శత్రు క్షిపణిని ఆకాశంలోనే ధ్వంసం చేయగలం

ప్రధానాంశాలు

శత్రు క్షిపణిని ఆకాశంలోనే ధ్వంసం చేయగలం

డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ‘శత్రుదేశం క్షిపణి ప్రయోగిస్తే దాన్ని ఆకాశంలోనే ధ్వంసం చేసే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాలుగు దేశాల్లో మనం ఒకరం. ఇలాంటిది ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉండగా, నాలుగో దేశం మనది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకోకుండా, ఎగుమతులు పెంచుకునేలా భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాబోయే అయిదు, పదేళ్లలో ఈ రంగంలో ప్రపంచంలో ముఖ్యదేశంగా భారత్‌ తయారవుతుందనే దానిలో అనుమానం లేదు’ అని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశంలో, తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.

రోజుకు పది లక్షల పీపీఈలు
‘కొవిడ్‌ తొలిదశలో దేశంలో వస్త్ర పరిశ్రమలతో మాట్లాడి, వాటికి సాంకేతిక పరిజ్ఞానం ఇస్తూ పీపీఈలు, మాస్కుల తయారీ ఆరంభించాం. గతంలో ఏటా 46 వేల పీపీఈలు సిద్ధం చేస్తుండగా, 25 రోజుల్లోనే నిత్యం 6 లక్షలు తయారుచేసే స్థాయికి తెచ్చాం. తర్వాత అది రోజుకు 10 లక్షలకు చేరి, ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. బయట రూ.20-25 లక్షలుండే వెంటిలేటర్‌ను, రూ.4.25 లక్షలకే డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ అందుబాటులోకి తెచ్చారు’ అని సతీష్‌రెడ్డి తెలిపారు. ‘బెంగళూరులోని ప్రయోగశాలలో అక్కడికక్కడే ఆక్సిజన్‌ తయారుచేసే ఆన్‌బోర్డ్‌ ఆక్సిజన్‌ జనరేషన్‌ విధానం అభివృద్ధి చేశారు. దాన్ని పెద్ద ప్లాంటుగా తయారుచేసి అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రెండేళ్ల కిందట పెట్టాం. ఈ విషయం ప్రధానికి చెబితే.. ఓ ప్లాంటు తయారుచేసి చూపమన్నారు. ఎయిమ్స్‌లో 15 రోజుల్లో ప్లాంటు సిద్ధం చేశాం. దీంతో ప్రధాని డీఆర్‌డీవో ద్వారా 866 ప్లాంట్ల తయారీకి బాధ్యత అప్పగించారు. 10 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్లు, వాటినుంచి ఆక్సిజన్‌ ఎంత ఇవ్వాలో నియంత్రించే చిన్న పరికరాన్ని రూపొందించాం. అలాంటి లక్షన్నర సిలిండర్లకు ప్రధాని ఆర్డర్‌ ఇచ్చారు’ అని తెలిపారు.

వివిధ కంపెనీల ద్వారా 2డీజీ మందు
‘2001-02లో తయారుచేసిన 2డీజీ మందుకు హైదరాబాద్‌లోని సీసీఎంబీలో కరోనా వైరస్‌పై ప్రయోగాలు చేయిస్తే, ఫలితాలు బాగా వచ్చాయి. ఈ ఏడాది తీవ్ర పరిస్థితుల్లో ఉపయోగానికి అనుమతి ఇచ్చారు. దీని తయారీకి రెడ్డిల్యాబ్స్‌ సహా 18 కంపెనీలు ముందుకొచ్చాయి. అయిదింటికి సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చాం. ఇవి రోజుకు లక్షల ప్యాకెట్లు తయారుచేసేలా సిద్ధంగా ఉన్నాయి’ అని చెప్పారు.


డ్రోన్లను ధ్వంసం చేసే పరిజ్ఞానం

‘డ్రోన్లను పసిగట్టి వాటిని ధ్వంసం చేసే పరిజ్ఞానాన్ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. దీన్ని సైనిక, భద్రత బలగాలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నాం. కృష్ణాజిల్లాలో క్షిపణి పరీక్ష కేంద్రం పనులు త్వరలో మొదలవుతాయి’ అని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని