కడప జిల్లా పేరు మార్చినప్పుడు.. కర్నూలుకు మార్చలేరా?

ప్రధానాంశాలు

కడప జిల్లా పేరు మార్చినప్పుడు.. కర్నూలుకు మార్చలేరా?

రూ.కోటి నిధులతో స్మారక చిహ్నంగా దామోదరం సంజీవయ్య నివాసం: పవన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కర్నూలు జిల్లాకు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని, దీన్నో డిమాండులా కాకుండా హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చెప్పారు. లండన్‌లోని అంబేడ్కర్‌ భవన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో అదే తరహాలో సంజీవయ్య నివాసాన్ని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతామని, ఇందులో భాగంగానే రూ.కోటితో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కడపను వైఎస్‌ఆర్‌ కడప జిల్లా అని మార్చినప్పుడు అణగారినవర్గాలకు అండగా నిలిచిన సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమేనని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో జనసేన అధికారంలోకొచ్చాక ‘దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా’గా నామకరణం చేస్తుందని ప్రకటించారు. ‘ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా సంజీవయ్య నివాసాన్ని పట్టించుకోలేదు. ఏ పథకానికీ ఆయన పేరు పెట్టలేదు. ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే స్మారక భవనం నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చాం. మేధావులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండేళ్లే సీఎంగా పనిచేసినా ఆయన సేవలు వెలకట్టలేనివి. 6లక్షల ఎకరాలను నిరుపేదలకు పంపిణీ చేశారు’ అని కొనియాడారు.

అమిత్‌ షాకు పవన్‌ జన్మదిన శుభాకాంక్షలు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అమిత్‌షాకు భగవంతుడు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించాలని శుక్రవారం ట్వీట్‌ చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని