ఏపీలోని 12 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ అమల్లోకి..
close

ప్రధానాంశాలు

ఏపీలోని 12 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ అమల్లోకి..

టర్నోవర్‌ రూ.40 లక్షలు దాటితే హాల్‌మార్క్‌ నగలనే విక్రయించాలి

ఈనాడు, దిల్లీ: దేశంలోని 256 జిల్లాల్లో బుధవారం నుంచి బంగారు నగలపై హాల్‌మార్కింగ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు మినహా మిగిలిన 12 జిల్లాల్లో, తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ అమల్లోకి వచ్చినట్లు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (బీఐఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారీ వెల్లడించారు. ఈ జిల్లాల్లో రూ.40 లక్షలకు మించి టర్నోవర్‌ ఉన్న నగల వ్యాపారులు హాల్‌మార్క్‌ నగలను మాత్రమే విక్రయించాలి. ఆలోపు ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది. ఇళ్లలో ఉన్న పాత బంగారాన్ని ప్రజలు హాల్‌మార్క్‌ లేకున్నా అమ్ముకోవచ్చని, వారి నుంచి వర్తకులు దీన్ని కొనుగోలు చేయొచ్చని తివారీ చెప్పారు. హాల్‌మార్క్‌లో ఆరు అంకెల కోడ్‌తో పాటు బీఐఎస్‌ మార్కు, స్వచ్ఛతకు భరోసా ఇచ్చే ఓచర్‌ ఉంటుందన్నారు. ప్రతి నగల వ్యాపారీ వినియోగదారుడికి ఈ ఓచర్‌ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.  
వర్తకులకు ఆగస్టు వరకు ఊరట
హాల్‌మార్క్‌ నిబంధన అమలు చేయలేకపోయినా, ఆగస్టు వరకు ఆభరణాల వర్తకులపై జరిమానాలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నాణ్యతకు సంబంధించి కొనుగోలుదార్లు ఫిర్యాదు చేస్తే మాత్రం, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 2021 జూన్‌ 15 నుంచి కచ్చితంగా హాల్‌మార్కింగ్‌ నగలే విక్రయించాలని ప్రభుత్వం 2019లోనే ప్రకటించింది. అయితే దేశంలోని లక్షల మంది ఆభరణాల వర్తకులు కొత్త వ్యవస్థలో నమోదయ్యేందుకు సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఆగస్టు వరకు వెసులుబాటు కల్పించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని