీయమైంది. మనుషుల్లాగానో, ఇతర జంతువులలాగానో ఏనుగుకు దాహం తీరేందుకు కొంచెం నీరు సరిపోదు. దాని దాహం తీరటానికి చాలా నీళ్లు కావలసి ఉంటుంది. ఆశ కూడా ఒకసారి కలిగిందంటే అంతంత మాత్రంగా తృప్తికలగదు. అందుకనే అత్యాశను ఏనుగుదాహం అని అనటం కనిపిస్తుంది.

చేతడి ఆరేంతలో
చేతికి తడి అయితే అది ఆరటానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. ఈ భావనే ఈ జాతీయ ఆవిర్భావానికి వేదిక. అతితక్కువ సమయంలో జరిగిన పని, జరగాల్సిన పని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని అందుకే వాడుతుంటారు. ‘చేతడి ఆరేంతలోనే ఈ పని వాడు పూర్తి చేసుకొస్తాడు. మరేం భయం లేదు’ అనే లాంటి ప్రయోగాలున్నాయి.

టాటాలు గుణించటం
ల పొగరుగా ప్రవర్తించటం, నాకేంటట అన్న తీరులో నిర్లక్ష్యంగా వ్యవహరించటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఎవరెటుపోతే ఏమిటి? అయినా నాకేంటట. ఆ పని చెయ్యకపోతే నన్నెవరేం చేస్తారట అని అనుకొనే తీరును తెలిపేందుకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

చిలుక చదువు
ఎంతవరకు చెబితే అంతవరకు మాత్రమే నేర్చుకొనేవారు అంతకంటే ఎక్కువ ఆలోచించలేరు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. అలాగే చెప్పింది చెప్పినట్లు చెయ్యటం తప్ప విశ్లేషించి పరిస్థితులను సమీక్షించి ఇంకా చెయ్యాల్సింది ఏమైనా ఉంటే చెయ్యలేని వారిని గురించి చెప్పేటప్పుడు కూడా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పూర్వకాలంలో చిలుకలకు పలుకులు నేర్పించే వారని దాన్ని ఆధారంగా చేసుకొని ఈ జాతీయం వెలువడిందన్నది భావన.
పింజం పింజం
మెత్తపడిపోవటం, ధైర్యం సన్నగిల్లి పోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పింజం అంటే దూది అని అర్థం. దూదిని ఏకితే బాగా మెత్తగా పలుచగా మారిపోతుంది. అంతకు ముందున్న గట్టి రూపం కనిపించదు. అలాగే ఏ సంఘటనైనా చూసి ధైర్యం కోల్పోవటంతో మనిషి మెతక పడుతుంటాడు. అలాంటప్పుడు ‘‘నా కళ్లముందే వాడిని కొడుతుండేసరికి నామనసు పింజం పింజం అయింది’. అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

వీధిపాలు
పాధి కోల్పోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఒక చోట ఆశ్రయం పొందుతున్నప్పుడు గుట్టుగా ఎవరి బతుకులు వారు బతకటం జరుగుతుంటుంది. ఆ ఆశ్రయం పోయినప్పుడు వీధినపడి మళ్లీ ఎక్కడ ఆశ్రయం దొరుకుతుందా అని వెతకాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ప్రతిబింబిస్తుంది ఈ జాతీయం. ‘ఆ పరిశ్రమ మూతపడటంతో వందలాదిమంది కార్మికుల జీవితాలు వీధిపాలయ్యాయి’ అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం కనిపిస్తుంది.

వడ్లగింజలో బియ్యపుగింజ
హస్యం కానీ, ప్రత్యేక అంశం కానీ ఏదీలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. వరికంకిలో ఉండే వడ్లగింజ మీద పైన పొట్టు ఉంటుంది. ఆ పొట్టును తీసివేస్తే బియ్యపుగింజ కనిపిస్తుంది. వడ్లగింజలో బియ్యపుగింజ ఉండటం అత్యంత సహజం. అలా అత్యంత సహజమైన విషయమే అని ఏ విషయాన్ని గురించైనా వివరించాల్సి వచ్చినప్పుడు దీని ప్రయోగం కనిపిస్తుంది. కొన్నిచోట్ల ఏదో ఉందని కొంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఆ కనపడని దాని వివరాల కోసం ఇరుగుపొరుగు వారిని అడుగుతుంటారు. అయితే అక్కడున్నది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పాలనుకున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

దూసుకెళ్లటం
విజయమార్గంలో వేగంగా పురోభివృద్ధి చెందటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. అత్యంత వేగాన్ని సూచించటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. బాణం దూసుకెళ్లిందిలాంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఈ వేగభావాన్ని సూచించటానికి ఈ జాతీయం ఆవిర్భవించింది. ‘వ్యాపారంలో నిన్న మొన్నటిదాకా స్తబ్ధంగానే ఉన్నాడు. ఇటీవలి కాలంలో కొద్దిగా తెలివి ప్రదర్శించి వూహించనంతగా ముందుకు దూసుకెళ్లాడు’ లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.
కొరకరానికొయ్య
నికిరానిది, మాటవిననివాడు అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కొరికి తినగలిగింది అయితే దాన్ని చక్కగా ఆస్వాదించి ఆనందించటానికి అవకాశముంటుంది. అలా కాకుండా కొరకటానికి, కొరికి తినటానికి పనికిరాని ఓ కొయ్య ముక్కను ఇచ్చి ఎవరినైనా తినమంటే అది సాధ్యపడకపోగా దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ సమకూరదు. ఇలాగే సమాజంలో కొంతమంది మనుషులుంటారు. వారిని ఎన్ని రకాలుగా అడిగినా పనిచేసిపెట్టరు. వారు సమీపంలో ఉన్నారన్నమాటేకానీ ఏ ఉపయోగమూ వారివల్ల సమకూరదు. ఇలాంటి వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.
జాపరమేశ్వరా
జా, పరమేశ్వరా అనే పదాల కలయికతో ఈ జాతీయం ఏర్పడింది. అన్యభాషా పదం ‘జావో’ నుంచి ‘జా’ అనే అక్షరాన్ని తీసుకొని పరమేశ్వర పదానికి కలిపి వాడటం ఇక్కడ ఉన్న విషయం. దీని అర్థాన్ని పరిశీలిస్తే ఎప్పుడైనా ప్రమాదాలు ముంచుకొచ్చినప్పుడు ప్రాణాలను దక్కించుకోవటానికి పారిపోయే సందర్భం స్ఫురిస్తుంది. పారిపోయే వ్యక్తి కాపాడు దేవుడోయ్‌ అంటూ అనుకొనేదానికి ఇది సమానార్ధకం. జా అంటే వెళ్లు, పరుగెత్తు అని, పరమేశ్వరా అంటే ఇష్టదైవాన్ని తలచుకోవటమనేది ఇక్కడున్న విషయం.

మోకాలిలో మెడనరం పట్టు...
విచారాన్ని నటించటం, మోసంతో మాయ చేయాలని చూడటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మెడ ప్రాంతంలో మెడనరం పట్టిదంటే అర్ధం ఉంది. అలా కాకుండా ఎందుకలా విచారంగా, బాధగా ఉన్నావు అనంటే మోకాలిని చూపించి మోకాలిలో మెడనరం పట్టింది అందుకే బాధగా ఉందని ఎవరైనా చెబితే అది కచ్చితంగా బాధను నటించటమే అవుతుంది. అలా మోసంగా, మాయగా ఎవరైనా మాటలు చెబుతున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

నిమ్మకాయవాటం
చేతిలో సులువుగా ఇమిడేది, అనుకూలంగా ఉండేది, ఇబ్బంది పెట్టనిది అనేలాంటి అర్థాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. నిమ్మకాయ చేతిలో సులభంగా ఇముడుతుంది. చేతిలో పెట్టుకోని గుప్పిట మూసేందుకు వీలుగా తగిన పరిమాణంలో ఉంటుంది. నిమ్మకాయను అలా ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకువెళ్లటం ఎంతో సులువుగా ఉంటుంది. ఇంత సులభంగా చెయ్యటానికి ఏ పనైనా కనిపిస్తునప్పుడు ఆ పనిని ఈ జాతీయంతో సూచిస్తుంటారు.

చేదోడువాదోడు
నికి, మాటకు సహాయపడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చేయి+తోడు చేదోడు, వాయి+తోడు వాదోడు అనే రూపాలుగా అయ్యాయి. ఈ రెండు రూపాల కలయికతో ఏర్పడిన జాతీయం ఇది. పనిచేయటానికి సహకరించేది చేయి. మాట్లాడటానికి ఉపయోగపడేది వాయి(నోరు). ఈ అర్థంలో ఎవరైనా పనిలో సాయపడుతూ పనిపూర్తిగా జరగటానికి మాట సహాయం చేస్తున్నప్పుడు ఈ జాతీయం వాడటం కనిపిస్తుంది.
రేకు మడచటం
కొట్టడం, అణచటం, అణగగొట్టడం లాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. రేకుతో పాత్రలను కానీ, ఇతర పరికరాలను కానీ తయారుచేసే విధానాన్ని అనుసరించి ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. రేకును మడిచిన తర్వాత దాన్ని అలాగే ఉంచరు. వంపు మీద సుత్తితో అణగగొడతారు. ఈ పనిని దృష్టిలో ఉంచుకొనే ఈ జాతీయం రూపొందింది.

చెట్టుకొట్టి పైన వేసుకోవటం
నికిమాలిన పని, చేసి నష్టపోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. దారి పక్కన ఓ చెట్టుందట. దానివల్ల ఏ ఇబ్బందీ ఎవరికీ కలగటంలేదు. ఎండపాటివేళ ఎవరైనా ఆ చెట్టుకింద నీడలో కాసేపు విశ్రాంతి పొందుతున్నారు కూడా. అలాంటి చెట్టును ఏ పనీలేని ఓ వ్యక్తి చూసి ఏదో ఓ పని చెయ్యాలి కదాని దాన్ని కొట్టడం ప్రారంభించాడు. అది విరిగి అతడి మీదే పడింది. అలాంటి పనికిమాలిన పనులను చేసి ఎవరైనా నష్టపోతున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

గడితేరటం
రితేరటం, నైపుణ్యం సంపాదించటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గడి అనే పదానికి నిఘంటువులు అనేక అర్థాలనిస్తున్నాయి. వాటిలో ఈ జాతీయానికి సంబంధించి మర్యాద, బలం, కోట, కోడెదూడ, గిత్తలాంటి అర్థాలను సమన్వయించుకోవచ్చు అంటారు పండితులు. ఒక విషయంలో సంపూర్ణమైన అవగాహన ఉండటమంటే దానికి సంబంధించి బాగా బలంగా ఉండటం అని అర్థం. కోడెదూడ, గిత్త కూడా బలానికి, ప్రతిభకు మారుపేర్లుగా చెప్పుకోవటం కూడా కనిపిస్తుంది. ఈ కారణంతోనే గడితీరటం అంటే ఆరితేరటంలాంటి అర్థాలలో ఇది ప్రయోగంలో కనిపిస్తుంది.
కొట్టి కోలాహలం చేయటం
క్కువ గందరగోళం చేయడం, బాగా హడావిడి చేయటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఒక వ్యక్తిని కొట్టడమో, మరొకచోట విజయాన్ని చేజిక్కించుకోవటమో చేసినప్పుడే కొంత హడావిడి ఉంటుంది. ఇక దానికి తోడుగా కొట్టడం లేదా గెలవటం అనే ఆ పనిలో పాల్గొన్నవారితోపాటు ఆ పరిసరాలలోని వారు కూడా గొంతుకలపటమో, హడావిడి చేయటమో జరిగితే అక్కడంతా అంతులేని గందరగోళమే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించినా ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
కసవుగరచు...
డ్డికరచటం, ప్రలోభాలకు లొంగడం, లోబడటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. కసవు అనే పదానికి అర్థం చెత్తా చెదారం అని సర్వసాధారణమైన ప్రయోగం. గడ్డిని కూడా చెత్త అని అంటారు. ఈ గడ్డిని పశువులు తింటాయి. అంటే మానవత్వానికి బదులుగా పశుభావనతో ఎవరైనా ప్రవర్తించినప్పుడు, నీతిబాహ్యంగా ప్రవర్తించినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.
కాళ్లుపారచూడటం
ద్ధకంగా కాళ్లు చాపుకొని కూర్చోవటం, అసమర్ధంగా వ్యవహరించటంలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కాళ్లారచాపుకొని కూర్చోవటం అనేలాంటి ప్రయోగం కూడా ఒకటుంది. పారచూడటం అనంటే అంతం చూడటం, చివరిదాకా చూడటం అనేలాంటి అర్థాలున్నాయి. బద్ధకంతో కూర్చొన్న వ్యక్తి తన కాళ్లను అలా చూసుకొంటూ కూర్చుంటాడే తప్ప వేరే పనేమీ చేయడు. ఈ అర్థంలోనే ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
చిచ్చు శింగారమెంచదు
చిచ్చు అంటే నిప్పు అని అర్థం. నిప్పు అందమైన వస్తువులైనా, అందవికారమైన వస్తువులనైనా ఒక విధంగా దహిస్తుంది. దానికి ఇది బాగుంది, అది బాగాలేదు అనే భేదాన్ని పాటించటం ఉండదు. ఈ జాతీయం భిన్నార్థాలలో ప్రయోగించటం కూడా కనిపిస్తుంది. సమదృష్టిగలవారు, అన్ని విషయాలను ఒకేలాగా చూస్తారు అనే అర్థంలో కొంతమంది ప్రయోగిస్తుంటారు. మరికొంతమంది కొంత నిందార్థంలో దేన్నైనా నాశనం చేసేవారికి ఇది మంచా, చెడా అనే ఆలోచన ఉండదని, దేన్నైనా నాశనం చేయటమే వారి పనిగా ఉంటుందని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
కత్తులు నూరటం
గను కొనసాగించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నూరిన కత్తి చాలా పదునుగా ఉంటుంది. నూరటం అంటే సాన పెట్టడం అని అర్థం. కత్తులను సానపెట్టేది దేన్నో ఒకదాన్ని తెగనరకటం కోసమే. తెగనరకటం అనేది సంబంధాలను తెంచుకోవటం, పగను కొనసాగించటం అనేలాంటి వాటికి ప్రతీక. ఈ భావానికి అనుగుణంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.
పెద్దచాటుది
స్వతంత్రురాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పెద్దల చాటున పెరుగుతున్న స్త్రీ అని దీనికి అర్థం. చాటు అనంటే ఏదో ఒక మూల ఉండటం అనే అర్థం మాత్రమేకాక ఒకరి సంపూర్ణ సంరక్షణలో ఉండటమనే అర్థం కూడా ప్రచారంలో ఉంది. దీని ఆధారంగానే పెద్దల సంరక్షణలో ఉంటూ తనకు సంబంధించిన అన్ని నిర్ణయాలను పెద్దలే తీసుకుంటున్న స్త్రీ అనే అర్థం ఈ జాతీయానికుంది. పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆమె నిర్ణయాలు తీసుకోవటానికి స్వతంత్రత ఉండదు. ఇలా అస్వతంత్రురాలైన స్త్రీని పెద్దచాటుది అని అంటుంటారు.
చిప్పా దొప్పా సిద్ధం చేసుకోవటం
చిప్పా, దొప్పా అనే వస్తువులు సన్యాసుల దగ్గర కనిపిస్తుంటాయి. ఆ వస్తువులు ఉన్నాయంటే సర్వసంగ పరిత్యాగి అయి జీవిస్తున్నాడని లెక్క. కొంతమంది చెయ్యాల్సిన పనులను చేయకుండా వదిలిపెట్టి వెళుతుంటారు. అలా వెళ్లటం కూడా నిందార్థంలో సన్యాస లక్షణంగానే చెప్పుకోవటం ఓ అలవాటుగా ఉంది. వాడొట్టి పనికిరాని సన్నాసి అని అనటం అలాంటి నిందావాచకమే. ఈ క్రమంలోనే చిప్పాదొప్పా సిద్ధం చేసుకోవటమంటే పని తప్పించుకొని తన దోవన తాను వెళ్లిపోతున్నాడు అనేలాంటి అర్థం ప్రచారంలోకి వచ్చింది.
జమాబందీ సిరాబుడ్డీ
ందరూ సమానాధికారంతో వాడుకొనే వస్తువు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. తాలూకా కచేరీలలో గ్రామాలకు సంబంధించిన ఆదాయ లెక్కలను సంవత్సరానికి ఒకసారి సరిచూస్తుంటారు. కరణీకపు వ్యవస్థ ఉన్నరోజుల్లో, జమాబందీ జరిగే రోజుల్లో కూడా కరణాలు కొన్ని దస్త్రాలను రాస్తుండేవారు. వాటిని రాయటానికి సిరా నింపి ఉపయోగించే కలాలుండేవి. ఆ కలాల సిరా కోసం పెద్ద సిరాబుడ్డీని ఒకచోట పెట్టేవారు. దానిలోని సిరామీద అందరికీ సమాన అధికారం ఉండేది. ఈ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చింది ఈ జాతీయం. అలా ఒక వస్తువు మీద అందరికీ సమానాధికారం ఉన్న సందర్భాలలో దాన్ని జమాబందీ సిరాబుడ్డీ అని అంటుండేవారు.
పళ్లు కొరకటం
నిషిలోని అనేకానేక స్వాభావిక చర్యలు జాతీయాలుగా అవతరించాయి. ఆనందంతో చప్పట్లు చరచటం, కోపం వస్తే కనుబొమలు ముడిపడటం ఇలాంటివన్నీ మనిషి స్వాభావిక చర్యలకు సంబంధించినవి. అలాంటిదే ఇది కూడా. పట్టలేనంత కోపం వచ్చినప్పుడు, తననెవరైనా అనరాని మాటలనినప్పుడు, శత్రువు ఎదురైనప్పుడు కోపం ప్రభావంవల్ల నోటిలోని పళ్లను పటపట కొరకుతుంటారు కొందరు. ఈ స్థితే ఈ జాతీయానికి మూలం. మొత్తం మీద మితిమీరిన కోపాన్ని ప్రదర్శించటం అనేది ఈ జాతీయానికున్న అర్థం.

చాలు మూల
చాలు, మూల అనే రెండు పదాల కలయికతో ఏర్పడ్డ జాతీయం ఇది. చాలు అనంటే నాగేటిచాలు అనే పదంలోని చాలు. రైతు నాగలితో నిలువుగా, మూలుగా ఒక క్రమపద్ధతిలో పొలాన్ని దున్నుతాడు. ఇదంతా ఒక వరుస ప్రకారంగా ఉంటుంది. దీని ఆధారంగానే విషయాలకు సంబంధించిన వరుసక్రమం, దారి డొంక, సంగతి సందర్భం లాంటివి తెలుసుకొనేటప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

గుదిగుంపులుగా ఉండటం
కే విషయంలో లేదా ఒకేచోట అక్కడక్కడే తిరుగుతుండటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పువ్వులు, పూసలు గుదిగుచ్చటం కూడా ఉంది. అంటే ఒకదానికొకటి హత్తుకొని ఉండేలా గుచ్చటమని అర్థం. గుదిగుంపులుగా ఉండటం అంటే అలా ఒకేచోట కొంతమంది దగ్గరే తిరుగుతూ వేరోచోటికి వెళ్లకపోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.
పుట్టని బిడ్డకు పేరు పెట్టడం
ప్పుడో జరగబోయే పనుల కోసం ముందే హడావిడి పడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనేలాంటి సామెతలు కూడా ఈ కోవకు చెందినవే. కొంతమంది ప్రస్తుతం జరగాల్సిన పనుల మీద దృష్టి పెట్టి వాటిని సక్రమంగా పూర్తి చేయకుండా, ఎప్పుడో జరగబోయే వాటికోసం లేనిపోని హడావిడి చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.
తెరువుపెట్టు
దారిచూపటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. దారిపెట్టడం అనే రూపంలో కూడా ఇది కనిపిస్తుంది. తెరువు అనంటే దారి అని అర్థం. దీని ఆధారంగానే మార్గదర్శనం చేయటం, ఏ పనినైనా సాధించటానికి తగిన సాధనాన్ని చూపించటం అనే లాంటి అర్థాల్లో దీన్ని వాడుతుంటారు.
తరకటబరకట
ర్కవితర్కాలు, చర్చ అనేలాంటి అర్థాలలో ఈజాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. తరకటబరకట అనే జంటపదాలతో ఇది రూపొందింది. తర్కము అనే సంస్కృత పదం చర్చ అనే అర్థంలో ప్రచారంలో ఉంది. ఒక విషయం మీద చర్చ మొదలైతే దానిమీద ఇంకాఇంకా కొనసాగింపుగా మాటలు జరుగుతున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

సంతానగోపాలం
ధిక సంతానం ఉన్నారనుకున్న వారిలో ఇద్దరు పురాణపురుషులు మనకు కనిపిస్తారు. వారిలో ఒకరు సాక్షాత్తూ భగవంతుడైతే, మరొకరు ఆయన భక్తుడు. శ్రీకృష్ణపరమాత్మ సహాధ్యాయి, భక్తుడూ అయిన కుచేలుడు. ఈ కుచేలుడికి ఎక్కువ సంతానంతోపాటు అంతే ఎక్కువరీతిలో దారిద్య్రం కూడా ఉండేది. భగవంతుని కృపతో ఆ కష్టాల నుంచి గట్టెక్కాడు. ఇక శ్రీకృష్ణుడి విషయానికొస్తే ఆయనకు ఎనిమిది మంది భార్యలతోపాటు, పదహారు వేలమంది గోపికలు కూడా ఉన్నారు. వారందరివల్ల కృష్ణుడికి లక్షలాది సంతానం కలిగి ఉంటుందని నమ్మకం. ఆ నమ్మకంతోనే అంత ఎక్కువ సంతానం ఉన్న ఆ గోపాలకృష్ణుడిని పూజిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని దక్షిణాదిన విశ్వాసం ప్రజల్లో ప్రబలంగా ఉంది. సంతాన గోపాలుడు అనే శ్రీకృష్ణుడిని ఆంధ్ర, తమిళ ప్రాంతాల ప్రజలు కొలుచుకుంటూ ఉంటారు.
నెయ్యం తియ్యం
ప్రేమాదరాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. నెయ్యము, తియ్యము అనే పదాల కలయిక ఇది. నెయ్యము అంటే స్నేహం. తియ్యము అంటే ఆదరం, అభిమానం, ప్రేమభావన. స్నేహంతో కూడిన ఆదరం ఎంతో తియ్యగా ఉంటుంది. తీపిదనమనేది కేవలం రుచి అనే అర్థమే కాకుండా ప్రేమ సంబంధంగా కూడా వాడటం పరిపాటి. మొత్తం మీద ఈ జాతీయం ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలు చూపటం అనే అర్థంలో ప్రయోగంలో కనిపిస్తుంది.
చదువులుట్లెక్కటం
దువులు + ఉట్లు + ఎక్కటం అనే పదాల కలయికగా ఈ జాతీయం ఏర్పడింది. జనవ్యవహారంలో కొండెక్కటం అనే పదం ఒకటుంది. దానికి అర్థం అంతరించిపోవటం అని. దీపం విషయంలో దీన్ని వాడుతుంటారు. అదే తీరులో చదువులు ఉట్లెక్కాయి అని అనటం కనిపిస్తుంది. అంటే చదువులు మూలనపడ్డాయి. చదవటం ఆపేశారు అనేది దీనికి ఉన్న అర్థం.
పులి మీసాలతో ఉయ్యాలలూగటం
ప్రమాదకరమైన సాహసకృత్యం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పులిని చూడాలంటేనే భయం. ఇక దగ్గరకు వెళ్లడమంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవటమే. అలాంటిది పులి దగ్గరకు వెళ్లి దాని మీసాలను పట్టుకొని ఉయ్యాలలూగటమంటే ఎంత ప్రమాదకరమైన సాహసకృత్యమో ఎవరైనా ఇట్టే ­హించవచ్చు. అటువంటి సాహసాలను గురించి వివరించే సందర్భాలలో ఈ జాతీయప్రయోగం కనిపిస్తుంది.

గోదారిగలుపు
నాశనం చేయటం, బాగా కష్టపెట్టడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇది గోదాట్లో కలపటం, గోదాట్లో కలిసింది, గోదారిపాలైంది అనే రూపాలలో కూడా ప్రయోగంలో కనిపిస్తుంది. గోదావరి నదిలో కలపటం అనేది దీనికున్న సామాన్య అర్థం. గోదావరి నదీప్రవాహ తీవ్రత వరదలొచ్చినప్పుడు ఆ నది ఉగ్రరూపం, దాని లోతు ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని గోదావరిలో మునిగింది పైకి రాదని అది అంతమైపోయినట్టేనని ఉన్న భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
కట్టెక్కు
ట్ట, ఎక్కు అనే పదాల కలయికే కట్టెక్కు అయింది. దీన్నే గట్టెక్కు అని కూడా అంటుంటారు. కట్ట, గట్టు అనేవి రెండూ కొంతవరకూ సమానార్థకాలే. కట్టెక్కటం అనంటే విజయం సాధించటం, అనుకున్న పని పూర్తి చేయటం అనేలాంటి అర్థాలున్నాయి. నదిలోనో, కాలువలోనో, చెరువులోనో ఓ వ్యక్తి పడ్డప్పుడు మొత్తానికి ఎలాగో ఒకలాగా ఈది కట్టపైకి వచ్చాడంటే అతడు విజయం సాధించాడని అర్థం. ఇదే అర్థంలోనే పై జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.


కొమ్ములు చూపటం
చెలరేగటం, శత్రువు మీదకు పోరాటానికి సిద్ధం కావటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఎద్దులు, దున్నలులాంటి జంతువుల ప్రవర్తనను అనుసరించి ఈ జాతీయం ప్రచారంలోకి వచ్చింది. ఎద్దు తన శత్రువు మీదకు వెళ్లేటప్పుడు కొమ్ములు దానివైపు చూపిస్తూ తోక ఎత్తి ముందుకు ఉరుకుతుంది. శత్రువును ఎదుర్కోవటానికి అలా అది సిద్ధమవుతుంది. అయితే మనుషులు కూడా వాస్తవానికి కొమ్ములు లేకపోయినా తమకున్న కొమ్ముల లాంటి బలాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థి మీదకు బయలుదేరటాన్ని ఈ భావనతోనే సమర్థిస్తూ ఇది జాతీయంగా ప్రచారంలోకి వచ్చింది.

చీకిలి మాకిలి
చిందరవందర, చెల్లాచెదురు అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. కొన్ని జంటపదాలు జాతీయాలుగా ప్రచారంలోకొచ్చాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఏవైనా వస్తువులు కానీ, పనులు కానీ ఒక వరుస క్రమంలో లేకుండా మనసుకు చికాకు కలిగించేలా ఉన్నప్పుడు ఈ ప్రయోగం ఈ సందర్భంగా కనిపిస్తుంటుంది.
కాటగలవటం
శించటం అనేది దీనికున్న అర్థం. కాడు కలవటం అనే రెండు పదాల సమ్మేళనమిది. కాడు అనంటే శ్మశానం అని అర్థం. అందులో కలిసిపోయింది, ఏదీ ఇక తిరిగిరాదని, నశించి పోయినదేనని చెప్పడం సాధారణంగా వినిపించే అర్థమే. ఈ అర్థమే జాతీయంగా మారి ఏ పనైనా, వస్తువైనా నశించింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని ప్రయోగించటం కనిపిస్తుంది.


వంతపాడటం
నకున్న జాతీయాలలో కొన్ని జానపదుల కళాప్రక్రియను అనుసరించి కూడా వాడుకలోకి వచ్చాయనటానికి ఇదొక ఉదాహరణ. బుర్రకథ కళాప్రక్రియలో ప్రధాన కథకుడికి పక్కన వంతలుపాడే వారుంటారు. ప్రధాన కథకుడు చెప్పిన ప్రతిదానికీ తల వూపుతూ ఆ చెప్పిన దాన్నే మళ్లీ ఆహా ఓహో అంటూ చెబుతుంటారు. ఆ కళాప్రక్రియలో వంతపాడటం అంటే ఇదే. ఇదే జాతీయమయ్యేసరికి సొంత అభిప్రాయాలు లేకుండా ఎదుటివారు ఏంచెబితే దానికి తల వూపుతూ సమ్మతిస్తూ పోవటం అనే అర్థం ప్రయోగంలో కనిపిస్తుంది.
గద్దెనెక్కు
ద్దె అంటే సింహాసనం అనే అర్థం కనిపిస్తుంది. రాజులు, రాజ్యాలు ప్రస్తుత ప్రజాస్వామ్యంలో కనిపించకపోయినా పదవి అనే అర్థంలో గద్దె శబ్దం బాగా ప్రచారంలోకి వచ్చింది. గద్దెనెక్కించమంటే అధికారాన్ని అప్పగించటం లేదా గద్దెనెక్కు అంటే పదవిలోకి రావటం అనే అర్థాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ‘ప్రజాభిమానాన్ని చూరగొన్న ఆయన అతితేలికగా గద్దెనెక్కగలిగాడు’లాంటి సందర్భాలలో ఈ జాతీయం కనిపిస్తుంటుంది. గద్దెనెక్కినవాడు అంటే అధికార పదవిని పొందిన వాడని, గద్దె దించటం అంటే అధికారం నుంచి తొలగించటమని, గద్దె దిగటమంటే పదవి నుంచి వైదొలగిపోవటమని ఇలా ఎన్నెన్నో రూపాలుగా ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.
తవ్వి తలపోసుకోవటం
వ్వటం, తలపోసుకోవటం అనే రెండు పదాల కలయిక ఈ జాతీయం. తవ్వటమంటే గతాన్ని తవ్వటం. ఎప్పుడో జరిగినదాన్ని గుర్తుకు తెచ్చుకోవటం అనేది భావన. తలపోసుకోవటం అంటే తలంటుకోవడం అన్నది ఇక్కడి అర్థం కాదు. ఆలోచించటం అని ఈ సందర్భానికి తగిన అర్థం. ఈ అర్థాల నేపధ్యంలో ఎప్పుడో జరిగిన విషయాలను మాటిమాటికీ గుర్తుతెచ్చుకొంటూ వాటి గురించే ఎవరైనా ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తున్న సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
ఒట్టిగొడ్డు తాకట్టు
నికిమాలిన పని, పూర్తిగా నష్టం తెచ్చిపెట్టే పని అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అప్పివ్వటం కోసం కొంతమంది వస్తువులను తాకట్టు పెట్టుకొంటుంటారు. అప్పులు తీర్చలేని పక్షంలో విలువైన ఆ వస్తువులను అమ్మి లాభపడుతుంటారు కొందరు తెలివైనవారు. అయితే అప్పుకోసం తిరుగుతున్న ఓ తెలివైనవాడు తెలివితక్కువవాడైన తాకట్టు వ్యాపారిని మోసం చేసాడట. పాడికి పనికిరాకుండా ఒట్టిపోయిన తన గొడ్డును తెచ్చి మాయమాటలు చెప్పి డబ్బు తీసుకువెళ్లాడు. పాడిగొడ్డైతే అప్పిచ్చిన వాడికి రోజూ పాలు పిండుకొని లాభపడే వీలుండేది. కానీ ఒట్టి గొడ్డును తాకట్టు పెట్టుకొన్నందువల్ల అది పాలివ్వకపోగా రోజూ దానికి మేతపెట్టాల్సి రాకవటంతో తాకట్టు వ్యాపారి నష్టపోయాడట. ఇలాగే ఎవరైనా మాయమాటలను నమ్మి మోసపోయినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

కర్ణుడు లేని భారతం
ప్రధానుడు లేని కార్యం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మహాభారతకథలో కర్ణపాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. ఓ పని జరిగేటప్పుడు దానికి సంబంధించిన ప్రధానమైన బాధ్యుడు లేదా వ్యక్తి ఉన్నప్పుడు ఉండే హంగూ ఆర్భాటం వేరు. అలాంటి వ్యక్తి లేనప్పుడు విషయం అనాసక్తంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలను వర్ణించేందుకు ఈ జాతీయం ఉపయుక్తమవుతుంది.
కలలోని కాన్పు
బద్ధం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కల వాస్తవం కాదు. కలలో కనిపించిందంతా నిద్ర మెలకువ రాగానే కళ్లముందు కనిపించదు. అందుకనే కలను అబద్ధం అని అంటారు. కొంతమంది ఎంతో నమ్మకంగా జరగనివన్నీ జరిగినట్టు అబద్ధాలు చెబుతున్న సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
చందమామ గుటగుట
అందని వాటికోసం ఆశపడుతూ అవి అందినట్టే భావించుకుంటూ అవన్నీ అనుభవంలోకి వచ్చినట్టే ఆనందించటం అనేది ఈ జాతీయానికున్న అర్థం. నచ్చిన పదార్థాన్ని త్వరత్వరగా తినటాన్ని గుటగుట తినటం, గుటుకున్న మింగటం అనేది సంప్రదాయం. ఓ వ్యక్తి ఆకాశంలో ఉన్న చందమామను చూసి అదేదో పండుకానీ, తీపి పిండివంటకంకానీ అయిఉంటుందని అనుకోవటమేకాక ఆ పదార్థాన్ని తిన్నట్టు వూహించుకొని తృప్తి పడ్డాడట. ఇదే తీరులో ఎవరైనా ఆశగానో, అమాయకంగానో వ్యవరిస్తున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
చంకదుడ్డు శరణార్థి
దుర్మార్గులు కొంతమంది పైకి వినయంగా నటిస్తూ నమ్మిన వారిని ఎప్పటికప్పుడు దెబ్బతీయాలని చూస్తుంటారు. ఓ వ్యక్తి దగ్గరకు శరణంటూ ఓ శరణార్థి వచ్చాడట. మామూలుగా రావటం కాక దుడ్డుకర్రను చంకలో పెట్టుకొని వచ్చాడు. ఆ కర్ర ­తం కోసం కాక సమయం చిక్కినప్పుడు శరణు ఇచ్చిన వారిని కొట్టాలనే మోసపుటాలోచనతో తెచ్చుకున్న కర్ర. అలాగే ఎవరైనా పైకి వినయంగా నటిస్తూ లోలోపల శత్రుభావంతో ఉన్నారనిపించినప్పుడు వారిని గురించి చెప్పటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
ఎగాదిగా
పైనుంచి కిందకి, కింది నుంచి పైకి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఎగ అంటే ఎగువ, దిగ అంటే దిగువ అని అర్థం. ఈ అర్థాల క్రమంలో పైనుంచి కిందకు, కింది నుంచి పైకి చూశారు అని చెప్పటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. పైకి, కిందకి చూడటమంటే ఎదుటి వ్యక్తిని పూర్తిగా అంచనా వేసినట్టు లెక్క. అలా ఓసారి పైకి, కిందకి చూసి మంచివాడో చెడ్డవాడో, కావలసిన వాడో పరాయివాడో తెలుసుకొంటుంటారు కొందరు.

కానికూడు
నీతిబాహ్యంగా గడించిన సొత్తు అనేది దీనికున్న ప్రధాన అర్థం. ధర్మానికి కానీ, నీతికి కానీ, నియమాలకు కానీ లోబడి ఉండి సంపాదించని సంపదలను గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఇది ఉత్తమ సంపద కాదని అటువంటి నీతి బాహ్యమైన కానికూడు కోసం పాకులాడవద్దని పెద్దలు అంటుండటం వినిపిస్తుంటుంది.
కూటుక మూక
పెకి గంభీరంగా కనిపిస్తూ లోపల పిరికిపందలుగా ఉండే సమూహం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పూర్వం ఉన్న రాచరిక వ్యవస్థ యుద్ధ సందర్భాల నుంచి ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. యుద్ధం జరిగే రోజుల్లో శత్రుసేన చేతిలో బాగా దెబ్బతింటున్న సైన్యం పిరికితనంతో పారిపోతుండేది. అలాంటి వారిని సేనాపతులు ఆపి ధైర్యం చెప్పి ఎలాగో ఒకలాగా మళ్లీ శత్రుసేన మీదకు వెళ్లేలా సేనావ్యూహాన్ని ఏర్పాటు చేస్తుండేవారు. వ్యూహంలో ఉన్న ఆ సేనలు దూరం నుంచి చూడటానికి ధైర్యంగా ఉన్నట్టు ఉండేవే కానీ వారి మనసులలో అపజయం, అభద్రతాభయాలుంటుండేవి. అదే తీరులో ప్రస్తుత కాలంలో కూడా ఎవరైనా కనిపించినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
ముక్కూరవగచటం
ముక్కు, వూరటం, వగచటం అనే పదాల కలయిక ఈ జాతీయం. వగచటం అంటే ఏడవటం, దుఃఖించటం అని అర్థం. ఏడుపు ఎక్కువైనప్పుడు ముక్కుకారటం శారీరక సహజధర్మం. అంటే ఎంతో విపరీతమైన దుఃఖం కలిగితే తప్ప కళ్ల వెంట, ముక్కు వెంట నీరు కారేంతటి పరిస్థితి ఏర్పడదు. అందుకే ముక్కూరవగచటం అనే జాతీయానికి భరించరాని దుఃఖపరిస్థితి అనే అర్థం వ్యవహారంలోకి వచ్చింది.

గొడుగున్నోడు
గొడుగు + ఉన్నవాడు గొడుగున్నోడు రూపంగా అవుతుంది. పదిమందిలో ఉన్నప్పుడు దూరం నుంచి కావల్సిన వ్యక్తిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక ఆనవాలును చూపిస్తూ చెప్పటం అలవాటు. ఈ అలవాటే ఇలా జాతీయమైంది. సంస్కృతంలో కూడా ఛత్రిన్యాయం పేరున ఇది కనిపిస్తుంది. దూరంగా చాలామంది ఉన్నప్పుడు వారిలో ఓ వ్యక్తి చేతిలో గొడుగు ఉందట. ఆ గొడుగు ఉన్నవాడి గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు ‘అదుగో ఆ గొడుగున్నోడే మనోడు’ అనటం కనిపిస్తుంది..
పందిరి మందిరమైనా సరే...
విధంగానైనా ఎంత కష్టంగానైనా సరే పనిని సాధిస్తాం అని చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పందిరి మందిరం కావటమంటే అసాధారణమైన విషయం. మందిర నిర్మాణానికి, పందిరి నిర్మాణానికి చాలా భేదం ఉంది. పందిరి సామాన్యంగా నాలుగుస్తంభాలతో పైన మామూలు ఆచ్ఛాదనతో ఉంటుంది. మందిరానికి గోడలు, దానికి తగిన పైకప్పులాంటివన్నీ ఉండాలి. పందిరిని మందిరం చేయాలంటే ఈ కోణంలో చూస్తే ఎంతో కష్టం. అంతటి కష్టమైన పనినైనా సరే మేం సాధిస్తాం అని ఎవరైనా గట్టిగా చెబుతున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఆరునూరైనా, నూరుఆరైనా లాంటిదే ఇది.
పాము ముంగిసల్లా...
ద్ధవైరం ఉన్నవారిని, ఎప్పటికీ కలవనివారిని గురించి చెప్పాల్సినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పాము, ముంగిస అనేవాటికి పుట్టుకతోనే వైరస్వభావం ఉంటుంది. అవి ఎప్పుడూ ఎక్కడా ఒకచోట కలిసిఉండవు. అలాగే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒకరిమీద ఒకరు భయంకరమైన పగ, ద్వేషాలతో ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. సంస్కృతంలో వ్యాలనకుల న్యాయంగా ఇది ప్రచారంలో ఉంది.

మర్రి చెట్టుమీద దయ్యం
క విషయాన్ని గురించి ఎవరైనా భయపెట్టినప్పుడు దానిలోని నిజానిజాలను తెలుసుకోకుండా కొందరు అనవసరంగా భయపడిపోతుంటారు. అలాంటి వారిని గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఓ వ్యక్తి దూరంగా ఉన్న దట్టమైన మర్రిచెట్టును చూపించి తన పక్కనున్న వాడితో మర్రిచెట్టు మీద దయ్యం ఉంది అని కొంటెతనానికి అన్నాడట. ఆ వ్యక్తి చెప్పిన దాన్లో నిజమెంత? అబద్ధం ఎంత? అసలు దయ్యాలు ఉంటాయా? ఉన్నాయా? అనేది విశ్లేషించి తెలుసుకోకుండా భయపడిపోయి ఓ అమాయకుడు పరుగెత్తాడట. ఎవరో చెప్పిన వాటికి భయపడిపోతూ బతికేవారిని గురించి చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

గొంతుకలపటం
కరు చెప్పిన దాన్ని అంగీకరించటం, ఏకాభిప్రాయాన్ని ప్రకటించటం, చెప్పినదానికి ఒప్పుకోవటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గొంతు, నాలుక, నోరు ఇట్లాంటివన్నీ భావప్రకటనకు సూచనలు. ఒకరు ఒక భావాన్ని వెలిబుచ్చినప్పుడు అదే భావాన్ని బాగుందని సమర్థించటం గొంతుకలపటంగా అవుతుంది.
కరదీపికలాగా...
రదీపిక అంటే చేతితో పట్టుకున్న కాగడా, దీపం అని అర్థం. కాగడా కానీ, దీపంకానీ వాటివల్ల వాటికి ఏ ప్రయోజనమూ ఉండదు. అది ఇచ్చే కాంతితో ఎదుటివారు ఆనందిస్తుంటారు. దీన్నే మరొకలాగా కొవ్వొత్తితో పోల్చిచెప్పటం కూడా ఉంది. కొవ్వొత్తి తాను కరుగుతూ చుట్టూ ఉన్న వారికి వెలుగునిస్తుంది. ఇలా ఈ జాతీయం నిస్వార్థపరులను గురించి, త్యాగమూర్తులను గురించి తెలియచెప్పేటప్పుడు ప్రయోగంలో కనిపిస్తుంది.
రేవు ఎరిగి పోవాలి
దీప్రయాణాలు నేపథ్యంలో అవతరించింది ఈ జాతీయం. నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటేటప్పుడు ఎక్కడ రేవు ఉంటే అక్కడ ఒడ్డెక్కి అవతలకు పోవటం సులువని పెద్దలు చెబుతారు. రేవు ఎక్కడుందో తెలుసుకోకుండా ఎలాబడితే అలా అవతలి ఒడ్డుకు చేరుకోవాలనుకోవడం ప్రమాదకరమైన విషయం. అంటే జీవితాన్ని సాగించేటప్పుడు శ్రేయస్కరమైన గమ్యాన్ని తెలుసుకొని ఆ రంగంలో ఆ గమ్యం వైపు అడుగులేయాలి. అప్పుడే జీవితం సుఖవంతమవుతుంది. అనే భావనకు ప్రతిరూపంగా ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

పీటముడి
క్లిష్టసమస్య అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఒక్కోసారి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకకపోగా నానాటికీ అవి ఎక్కువవుతుంటాయి. ఈ తీరును దారాలుకానీ, పురికొసలు, దండలు వంటివికానీ మన ప్రమేయం లేకుండా ముడిపడిన తీరుతో పోల్చిచెప్పటం గమనార్హం. కొన్నిసార్లు పడిన ముడులు జాగ్రత్తగా గమనిస్తూ విడదీస్తే విడిపోతుంటాయి. కానీ కొన్నిసార్లు ఒక కొసలాగబోయి మరొక కొసలాగినప్పుడు ముడి విడివడదు. ఇలాంటి స్థితిని పీటముడి పడటం అంటారు. ఈ స్థితిని పోలికగా తీసుకుని ఏదైనా సమస్యను పరిష్కరించపోయినప్పుడు అది మరింతగా క్లిష్టంగా తయారైతే దాన్ని పీటముడిపడింది అంటుంటారు. ‘‘ఇది పీటముడిలాంటి సమస్య. దీన్ని అధిష్ఠానమే విప్పలేకపోయింది’’ అనేలాంటి సందర్భాలలో దీన్ని గమనించవచ్చు.

వేలు మడవటం
లెక్క పెట్టడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చాలా సందర్భాలలో ఎన్ని? ఎంతమంది? అని లెక్క చూసేటప్పుడు చేతివేళ్లను ఒక్కొక్కటిగా మడిచి లెక్కపెడుతుంటారు. స్వభావసిద్ధమైన ఈ మానవ వ్యవహారశైలి ఇలా జాతీయం అయింది.

పెద్దగొడ్డలి నొక్కుపోవటం
హాయాన్ని అందించేవారు దూరం కావటం, ఏదైనా పని తలపెట్టినప్పుడు ఆ పని పూర్తయ్యేందుకు అడ్డంకులు ఏర్పడటం, విపరీతమైన నష్టం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పూర్వకాలంనాటి సాధనలలో గొడ్డలి కూడా ఒకటి. ఈ గొడ్డళ్లలో పెద్ద, చిన్న రకాలు ఉంటాయి. పెద్దగొడ్డలి అంటే పెద్దపెద్ద మొద్దులను సులభంగా నరికి కావలసినట్టు ఉపయోగించుకోవచ్చు. నొక్కుపోవటం, మొక్కవోవటం ఇలాంటివన్నీ గొడ్డలి పదును పోయిందని, గొడ్డలి విరిగిందని చెప్పాల్సి వచ్చినప్పుడు అనే మాటలు. ఈ భావనతోనే పెద్దగొడ్డలి నొక్కుపోవటం అంటే పెద్దదిక్కుగా ఉండేవారు దూరమయ్యారనే అర్థంతో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
చేతులు పిసుక్కోవటం...
దైన్యస్థితిని ప్రదర్శించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మనిషి శారీరకంగా కొన్నికొన్ని భావాలను ప్రదర్శించేటప్పుడు కొన్నికొన్ని చేష్టలను చేస్తుండటం సహజం. ఎదుటివారి దగ్గర దీనంగా ఏదైనా సహాయాన్ని అర్థించేటప్పుడు, ఎదుటి వారికంటే తాను తక్కువ స్థితిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు రెండు చేతులను పనున్నా లేకపోయనా దగ్గరకు తీసుకుని ఒకచేత్తో మరొకచేతిని ఒత్తుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఇది వ్యక్తి స్వాభావికమైన చర్య. ఈ చర్యే జాతీయ రూపంగా అవతరించింది.
చేతిలోనివాడు
సొంతమనిషి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చేతిలో ఉన్నదేదైనా సొంతం అనే భావన ఉంటుంది. అందుకే చేతిలోని మనిషి అనంటే సొంతమనిషి, నమ్మకస్థుడు అనేలాంటి అర్థాలు ప్రచారంలొకొచ్చాయి.
వంచిన నడుము ఎత్తకుండా...
విశ్రాంతంగా అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పనిని ప్రారంభించడం అని చెప్పటానికి నడుమొంచడం అనే పదాన్ని వాడటం అలవాటుగా ఉంది. కాస్తంత నడుమొంచి పనిచేయి, వీడి పనంటే చాలు నడుమొంగదు ఇలాంటి ఇలాంటి ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే వంచిన నడుము ఎత్తకుండా అనంటే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా పని చేయటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.


నఖశిఖ పర్యంతం
సంపూర్ణంగా అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కాలి గోటి నుంచి నెత్తిమీద ఉన్న జుట్టు దాకా అని దీని అసలు అర్థం. అంటే ఒక మనిషిని వర్ణించేటప్పుడు సంపూర్ణంగా ఎలా వర్ణిస్తారో అదే తీరులో ఒక వర్ణనను చేసేటప్పుడు పూర్తిగా చేశాము అని చెప్పటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ప్రత్యేకంగా పరిశీలన, పరీక్ష ఇలాంటి సందర్భాలలో సంపూర్ణతను సూచించడానికి ఈ జాతీయ ప్రయోగం చేయటం కనిపిస్తుంది.


చమట పిండటం
ష్టపెట్టి పని చేయించడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. చమటోడ్చి అనే రూపం కూడా ఉంది. శ్రమిస్తే దేహానికి చమట పట్టడం సహజం. శ్రమ బాగా ఎక్కువైతే చమట కూడా ఎక్కువవుతుంది. ఈ కోణంలో చమట పిండటం అనంటే తడి వస్త్రాన్ని పిండినప్పుడు ధారగా నీరుకారిన స్థితి భావనలోకి వస్తుంది. పిండటమంటే బాగా కష్టపెట్టడం అనే అర్థం ఈ జాతీయం వాడుకలో ధ్వనిస్తుంది. మొత్తం మీద ఎవరినైనా బాగా కష్టపెట్టి మరొకరు పని చేయిస్తున్న సందర్భాలలో చమటపిండి వదిలిపెట్టారు అని అనటం వాడుకలో ఉంది.

పులిస్వారీ...
ప్రమాదభరితమైన పని అనే అర్థంలోనూ, సాహస కృత్యాలు అనే అర్థంలోనూ ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పులిని దూరం నుంచి చూడాలన్నా భయమే. అలాంటిది పులిని పట్టుకొని దానిమీద ఎక్కి స్వారీ చేయడమంటే ఎంత ప్రమాదభరితమైన వ్యవహారమో, ఎంతటి సాహసకృత్యమో ఎవరైనా వూహించవచ్చు. అలాంటి సాహసకృత్యమని ఏది అనిపించినా ఆ పని చెయ్యడానికి పూనుకున్నవారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

అగ్నిపిండం
నిప్పులాంటి మనిషి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. దుడుకు పిండం అనే ప్రయోగం ఇంకొకటి ఉంది. అంటే దుడుకుగా వ్యవహరించే వ్యక్తి అని అర్థం. ఇదే తీరులో అగ్నిపిండం అంటే నిప్పులాంటి వాడన్నది భావన. నీతినిజాయితీలకు, నిజానికి, స్వచ్ఛతకు మారుపేరుగా నిప్పును సూచిస్తారు. అలాంటి అర్ధంలో స్వచ్ఛమైనవాడు అనే ప్రయోగం కనిపిస్తుంది. అయితే దీన్ని కొంతమంది సమీపానికి వెళ్లినవారిని ఎవరినైనాసరే తన సహజలక్షణంతో కష్టపెట్టేవాడు అనే అర్థంలో కూడా ఈ జాతీయాన్ని అక్కడక్కడా వాడటం కనిపిస్తుంది.

తునిమి తూటాడటం...
తునటము అనంటే కొయ్యటము లేదా సంహరించటం అని అర్థం. తనుము అనే పదమే తుంపు అనే రూపంగా కూడా కనిపిస్తుంది. తూట అంటే రంధ్రం అని అర్థం. తూటాడటమంటే రంధ్రాలు పడేలా కొట్టడం. మొత్తం మీద ఈ జాతీయం.. మహాభయంకరంగా కొట్టి సంహరించిన సందర్భాలలో ప్రయోగిస్తారు. ‘వాడి జోలికివెళితే తునిమి తూటాడుతాడు జాగ్రత్త’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.
బండెడు
ధికం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వం వస్తువులను లేదా ధాన్యంలాంటి వాటిని గంపలకు, బండ్లకు ఎత్తించి పంపుతుండేవారు. గంపలకు ఎత్తినదానికన్నా బండినిండా వేసినవి ఎంతో అధికంగా ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని గమనించి ఆ భావనతో దీన్ని జాతీయంగా ప్రయోగంలోకి తెచ్చారు పూర్వులు.
తోక తెగకోయటం
వమానించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కుక్కలాంటి జంతువుల విషయంలో కొన్నిసార్లు వాటి చెవులను, తోకను కత్తిరిస్తుంటారు. అలా చేయడం వల్ల వాటి ప్రవర్తనలో మార్పు వస్తుందన్నది భావన. ఇదే మనిషి విషయంలోకి వచ్చినప్పుడు అంతకు ముందెవరైనా పొగరుమోతుతనంతో కానీ, పెడసరంగా కానీ ఉన్నప్పుడు వాడి పొగరును తగ్గించేందుకు తగిన అవమానం జరపటాన్ని తోక తెగకోయడం అని అనటం కనిపిస్తుంది.
శూర్పణఖ మేనకోడలు
మేనమామ, మేనత్తల పోలికలు బిడ్డలకొస్తాయన్నది ఓ నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకొచ్చింది. రామాయణకథలోని పాత్ర శూర్పణఖ. రావణాసురుడి చెల్లెలైన ఈమె రాక్షసస్వభావం, వంచన తత్వంతో కనిపిస్తుంది. ఇటువంటి స్వభావాలు స్త్రీలలో ఎవరి దగ్గరైనా కనిపించినప్పుడు ఈ జాతీయంతో సూచించటం ప్రయోగంలో ఉంది.

కుక్క నిద్ర
కుక్క ప్రవర్తన అనేక విధాలుగా జాతీయాలుగా అవతరించింది. కొన్నిసార్లు నీచమైన జంతువుగా కుక్కను చెబుతుంటారు. అలాగే విశ్వాసానికి మంచి ఉదాహరణగా కూడా పేర్కొంటారు. నీచత్వం, విశ్వాసంతోపాటు తనది అని భావించిన కాపలా విషయంలో కానీ తన ఆత్మరక్షణ విషయంలోకానీ కుక్కకున్న చురుకుదనం కూడా జాతీయంగా అవతరించింది. కుక్క తోకను ఎప్పటికీ సరికాని వంకరబుద్ధికి ప్రతీకగా చెబుతారు. దాలిగుంటలో పడుకొని లేచిన కుక్కను ఎప్పటికప్పుడు బుద్ధి మార్చుకొనే తత్వానికి ప్రతీకగా వివరిస్తారు. ఈ జాతీయంలో జాగ్రత్తగా వ్యవహరించే తీరు కనిపిస్తుంది. కుక్క గుర్రుపెట్టి ఎవరెంతసేపు లేపినా లేవకుండా ఉండేలాగా నిద్రపోదు. ఏ మాత్రం అలికిడైనా మేల్కొని జాగ్రత్తపడుతుంది. అలాంటి జాగ్రత్తపడే తత్వానికి, అతిగా నిద్రపోకుండా మొద్దుగా వ్యవహరించకుండా ఉండే తత్వానికి సూచనగా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

ఎరలేని గాలం
వ్యర్థ ప్రయత్నం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గాలానికి ఎరను గుచ్చి వేట ప్రారంభించినప్పుడే చేపలు గాలానికి చిక్కుతాయి. ఎర లేకుండా ఒక్క గాలాన్నే వదిలితే దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అలాగే ఒక లక్ష్యాన్ని చేరాలనుకొన్నప్పుడు దానికి తగిన సాధనాలన్నిటినీ సమకూర్చుకొని ముందుకు నడవాలి. అంతేకానీ ఏమీ లేకుండా వెళితే పని జరగదు అనే విషయాన్ని వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

కాడి కిందెయ్యటం...
చేస్తున్న పనిని మధ్యలోనే ఆపేయటం అనే అర్థంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. వ్యవసాయ నేపథ్యం నుంచి ఇది ఆవిర్భవించింది. ఎద్దులను నాగలికి కట్టాలన్నా, బండికి కట్టాలన్నా వాటి మెడల మీద కాడిని ఉంచుతారు. అవి పని చేస్తున్నంతసేపూ కాడిని మోస్తూనే ఉంటాయి. ఎద్దు కాడిని కిందపడేసిందంటే దానర్థం పని ఆగిపోయిందని. ఈ అర్థంతోనే చేస్తున్న పనిని ఆపేశారు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

సిగపట్లు
శిఖ’ అనే శబ్దమే వాడుకలో ‘సిగ’గా అయింది. శిఖ అంటే నెత్తిమీది జుట్టు అని అర్థం. తగాదా ఆడుకొనే సందర్భాలలో జుట్టూజుట్టూ పట్టుకొని గింజులాడుకుంటూ ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఈ కొట్లాటే సిగపట్టు. తగాదా అనేది ఓ విషయంలో ఇద్దరి మధ్యన వచ్చిన అభిప్రాయం బేధాన్ని సూచిస్తుంది. ఈ జాతీయం నిజంగా జుట్టూజుట్టూ పట్టుకొని కొట్టుకోకపోయినా, ఓ విషయం మీద ఇద్దరు భిన్న అభిప్రాయాలతో ఉండి ఎవరికి వారు వారు చెప్పిందే వాస్తవమని గట్టిగా చెబుతున్న సందర్భాలలో కూడా ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
బురదలోపడ్డ పోట్లగిత్త...
లవంతుడికి, శౌర్యవంతుడికి కొన్నికొన్నిసార్లు అనుకోకుండా కొన్ని కష్టాలు వస్తుంటాయి. ఎంత శక్తిమంతులైనా తనకు తెలియకుండా వచ్చిపడ్డ కష్టాలకు ఎంతోకొంత బాధపడవలసిందే. ఈ విషయాన్నే తెలియచెబుతుంది ఈ జాతీయం. పోట్లగిత్త అలాంటి శక్తిమంతుడిలాంటిదే. కయ్యానికి కాలు దువ్వుతూ ఎదుటి గిత్తలను చిత్తుచేస్తుంది. అయితే ఏం... ఓసారి అది వెళ్లే దోవలో కొద్దిగా లోతుగా ఉన్న బురద గుంతలో పడాల్సివచ్చిందట. అంతటి పోట్లగిత్త బురదలో నుంచి బయటకు రావటానికి పడాల్సిన ఇబ్బందులన్నీ పడింది. ఇదే తీరులో తెలియకుండా వచ్చిపడ్డ కష్టాలనుంచి బయటపడేందుకు పెద్దలు, బలవంతులు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.
నీళ్లు చల్లటం
నిరుత్సాహపచటం, తగ్గించటంలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాలపొంగును ఉత్సాహంతో పోల్చినప్పుడు పొంగుమీద నీళ్లు చల్లితే పొంగు చల్లారటాన్ని నిరుత్సాహపరచటంగా భావించటం వల్ల ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. అలాగే దుమ్ము రేగుతున్నప్పుడు నీళ్లు చల్లితే దుమ్ము అణుగుతుంది. ఇలాంటి ఉదాహరణలను దృష్టిలో ఉంచుకొని నిరుత్సాహపరచటం. శాంతపచటం, అణచటంలాంటి అర్థాల్లో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
పేగులెండగట్టడం
హారం పెట్టకపోవడం, సరిగా ఆహారాన్ని తినలేనిస్థితి, శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వకుండా ఆపడం లేదా మోసం చేయడం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. సర్వసాధారణంగా ఆహారం తీసుకొనే వ్యక్తికి పేగులు జీర్ణక్రియతో తడిగా ఉంటాయన్నది భావన. పేగులకు ఆహారం అందకపోతే అవి ఎండిపోతాయని సామాన్యజనం అనుకొంటుంటారు. అందుకే ఈ జాతీయం ఆహారాన్ని పెట్టకపోయినా, ఆశించిన ఫలితం దక్కని సందర్భాలలోనూ ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

తాబేలు తీరు
తాబేలులాగా ఉండటం అన్నది దీనికి ఉన్న అర్థం. అంటే తాబేలు నడిచినట్లు నిదానంగా నడవడం కాదు. తాబేలుకు ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదని అనిపించినప్పుడు తన అవయవాలన్నింటినీ డిప్ప లోపలికి లాక్కుని ముడుచుకుని ఉంటుంది. ఈ తీరులో మనిషి ఉండటం మేలంటారు పెద్దలు. అంటే కోర్కెలను అదుపులో పెట్టుకుంటూ వాటిని ఎప్పుడూ ఎక్కడా బహిర్గతం చేయకుండా ఉండాలన్నది దీనిలోని అంతరార్థం. ఆ అర్థాన్ని ప్రకటించాల్సి వచ్చిన్నప్పుడు తాబేలు తీరులో ఉండటం మేలు సుమా అని అంటుండటం కనిపిస్తుంది.

అంటకత్తెర వేయటం
క్కువగా కోత విధించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మామూలుగా పురుషులు కేశాలంకరణ కోసం తగినంతగా శిరోజాలను కత్తెర వేయించుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది శిరోజాలను అధికంగా అంటే ఎక్కువ నిడివి లేకుండా బహుకొద్దిగా మాత్రమే ఉండేలా కత్తెర వేయించుకున్న పద్ధతిని అంటకత్తెర వేయటం అనే పదం వాడుతుంటారు. ఈ పదభావాన్ని ప్రతిబింబిస్తూ ప్రభుత్వాలు కొన్నికొన్ని పథకాలకు సంబంధించిన నిధులను విపరీతంగా తగ్గించినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది.
అత్తగారి సాధింపు
త్తగార్లంతా గయ్యాళివారేనన్న భావన ఉన్న సమాజం నుంచి ఈ జాతీయం ఉద్భవించింది. కోడలు ఎంత అణిగిమణిగి ఉన్నా, ఎంత బాగా పనిచేసినా అత్త స్థానంలో ఉన్న మహిళకు తృప్తి ఉండదంటారు. అలాగే ఆమె కోడలిని సాధించటం కూడా ఎక్కువేనంటారు. ప్రతిదానికీ విసుక్కోవటం, చులకనగా మాట్లాడటంలాంటివి సాధింపులో ఉన్న కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలతో ఎవరు ప్రవర్తిస్తున్నా వారి తత్వాన్ని గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుండటం కనిపిస్తుంది.
ఉక్కు తునకలు
శౌర్యవంతులు, ప్రతాపవంతులు అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఉక్కు దృఢత్వానికి ప్రతీక. తునక అంటే ముక్క అని అర్థం. అంటే ఉక్కు ముక్కలాగా శరీరధారుఢ్యంలో కానీ, మనస్థైర్యంలోకానీ బలవంతులు అని అర్థం. ఎవరినైనా దృఢసంకల్పం కలవారిని, మంచి తెలివితేటలున్నవారిని, బలవంతులను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.
దీపాలార్పే బుద్ధి
తరులను నాశనం చెయ్యటం, క్రూరంగా ప్రాణాంతకంగా ప్రవర్తించటం అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. హాయిగా, ఆనందంగా జీవించే మనిషిని వెలిగే దీపంతో పోల్చి చెబుతుంటారు. అలాంటి మంచి మనుషులను ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతూ వారి జీవితాలను కొంతమంది దుర్మార్గులు నాశనం చేస్తుంటారు. అలాంటి వారిని గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ‘వాడిదొట్టి దీపాలార్పే బుద్ది కాకపోతే మరేమిటి చెప్పండి లేనిపోనివన్నీ చెప్పి అతడి మనస్సు విరగ్గొట్టి శాంతంగా బతికే ఆయనకు ఆత్మహత్య చేసుకునేలా చేశాడు’ అనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.


ఒంటి మీదికి రావటం
వేశంతో మాట్లాడటం, విపరీతమైన కోపాన్ని, ఆగ్రహాన్ని ప్రకటించటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూనకం వచ్చినప్పటి భావావేశస్థితిని దృష్టిలో వుంచుకొని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ఒంటి మీదికి రావటమంటే ఏదో ఒక దేవతో, దేవుడో ఆవహించినట్టు మాట్లాడుతుంటారు. సర్వసాధారణంగా ఆ మాటలు మితిమీరిన ఆవేశంతోనే ఉంటాయి. అలా విడిగా కూడా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

రంగు పులమటం
ల్పించి చెప్పటం, మోసం చేయటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సహజసిద్ధంగా ఉన్న రంగు కాక ఒక వస్తువుకు కృత్రిమంగా మరో రంగు వేస్తే అంతకుముందున్న రంగు మరుగున పడుతుంది. తెలుపు రంగు స్వచ్ఛతకు, నలుపు రంగు మురికికి ఉదాహరణలుగా చెప్పుకోవటం మానవ సమాజంలో అలవాటుగా ఉంది. స్వచ్ఛంగా నీతినిజాయితీలతో ఉన్న వ్యక్తిని తెల్లరంగుకు ఉదాహరణగా తీసుకుంటే అతడి మీద కసికొద్దీ అతడికి దుర్మార్గాలను అంటకట్టడం, చెడ్డ మనిషని ప్రచారం చేయటం అనేది నల్లరంగు పులమటానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఈ భావంతోనే రంగు పులమడమంటే మంచి వ్యక్తిని చెడువ్యక్తిగా ప్రచారం చేయడం అనే అర్థం వ్యాప్తిలోకి వచ్చింది.

బాలింత పులి
క్రూరస్వభావంతో స్వార్థంగా ప్రవర్తించేవాడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పులి ఈనగానే ఎంతో ఆకలితో ఉంటుంది. ఆ ఆకలిని తీర్చుకొనేందుకు అది అప్పుడే పుట్టిన తన పిల్లలను కూడా తినేస్తుంది. పులికి ఇక్కడ తన స్వార్థం తప్ప మరేమి అనిపించదు. అలాగే తన పని కావటానికి ఎంతటి ఘోరానికైనా తెగించే వ్యక్తులను గురించి, వారి మనస్తత్వాలను గురించి తెలియచెప్పే సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
తలపై తల రావటం
అందరికన్నా ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండటం, అప్పటిదాకా ఉన్న తెలివికన్నా ఇంకా ఎక్కువ తెలివి కలవారిగా కనిపించటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తోంది. తల కలిగి ఉండటం అనంటే తెలివి కలిగి ఉండటం అని అర్థం. తల కేవలం శరీరంలోని ఓ అంగం మాత్రమే కాదూ అది తెలివితేటలకు చిహ్నం. తలలోని మెదడు ఆలోచనకు సంబంధించి ఉంటుంది. కనుక ఆ భావనతో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.
అంటగట్టడం...
లవంతంగా ఇవ్వడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా సందర్భాలలో మొహమాటానికో మరొక ప్రలోభానికో లొంగి ఎదుటివారి మాటల వలలో చిక్కుకోవటం జరుగుతుంటుంది. కొంతమంది తమ తెలివితక్కువతనం వల్లకూడా ఇలా ఎదుటివారి వలలో చిక్కుకొంటారు. ఆ పరిస్థితులలో వారు అతితక్కువ ధర ఉండే వస్తువులను కానీ, ఇతర పదార్థాలను కానీ అధిక మొత్తం చెల్లించి కొనడం జరుగుతుంటుంది. ఇలా తక్కువ వెల ఉన్నవాటిని ఎక్కువ వెలతో కొనడంలాంటి సందర్భాలలో ఈ అంటగట్టడం అనే జాతీయం ప్రయోగిస్తుంటారు.‘‘పావలా విలువ చేసేదాన్ని రూపాయిపావలా అని చెప్పి నాకు అంటగట్టి నన్ను వాడు మోసం చేశాడు’’ అని చెప్పే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి.
చుక్క తెగిపడ్డట్టు..
నుకోకుండా అకస్మాత్తుగా వచ్చే వారిని గురించి చెప్పుకొనేందుకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఆకాశం నుంచి అప్పుడప్పుడు ఉల్కలు రాలిపడుతుంటాయి. రోదసిలోని ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోయి నశిస్తాయి. ఈ ఘట్టాన్ని దూరం నుంచి చూసేవారికి ఆకాశం నుంచి నక్షత్రాలే రాలి పడిపోతున్నాయేమో అనిపిస్తుంది. ఇలా ఉల్కాపాతం జరగటానికి ఒక రోజని, ఒక సమయం అని ఏదీ ఉండదు. అలాగే ఏ అర్థరాత్రి వేళొ, ఇంటికెవరైనా అనుకోకుండా వస్తే చుక్క తెగిపడ్డట్టు వచ్చి పడ్డాడని అనుకోవటం కనిపిస్తుంటుంది.
నోట్లో శని...
ఉండీ అనుభవించలేని స్థితిని ఈ జాతీయంతో సూచిస్తారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత కూడా తెలుగునాట బహుళ ప్రచారంలో ఉంది. శని అనేది శనిగ్రహ సూచకం. శని పట్టిన వాళ్లు ఎటువంటి సుఖసంతోషాలకు నోచుకోరన్నది ఓ నమ్మకం. ఆ నమ్మకం ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కొన్నికొన్నిసార్లు కారణాంతరాలవల్ల అనుకున్న పని జరగదు. ఇలాంటి సందర్భాలలో ‘అందరూ అన్ని సాయాలూ చేసారు. కానీ వాడి నోట్లో శని. ఏం చేస్తాం పాపం వాడికి కలిసిరాలేదు’ అంటాం.
పనిపట్టడం...
దుపుచేయడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పని అంటే ఓ వ్యక్తి చేస్తున్న ఏదైనా ఒక పని అని అర్థం. ఆ పని దుర్మార్గతత్వంతోనూ, ఆమోదయోగ్యంగా లేకుండానూ ఉన్నప్పుడు అతడిని ఎదుటివారు అదుపుచేస్తారు. పట్టడం అనంటే క్రియావాచకంగా చూసినప్పుడు పట్టి ఆపడం అని అర్థం వస్తుంది. ఇలా ఆమోదయోగ్యంకాని పనులను చేసేవారిని అదుపుచేయటం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది.

దశ తిరగటం
కాలం కలిసిరావటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇది జ్యోతిషశాస్త్ర సంబంధంగా ఆవిర్భవించిన జాతీయం. జ్యోతిషం ప్రకారం కొంతమందికి కొన్ని గ్రహాల దశలు అనుకూలంగా ఉంటాయన్నది నమ్మకం. ఆ అనుకూల కాలంలో ఏ కార్యం తలపెట్టినా చాలా సులువుగా విజయం లభిస్తుందని అంటారు. ఈ భావన ఆధారంగా అప్పటిదాకా ఎన్నెన్నో కష్టాలను అనుభవించి ఏ కారణం చేతనైనా ఒక్కసారి సంపదలు రావటమో, సుఖాలు ప్రాప్తించటమో జరిగితే ‘‘ఆహా వీడి కష్టాలు ఇన్నాళ్లకు తీరాయి. వీడి దశ తిరిగింది’’. అని అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంది.

వరిగడ్డి మంట
క్కువకాలం నిలవనిది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. వరిగడ్డి మంట కట్టెల మంటలాగా ఎక్కువసేపు ఉండదు. బాగా మండి చప్పున ఆరిపోతుంది. ఈ భావాన్ని ఆధారంగా చేసుకొని అప్పటికప్పుడు బాగా కోపం తెచ్చుకొని మరుక్షణంలో శాంతించేవారి తత్వాన్ని ఈ జాతీయంతో పోల్చి చెబుతారు.
ఇంట్లో పులి.. వీధిలో పిల్లి!
న తెలుగు సంప్రదాయంలో కొన్నికొన్ని జంతువుల తత్త్వాలను రాజసానికి ప్రతీకగా, మరికొన్ని జంతువుల ప్రవర్తనను నూన్యతాభావానికి, లోకువకు ప్రతీకగా మనవారు పోలికగా చెప్పటం కనిపిస్తుంది. పులి, ఎద్దు ఇలాంటి జంతువుల స్వభావాలు పురుష వ్యాఘ్రం, యోగి పుంగవుడులాంటి పదాలుగా వాడుకలో మనకు కనిపిస్తాయి. ఈ జాతీయంలో ఇంట్లో పులి అని అనటంలో ఈ వ్యక్తి కుటుంబసభ్యుల నడుమ మాత్రమే గొప్పవాడిగా ఉంటాడని నలుగురిలోకి వస్తేమాత్రం అతడు అణిగిమణిగి ఉంటాడనే విషయం స్పష్టమవుతుంది. ఇదే జాతీయం తారుమారుగా కూడా చెప్పటం కనిపిస్తుంది. ఇంట్లో పిల్లి, వీధిలో పులి అనికూడా ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అంటే ఇంట్లో అణిగిమణిగి ఉండి వీధిలోకి వస్తే మాత్రం ఎంతో రాజసంగా, హుందాగా కనిపించే వ్యక్తులను గురించి మాట్లాడుకోవటానికి ఈ తరహాలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
రోకటి చిగుళ్లు కోయటం..
సంభవమైన లేదా జరగని పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. రోకలిని చెట్టు మాను నుంచి తయారుచేస్తారు. చెట్టునో, కొమ్మనో నరికి దాన్ని ఎండపెట్టి ఆ తర్వాత రోకలిగా చెక్కి రూపొందిస్తారు. ఇంత జరిగాక ఆ చెట్టు మానుకానీ లేదా కొమ్మకానీ మళ్లీ చిగురు పెట్టడం అనేది జరగదు. రోకలికి చిగురుపెట్టిందని, దాన్ని కోశామని ఎవరైనా చెబితే అది ఎంత నమ్మలేనిపనో ఎవరైనా జరగని పని జరిగిందని చెబుతున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
తేనె తీసినవాడు చెయ్యి నాకకపోడు..
ఎంతో కొంత స్వార్థం లేనిదే ఎవరూ ఏ పనీ చేయరు అని అనుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. చెట్టెక్కి జాగ్రత్తగా తేనెపట్టును పట్టి తీసుకొచ్చి తేనె తీసినవాడి చేతికి తేనె అంటితీరుతుంది. దాన్ని కడిగినందువల్ల లాభమేమిటని ఆ తేనెను ఆ వ్యక్తి నాకటం సహజం. ఈ ఉదాహరణను ఎవరి పనిమీదనన్నా వెళ్లి పని చేసుకొచ్చినవాడు ఎంతోకొంత తాను మిగుల్చుకొని ఉంటాడని అనుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
ముతకతనం..
మోటుగా ఉండటం, సభ్యంగా కాక అశ్లీలంగా ఉండటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ముతకతనం అనేది భాష, సంస్కృతి, వ్యవహారంలాంటివాటి విషయాలలో ఉన్నప్పుడు తక్కువతనంగా భావిస్తుంటారు. ముతక భాష అనంటే అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడటం అలాగే అప్పుడుప్పుడు కొంతమంది ‘‘ఏదో ముతక సామెత చెప్పినట్లు’’ అని అనటం కూడా కనిపిస్తుంది. సభ్యసమాజం మెచ్చుకోని నీచమైన పోలికలతో ఉన్న సామెత అని దీనికర్థం. ఇలా ముతకతనం, ముతకమనిషి, ముతకభాషలను వ్యవహరిస్తుండటం పరిపాటి.
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

‘బాహుబలి’ ఈ యేడాదే?!

‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net