close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఎంను తిడితే నిన్ను కొడతా

దేవినేనిని ఉద్దేశించి మంత్రి కొడాలి వ్యాఖ్యలు

మచిలీపట్నం, న్యూస్‌టుడే: ‘పరస్పరం చర్చకు కూర్చుందాం.. ఆ సందర్భంగా నువ్వు ముఖ్యమంత్రి జగన్‌ను తిట్టు... అప్పుడు బహిరంగంగానే నిన్ను కొట్టకుంటే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతా’ అని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాజీ మంత్రి దేవినేని ఉమాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తనయుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌, పీకేఎం క్రికెట్‌ టోర్నమెంటును మంగళవారం  కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ‘నేను గొల్లపూడిలో చేసిన వ్యాఖ్యలపై దేవినేని ఉమా స్పందించిన తీరు బాగాలేదు. బహిరంగ చర్చకు రావాలంటూ హడావుడి చేస్తే పోలీసులు అనుమతించరన్న విషయం తెలుసుకుని చౌకబారు నాటకాలు ఆడారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా నీకు ఎత్తే దమ్ములేదు. ధైర్యముంటే నువ్వు సూచించిన మీడియాలో ప్రజలకు ఎవరేం చేశారో చర్చించేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నా. ఇద్దరం ఒంటరిగా చర్చలో పాల్గొందాం. ఆ సందర్భంగా నువ్వు ఇష్టానుసారం జగన్‌ను తిడితే అక్కడే కొడతా. ఎవరి షేపులు మారతాయో తెలుస్తుంది. లేని పక్షంలో నేను రాష్ట్రం వదిలి వెళ్లిపోతా’ అని కొడాలి నాని అన్నారు. ‘ఇష్టానుసారం మాట్లాడితే ఇంటికొచ్చి బడితె పూజ చేస్తా’ అంటూ గొల్లపూడిలో తాను అన్న మాటలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు.

ఆగ్రహాన్ని వ్యక్తీకరించడంలో వాడే భాష వేరుగా ఉండొచ్చు: సజ్జల
ఈనాడు, అమరావతి: ‘రాజకీయాల్లో ఎవరు ఏం మాట్లాడినా వ్యక్తీకరణలో (ఎక్స్‌ప్రెషన్‌) తేడాలుండవచ్చు. విషయంలో మేమంతా ఆగ్రహంగా ఉన్నామని చెప్పడానికి ఒక్కొక్కరు ఒక్కోలా తమ భావాలను వ్యక్తపరుస్తుంటారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను చూస్తే నాకదే అనిపించింది’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘అవతలివారు పదేపదే నిరాధార ఆరోపణలు చేస్తున్నప్పుడు, అలా చేయవద్దని ఎంత చెప్పినా మీకర్థం కాదా అని చెప్పడంలో ముతక భాషను వాడి ఉండవచ్చు తప్ప... అన్నంత మాత్రాన ఆయన (మంత్రి నాని) వెళ్లి కొట్టేది లేదు. ఆయన (దేవినేని ఉమా) వచ్చి ఈయన డొక్క చీల్చేదీ ఉండదు. ఏదైనా సరే అది కరెక్టు కాదు. కానీ... రాజకీయం ఆ స్థాయిని దాటిపోయింది. దానికి తెదేపానే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని నేను భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో కిలారు రాజేష్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారన్న కేసును హైకోర్టు కొట్టేయడం గురించి విలేకరులు ప్రస్తావించగా... ‘రాజేష్‌ అంశం చాలా చిన్నది. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని మేం పూర్తిగా నమ్ముతున్నాం. సీబీఐకి ఇప్పటికే అప్పగించాం. అందరూ దొరుకుతారు. న్యాయపరంగానూ చేయాల్సిన ప్రక్రియను మేం చేస్తాం’ అని సజ్జల తెలిపారు.

వైకాపాకు ఆపాదించడం కుట్రే: ధర్మాన
వెదురుకుప్పం, న్యూస్‌టుడే: దేవాలయాలపై దాడి ఘటనలను వైకాపాకు ఆపాదించడం రాజకీయ కుట్రలో భాగమేనని.. ప్రతి పక్షనేత చంద్రబాబు అదే పనిగా విమర్శించడం తగదని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు