Hyderabad vs Lucknow: చెలరేగిన హెడ్‌, అభిషేక్‌.. హైదరాబాద్‌ అద్భుత విజయం

ఐపీఎల్‌-17లో భాగంగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థిపై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 08 May 2024 22:51 IST

వారెవ్వా.. ఇది కదా మ్యాచ్‌ అంటే. బౌండరీల జోరు.. సిక్సర్ల హోరు.. బంతిపడితే చాలు బౌండరీ ఆవలకే అన్నట్లుగా సాగింది హైదరాబాద్‌ దూకుడు. ఈ మ్యాచ్‌ను ఎవరైనా చూడకపోతే అబ్బా ఎందుకు మిస్సయ్యామా అనుకోవాల్సిందే. 166 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఓపెనర్లు ఊఫ్‌మని ఊదేశారు. కేవలం 9.4 ఓవర్లలోనే వికెటే కోల్పోకుండా ఛేదించి ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. 

హైదరాబాద్‌: సొంత గడ్డపై హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్‌నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఓపెనర్లరిద్దరే 9.4 ఓవర్లలోనే కరిగించేశారు. అభిషేక్ శర్మ (75*; 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (89*; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఊచకోతతో ఉప్పల్ స్టేడియం బౌండరీలతో తడిసిముద్దయింది. హెడ్ 16 బంతుల్లో, అభిషేక్ 19 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకున్నారు. వీరిద్దరి ధాటికి పవర్‌ ప్లేలోనే హైదరాబాద్‌ 107/0 స్కోరు చేసింది. అనంతరం కూడా ఈ జోడీ పట్టుసడలించకుండా మ్యాచ్‌ను వేగంగా ముగించేసింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆయుష్‌ బదోని (55*; 30 బంతుల్లో 9 ఫోర్లు), నికోలస్ పూరన్‌ (48*; 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఆదుకున్నారు. కెప్టెన్‌ రాహుల్‌ (29), కృనాల్‌ పాండ్య (24) ఫర్వాలేదనిపించారు. భువనేశ్వర్‌ (2/12) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కమిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు