వేరుసెనగతో వేగలేం

ప్రధానాంశాలు

వేరుసెనగతో వేగలేం

సాగు మానుకుంటున్న రైతాంగం
ఏపీ రైతు సంఘం, శోధన సంస్థ సర్వే

ఈనాడు-అమరావతి: వేరుసెనగ వేస్తే.. ఆదాయం మాట అటుంచి పెట్టుబడులూ దక్కడం లేదు. ఏటికేడు నష్టాలే.. ఎన్నాళ్లని భరిస్తామంటూ రైతులు సాగు మానుకుంటున్నారు. గత ఏడాది ఖరీఫ్‌లోనూ ఇదే పరిస్థితి.. భారీ వర్షాలతో దిగుబడులు పడిపోవడంతో ఈ ఏడాది రైతులు వెనక్కు తగ్గారు. ముఖ్యంగా 11 లక్షల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం ఉండే అనంతపురం జిల్లాలో పలువురు పొలాలను బీళ్లుగా పెడుతున్నారు. సాగు తగ్గుదల, అందుకు దారి తీస్తున్న కారణాలపై ఏపీ రైతు సంఘం, శోధన సంస్థ కలిసి అనంతపురం జిల్లాలోని 77 గ్రామాల్లో 498 రైతుల నుంచి (కొందరిని స్వయంగా కలవడం, కొందరి నుంచి ఫోన్ల ద్వారా) అభిప్రాయాలు స్వీకరించింది. విత్తన గింజలూ రావడం లేదని కొందరు చెబితే.. పొలాలు అమ్మేద్దామని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని కొందరు వాపోయారు.

అయిదేళ్లలో మూడేళ్లు దెబ్బ.. దిగుబడులు దిగదుడుపే

2016-17 నుంచి అయిదేళ్ల దిగుబడులు పరిశీలిస్తే.. మూడేళ్ల పాటు ఎకరాకు మూడు క్వింటాళ్లలోపే ఉన్నాయి. 2016-17 ఖరీఫ్‌లో ఎకరాకు 168 కిలోలు మాత్రమే వచ్చాయి. గతేడాది కూడా మూడు క్వింటాళ్ల లోపే దక్కింది. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సగటు దిగుబడులు పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలోనే అత్యల్పంగా ఉంది. గుజరాత్‌లో అత్యధికంగా ఎకరాకు 754 కిలోలు.. అత్యల్పంగా 309 కిలోలుగా ఉంది. అనంతపురం జిల్లాలో 129 కిలోలే లభించిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ప్రస్తావించింది.

సాగెందుకు చేయడం లేదంటే..

15 ఏళ్లుగా నష్టాలే వస్తున్నాయి. పెట్టుబడిలో 10 నుంచి 50 మాత్రమే చేతికొస్తోంది.
పెట్టుబడులు ఏటా పెరుగుతున్నాయి. గతేడాది ఎకరాకు రూ.18వేల పెట్టుబడి అయితే ఈ ఏడాది రూ.23వేలకు పెరిగింది. ట్రాక్టర్ల బాడుగ, రవాణా, కూలీ రేట్లు, రసాయన ఎరువులు, పురుగుమందుల మీదే రూ.5వేల వరకు పెరిగాయి.
ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారమూ అందడం లేదు. తెగుళ్లు పెరుగుతున్నాయి.
గతంలో ఎకరానికి రూ.2వేల వరకు కౌలు ఇచ్చేవారు. ఈ ఏడాది ఉచితంగా ఇస్తామన్నా.. తీసుకునేందుకు ఎవరూ రావడం లేదు.

ఉపాధి కూలీ సొమ్ములే.. పంటకు పెట్టుబడి: అధ్యయన బృందం

మూడేళ్లుగా రైతులకు రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలు ఇవ్వడం లేదు
ఎంతసేపు వర్షాభావం అని తప్పితే.. దిగుబడులు తగ్గడంపై శాస్త్రీయ పరిశోధనలు చేయడం లేదు.
కరవు ప్రాంత మెట్ట రైతులకు ప్రత్యేక పథకాలు కొరవడ్డాయి. ఉపాధి హామీ పథకం అనుసంధానించాలని కోరుతున్నా అమలు చేయడం లేదు.
ఉపాధిహామీ పనికి వెళ్లి.. దానికి వచ్చిన డబ్బుతోనే వేరుసెనగ పంటకు పెట్టుబడులు పెడుతున్నారు


పొలం అమ్ముదామంటున్నారు

- నారాయణరెడ్డి, ఇప్పేరు, కుడేరు మండలం

‘80 ఎకరాల పొలం ఉంది. అప్పులు తీర్చడానికి అయిదెకరాలు అమ్మేశాను. వ్యవసాయంలో నష్టాలు భరిస్తూ.. గొడ్డు చాకిరీ చేయడం కంటే.. భూములమ్మి అనంతపురంలో ఇల్లు కట్టించి బాడుగకు ఇద్దామని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటంతో భూములకు మంచి ధరలున్నాయి.


రూ.లక్షన్నర పెడితే.. రూ.40 వేలు వచ్చాయి

- జీవీ చంద్రశేఖర్‌గౌడ్‌, వలస, అమరాపురం మండలం

‘2004 తర్వాత వేరుసెనగలో నష్టమే వస్తోంది. గతేడాది నాలుగు క్వింటాళ్ల విత్తనం పోసి.. రూ.లక్షన్నర పెట్టుబడి పెడితే రూ.40వేలు చేతికొచ్చింది. ఈ ఏడాది మొత్తంగా బీడు పెట్టాం’


విత్తన గింజలూ రాలేదు

- కుళ్లాయప్ప, బుక్కరాయసముద్రం 

‘గత ఏడాది రెండెకరాల్లో వేరుసెనగ వేస్తే విత్తన గింజలూ రాలేదు. రూ.30వేల నష్టం. పొలాలు అమ్మమని కుటుంబ సభ్యులంటున్నారు’


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని