close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాలంటీర్ల ప్రచారం

తిరుపతి ఉపఎన్నికల్లో సీఎం లేఖల పంపిణీ

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పలువురు వాలంటీర్లు ముఖ్యమంత్రి జగన్‌ సంతకం, సందేశంతో పంపిన లేఖలను స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచుతున్నారు. వైకాపా నేతల సూచనల మేరకు గడపగడపకు వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు. కొందరైతే ఏకంగా వైకాపా నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్లతో మంత్రులు, ప్రచారాన్ని పర్యవేక్షించడానికి నియమితులైన ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.డీఆర్‌డీఏ కింద పనిచేస్తున్న పొదుపు సంఘాల సిబ్బందితోనూ వైకాపా ప్రజాప్రతినిధులు భేటీ అవుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం, ఇతరత్రా లబ్ధిని ప్రస్తావిస్తూ ఓటేయాలని కోరాలనే సూచనలను వాలంటీర్లతోపాటు డీఆర్‌డీఏ సిబ్బంది ఆచరిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ మాత్రమే ప్రచారాలు చేయగా ఆదివారంనాటికి పూర్తి స్థాయిలో వారు రంగంలోకి దిగారు. సూళ్లూరుపేట పురపాలక సంఘంలో వైకాపా నేతలు వాలంటీర్లకు సీఎం లేఖలను అందజేయడంతోపాటు ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన వివరాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని ఆదేశించారు. గూడూరు నియోజకవర్గంలో వైకాపా ముఖ్య నేతలు వాలంటీర్లతో 3రోజుల కిందట ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  సీఎం లేఖల పంపిణీకి నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘంలో వాలంటీర్లను ఇటీవల ప్రత్యేకంగా సమావేశపర్చారని సమాచారం.
* శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం వికృతమాలలో కొందరు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సీఎం లేఖల పంపిణీతోపాటు వైకాపా అభ్యర్థి గురుమూర్తికి ఓటేయాలని కోరారు.
* బుచ్చినాయుడుకండ్రిగ మండలం చిన్నాయిగుంట పంచాయతీ తహానగర్‌, పూసలపల్లి గ్రామ వాలంటీర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించడంతోపాటు సీఎం లేఖలను వారు పంచారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలంటే వైకాపా అభ్యర్థికి ఓటేయాలని ఓ రకంగా హెచ్చరించినట్లు సమాచారం.
* వరదయ్యపాళెం మండలం సంతవేలూరులోని మామిడి తోటలో ఇటీవల వాలంటీర్లతో ముఖ్య ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫొటోలు తీయడానికి, వాయిస్‌ రికార్డుకు వీలు లేకుండా సెల్‌ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్‌ చేయించారు.
* బుచ్చినాయుడుకండ్రిగ మండలం కాంపాళెంలో వైకాపా నేతలతో కలిసి వాలంటీర్లు ప్రచారం చేస్తుండగా తెదేపా నాయకులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఇంటింటికి వెళ్లి లేఖలను పంచారు.


వైకాపా నాయకుల చేతుల్లోకి పోస్టల్‌ బ్యాలెట్లు?

ఈనాడు, తిరుపతి: తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికిచ్చే పోస్టల్‌ బ్యాలెట్లను తమకివ్వాలని వైకాపా నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని స్కిట్‌ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ చేపట్టారు. కొందరు వైకాపా నేతలు అక్కడే ఉండి బ్యాలెట్‌ పత్రాలు సిబ్బందినుంచి తిరిగి తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బ్యాలెట్‌ పేపర్లపై సంతకాలు పెట్టించుకొని అధికార పార్టీ నేతలు వారి వద్దే ఉంచుకుంటున్నారని చెబుతున్నారు. ఉపాధ్యాయులు, ఇతర శాఖల్లో పనిచేసే కొంత స్థాయి ఉన్న వారి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు