‘గ్రంథాలయ’ ఛైర్మన్ల తొలగింపు జీవోల రద్దు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గ్రంథాలయ’ ఛైర్మన్ల తొలగింపు జీవోల రద్దు

 రాజకీయ పార్టీ అధికార మార్పుతో ఉద్వాసన పలికారని ఆక్షేపణ
 ఛైర్మన్లను కొనసాగనివ్వాలన్న హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఏపీ గ్రంథాలయ పరిషత్‌  ఛైర్మన్‌తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ల తొలగింపును హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీ  అధికార మార్పుతో పిటిషనర్లకు ఉద్వాసన పలుకుతూ ప్రభుత్వం ఏకపక్ష  నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది. ఛైర్మన్లకు ఉద్వాసన పలుకుతూ రాష్ట్ర  ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో ఇచ్చిన జీవోలను చట్టవిరుద్ధమైనవిగా  ప్రకటిస్తూ.. వాటిని రద్దు చేసింది.  గ్రంథాలయ సంస్థలకు పర్సన్‌  ఇన్‌ఛార్జులుగా అధికారులను నియమించడాన్నీ తప్పుపట్టింది. నామినేటెడ్‌ ఛైర్మన్లుగా పిటిషనర్లను కొనసాగనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తొలగింపు విషయంలో ఏపీ ప్రజా  గ్రంథాలయాల చట్టంలోని సెక్షన్‌ 7(2), 11(3) ప్రకారం గవర్నర్‌కు అధికారం  పరిమితమైనదే కానీ, సంపూర్ణమైంది కాదని స్పష్టం చేసింది. సెక్షన్‌ 18-ఏ  నిబంధనలను అనుసరించకుండా, విచారణ చేయకుండా, వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఛైర్మన్లను తొలగించడం సహజన్యాయ సూత్రాలను  ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. హైకోర్టు  న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు  ఇచ్చారు.  ఏపీ గ్రంథాలయ పరిషత్‌  ఛైర్మన్‌తోపాటు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం,  నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కప, కర్నూలు జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లను తొలగిస్తూ 2019 సెప్టెంబర్‌ 17లో  రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. సంస్థలకు పర్సన్‌ ఇన్‌ఛార్జులను నియమించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌  దాసరి రాజ మాస్టార్‌తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు 10 మంది  అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున  అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదిస్తూ.. గ్రంథాలయ చట్టం సెక్షన్‌ 18ఏ(1)  ప్రకారం ఛైర్మన్లను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. పిటిషనర్ల  తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ..  ఛైర్మన్లు నిర్వహిస్తోంది నామినేటెడ్‌ పోస్టులని, వారిని తొలగించడానికి  కారణం తెలపలేదన్నారు. నోటీసిచ్చి ముందుగా వివరణ తీసుకోలేదన్నారు. సెక్షన్‌ 18ఏలోని నిబంధన విధానాన్ని పాటించకుండా.. అధికారాన్ని ఉపయోగించి  గవర్నర్‌ నేరుగా తొలగించ లేరన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి  తీసుకున్న న్యాయమూర్తి.. 1990లో చేర్చిన కొత్త సెక్షన్ల ప్రకారం గవర్నర్‌ అభీష్టం మేరకు ఛైర్మన్లు విధులు నిర్వహించొచ్చని పేర్కొన్నారని  గుర్తుచేశారు. తొలగింపు విషయంలో 18ఏ ప్రకారం వివరణ ఇచ్చేందుకు  అవకాశం ఇవ్వాలనే నిబంధనలు పాటించకుండా సెక్షన్‌ 11(3) ప్రకారం నేరుగా  తొలగించడానికి గవర్నర్‌కు సంపూర్ణ అధికారం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందుంచిన ఫైల్‌ను  పరిశీలిస్తే.. రాష్ట్రంలో రాజకీయ పార్టీ అధికారం మారడం తప్ప తొలగింపునకు  స్పష్టమైన కారణాలేవీ కనిపించలేదన్నారు. ఏపీ గ్రంథాలయ పరిషత్‌  ఛైర్మన్‌ తొలగింపు విషయంలో మాత్రం ఎలాంటి విచారణ జరపకుండా గవర్నర్‌  నేరుగా తొలగించవచ్చని గుర్తుచేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు