కారులో ఉన్న వ్యక్తిపై కేసులా?

ప్రధానాంశాలు

కారులో ఉన్న వ్యక్తిపై కేసులా?

చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారు?
దేవినేని కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
విజయవాడలో ఉద్రిక్తత

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-గొల్లపూడి: ‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమంది డీజీపీలను, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను చూశాను. కానీ ఇంత నీచమైన డీజీపీని ఇంతవరకు చూడలేదు. రివర్స్‌ కేసులు పెట్టిస్తారా? 8 గంటలు కారులో కూర్చున్న వ్యక్తి ఎవరిని కులం పేరుతో దూషించారు? ఎవరిపై హత్యాయత్నం చేశారు? మీడియా సమక్షంలోనే ఇన్ని జరిగాయా..?’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని, పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని తీవ్రంగా ధ్వజమెత్తారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని చంద్రబాబు శనివారం గొల్లపూడిలోని దేవినేని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. దేవినేని ఉమా భార్య అనుపమ, కుమార్తెలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. కొండపల్లి అభయారణ్యంలో అక్రమ మైనింగ్‌ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకోలేదని, దాంతో దేవినేని పరిశీలనకు వెళ్లారని చెప్పారు. పోలీసుల సలహాతోనే వారు సూచించిన మార్గంలో తిరిగి వస్తుండగా ఎలా దాడులు చేశారని నిలదీశారు. వారు బెదిరిస్తే మేం పారిపోవాలా..? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ‘బాక్సైట్‌ తవ్వకాల్లో ఏం జరిగింది? మేం చెప్పిందే నిజమైంది. ఎన్‌జీటీ తీర్పు ఇచ్చింది. సిద్ధారెడ్డి అనే రైతు విద్యుత్తు రావడం లేదంటే.. తప్పుడు కేసు పెట్టారు. మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను ఏం చేశారో చూశారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వేధించడమే ఈ ప్రభుత్వం లక్ష్యం. చాలామంది సీఎంలను చూశాను. ఇంత అరాచక సీఎం ఎవ్వరూ లేరు. రేపు వీరు ఈ రాష్ట్రంలో ఉండరా..? ఎక్కడికి పోతారు..? గతంలో నేను ఇలా చేయలేకనా..? పోలీసు వ్యవస్థపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం పోయింది..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ను బదిలీ చేశారు. సీఎం చెప్పినది చేస్తే బలిపశువులు అవుతారు. చట్టాన్ని ఉల్లంఘించినవారు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. సీనియర్‌ అధికారులతో ఒక కమిటీ వేసి కొండపల్లిలో అక్రమ తవ్వకాలు జరిగాయో లేదో నిగ్గు తేల్చండి. గూగుల్‌ చిత్రపటాలను పరిశీలించండి. దోషులను గుర్తించండి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయట్లేదని, ఎస్సీలపైనే దాడులు, తప్పుడు కేసులు పెడుతోందని అన్నారు. కృష్ణా జిల్లాలో పులివెందుల పంచాయతీ చేస్తున్నారని విమర్శించారు.

కరోనా పేరుతో..
కొండపల్లిలో అక్రమ తవ్వకాలపై 10 మంది సభ్యులు నిజనిర్ధారణకు వెళతామంటే.. కొండపల్లి అడవుల్లో, జి.కొండూరులో కరోనా ఉందని పోలీసులు అడ్డుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం అంతా వేలమంది తిరుగుతున్నారు.. సమావేశాలు పెడుతున్నారు.. కానీ మా పదిమంది సభ్యులకు కొవిడ్‌ అడ్డువచ్చిందా.. అని పోలీసులను ప్రశ్నించారు. నాయకులను గృహనిర్బంధం చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు వెంట విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, నాయకులు బోడెప్రసాద్‌, గద్దె అనురాధ తదితరులు ఉన్నారు.


వైకాపా వర్గీయుల నినాదాలు

గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటికి చంద్రబాబు వస్తున్నారని తెలిసి వైకాపా వర్గీయులు ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. దళితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం చంద్రబాబుకు ఇస్తామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ  ఫ్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. సమీపంలోనే ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కార్యాలయానికి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కారంపూడి సురేష్‌ ఆధ్వర్యంలో సుమన్‌కుమార్‌, చారమ్మలు వైకాపా కార్యకర్తలతో చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడికి పోలీసులు చేరుకుని చంద్రబాబు కాన్వాయ్‌ సాఫీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని