close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేంద్రం కన్నెర్ర

దిల్లీ ఘటనలపై క్రిమినల్‌ కేసులు
నిర్బంధంలోకి 200 మంది
టికాయిత్‌, యోగేంద్ర సహా 37 మందిపై ఎఫ్‌ఐఆర్‌
ఉద్యమం నుంచి రెండు సంఘాలు వెనక్కి
1న పార్లమెంటుకు పాదయాత్ర రద్దు
ఉద్యమం ఆపేదిలేదన్న రైతులు

దిల్లీ: రైతుల ఆందోళన కారణంగా దిల్లీలో తలెత్తిన ఉద్రిక్తతపై కేంద్రం కన్నెర్ర చేసింది. పెద్దఎత్తున హింస చెలరేగడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. బుధవారం ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమై సమీక్షించారు. గణతంత్ర దినోత్సవం నాడు రణతంత్ర ర్యాలీ నిర్వహించి, ఎర్రకోటపై జెండాలు ఎగరేయడం, అనంతర పరిణామాలకు సంబంధించి ఇంతవరకు 25 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.సుమారు 200 మందిని పోలీసులు నిర్బంధంలో తీసుకున్నారు. రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్‌ టికాయిత్‌, యోగేంద్ర యాదవ్‌, మేధా పాట్కర్‌, దర్శన్‌పాల్‌, గుర్నాంసింగ్‌ చాదుని సహా 37 మంది పేర్లు ఒక ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దిల్లీ సరిహద్దుల్లోని దీక్షా స్థలాలకు రైతులు తిరిగి వెళ్లడం ప్రారంభించారు. దీంతో సింఘు సరిహద్దులో మళ్లీ హడావుడి మొదలైంది. ఉద్యమం నుంచి వైదొలగుతున్నట్లు 2 రైతు సంఘాలు ప్రకటించాయి. హింసకు తాము కారణం కాదని కర్షక నేతలు మరోసారి తేల్చిచెప్పారు. ఉద్యమాన్ని ఆపేది లేదని, పోరాటం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. హింసాత్మక ఘటనలకు కారకులైనవారిని గుర్తించడంపై దిల్లీ పోలీసులు దృష్టి సారించారు. వేర్వేరు ప్రదేశాల్లో నమోదైన సీసీటీవీ దృశ్యాలను, వీడియోలను జల్లెడ పడుతున్నారు. హింసకు కారకులపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శాంతియుతంగా ట్రాక్టర్ల ర్యాలీ చేపడతామని రాతపూర్వక హామీ ఇచ్చి, రైతునేతలు దానికి భిన్నంగా వ్యవహరించారని దిల్లీ పోలీసు కమిషనర్‌ ఎస్‌.ఎన్‌.శ్రీవాస్తవ చెప్పారు. తాము అత్యంత సంయమనంతో వ్యవహరించడం వల్ల ఏ ఒక్కరికీ ప్రాణనష్టం వాటిల్లలేదన్నారు. కొందరు నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తిందని చెప్పారు. ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మంగళవారం నాటి ఘటనల్లో ఆరు బస్సులు, ఐదు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయని గుర్తించారు. అనుమతి లేకుండా లుట్యెన్స్‌ ప్రాంతంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినందుకు ఒక ఎఫ్‌ఐఆర్‌; బ్యారికేడ్లను ధ్వంసం చేసి, బస్సును ఢీకొట్టి, పోలీసు సిబ్బందిపైకి ట్రాక్టర్లను నడపాలని ప్రయత్నించారంటూ మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యాయి. ఆందోళనకారుల చేతుల్లో 394 మంది పోలీసులు గాయాలపాలైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనలపై నాయకుల పాత్ర గురించి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అల్లర్లకు పాల్పడడం (సెక్షన్‌ 147, 148), హత్యాయత్నం చేయడం (సెక్షన్‌ 307), నేరపూరిత కుట్ర (120బి) వంటి సెక్షన్ల కింద నేతలపై కేసులు పెడుతున్నారు.

సమస్యాత్మకంగా మారిన దిల్లీలో పలుచోట్ల భద్రత బలగాలను మరింత ఎక్కువగా మోహరించారు. ముఖ్యంగా ఎర్రకోట, రైతుల ఉద్యమ ప్రదేశాల్లో పారామిలిటరీ బలగాలను పెంచారు. హింస తలెత్తిన నేపథ్యంలో ఆందోళన నుంచి వైదొలగుతున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (భాను), అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ప్రకటించాయి. తాజా పరిస్థితుల్లో.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ సమర్పణ నాడు జరపతలపెట్టిన ‘పార్లమెంటుకు పాదయాత్ర’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నేతలు నిర్ణయించారు. 30న దేశవ్యాప్తంగా సభలు, నిరాహార దీక్షలు కొనసాగించనున్నారు. నటుడు దీప్‌ సిద్ధు వంటి ‘‘సంఘ వ్యతిరేక శక్తులు’’ శాంతియుత ఆందోళనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని, పోరాటాన్ని నీరుగార్చాలని ఎవరు ప్రయత్నించినా అవి ఫలించబోవని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. ఎర్రకోట ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ప్రధాన బాధ్యులుగా భావిస్తున్న ఇద్దరికి నోటీసు పంపినట్లు సమాచారం. రైతుల ఆందోళనల్లో చాలామంది అనుమానితులు ఉన్నారని, తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామనీ ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. రైతుల ఆందోళనలో అల్లర్లపై సర్వోన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి  నేతృత్వంలో స్వతంత్ర కమిషన్‌ను నియమించి విచారణ  జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హింసకు కారకులైన వారందరిపైనా కేసుల నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని దీనిని దాఖలు చేసిన న్యాయవాది విశాల్‌ తివారీ కోరారు. తగిన ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ప్రకటించవద్దంటూ మీడియాను ఆదేశించాలని మరొకరు పిటిషన్‌ వేశారు.
హరియాణాలో 2000 మందిపై కేసు
చండీగఢ్‌: దేశ రాజధానిలోకి బలవంతంగా ప్రవేశించే ఉద్దేశంతో బ్యారికేడ్లను బద్దలుగొట్టే ప్రయత్నం చేశారంటూ దాదాపు 2000 మంది గుర్తుతెలియని వ్యక్తులపై హరియాణాలోని పల్వాల్‌ జిల్లాలో కేసు నమోదైంది. ట్రాక్టర్లను అత్యంత ప్రమాదకరంగా వారు నడిపినట్లు దానిలో పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు