వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యమివ్వండి

ప్రధానాంశాలు

వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యమివ్వండి

రైతుల సమస్యలకు పరిష్కారం చూపండి

శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పిలుపు

ఈనాడు, దిల్లీ: వ్యవసాయరంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం కనుగొనేందుకు ప్రాధాన్యమివ్వాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆలోచనలతో ముందుకురావాలని కోరారు. ఆయన ఆదివారం ఇక్కడ జరిగిన సీఎస్‌ఐఆర్‌ 80వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘వ్యవసాయరంగంతోపాటు, పర్యావరణం, కాలుష్యం, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి అభినందనీయం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సీఎస్‌ఐఆర్‌ సహా భారతీయ శాస్త్రవేత్తలు చూపిన చొరవ కారణంగానే భారతదేశం పెనుప్రమాదం నుంచి బయటపడింది. 75వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో విశ్వమానవాళికి మేలుచేసే మరిన్ని పరిశోధనలపై దృష్టిసారించాలి. ప్రపంచ పరిశోధనారంగంలో భారతదేశాన్ని మొదటిస్థానంలో నిలపాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ యువ శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. మానవాళి శ్రేయస్సు, సౌకర్యవంతమైన జీవితమే పరిశోధకుల అంతిమ లక్ష్యం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ దివ్యతేజ్‌ సౌపతి.. ఉపరాష్ట్రపతి చేతులమీదుగా యువ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.

* డ్రైస్వాబ్‌ ద్వారా నేరుగా కొవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించే విధానాన్ని కనిపెట్టినందుకు హైదరాబాద్‌ సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తలు రాకేష్‌ కుమార్‌ మిశ్ర, టి.కార్తీక్‌ భరద్వాజ్‌, సీజీ గోకులన్‌, సాయ్‌ ఉదయ్‌కిరణ్‌, సంతోష్‌ కె.కుంచా, అర్చన, బి.శివ, దివ్యాసింగ్‌లకు సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రదానం చేశారు.

* కొవాగ్జిన్‌ టీకాలో ఉపయోగించే ఉప ఔషధాన్ని (అడ్జువెంట్‌) తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఎస్‌.చంద్రశేఖర్‌, సీహెచ్‌.రాజిరెడ్డి, ప్రథమ ఎస్‌.మణికర్‌, ఎం.మోహనకృష్ణారెడ్డి, ఎన్‌.జగదీష్‌బాబు, పున్నా నాగేందర్‌లకూ సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఇచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని