Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
వైజ్ఞానిక యోగి

స్వామి జ్ఞానానంద 125వ జయంతి నేడు

ఆధ్యాత్మికత, వైజ్ఞానిక దృక్పథాల మధ్య సమన్వయం సాధించిన మహనీయులు స్వామి జ్ఞానానంద. ఆయన ఆధ్యాత్మికవేత్త, అణుశాస్త్రవేత్త. భారతదేశంలోని ప్రముఖ అణు భౌతిక శాస్త్రనిపుణుల్లో స్వామి జ్ఞానానంద ఒకరు. ఆయన అసలు పేరు భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొరగనమూడిలో 1896, డిసెంబర్‌ 5న జన్మించారు. తల్లిదండ్రులు సీతయ్యమ్మ, రామరాజు దంపతులు. వీరవాసరం, నర్సాపురం, తణుకు పట్టణాల్లో లక్ష్మీ నరసింహరాజు చదువుకున్నారు. 12వ ఏట తణుకులో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక యోగి ఆయనకు శ్రీకృష్ణ మంత్రం ఉపదేశించారు. అది ఆయనకు నిత్యానుష్ఠానమైంది. గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రపై ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ రచించిన ‘లైట్‌ ఆఫ్‌ ఆసియా’ గ్రంథం లక్ష్మీ నరసింహరాజును అమితంగా ప్రభావితం చేసింది. చిన్నతనంలోనే కుమారుడిలో నాటుకుంటున్న వైరాగ్య భావనను గమనించిన తండ్రి దానినుంచి మరలించడానికి సోమావతమ్మతో లక్ష్మీ నరసింహరాజు వివాహం జరిపించారు. ఆ దాంపత్యం రామకృష్ణ పరమహంస, శారదా మాతల జీవనంలాగే సాగింది. నరసింహరాజు కర్మయోగిగా మిగిలిపోయారు.

నరసింహరాజు యుక్త వయసులోనే ఇల్లు విడిచి కలకత్తా వెళ్ళారు. రామకృష్ణ మఠాధిపతి స్వామి శివానందులవద్ద యోగసాధన చేశారు. తండ్రి కోరికపై మళ్ళీ స్వగ్రామం రావలసి వచ్చింది. ఆ తరవాత కుటుంబ బంధాలను వదులుకొని హిమాలయాలకు తరలివెళ్ళారు. నేపాల్‌లో బుద్ధుడి జన్మస్థలం లుంబినిలో, రాజస్థాన్‌లోని అబూ పర్వతంపై, కశ్మీర్‌లో తపస్సు చేశారు. రిషీకేశ్‌లోని స్వర్గాశ్రమంలో స్వామి పూర్ణానంద ఆయనకు సన్యాసదీక్ష ఇచ్చి ‘జ్ఞానానంద’గా నామకరణం చేశారు. తపస్సాధనలోని తన అనుభూతుల ఆధారంగా ‘పూర్ణసూత్రాలు’ రాశారు. 1925-27 మధ్య కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వాటిపై ప్రసంగాలు చేశారు.

తండ్రి సహాయంతో జ్ఞానానంద ఐరోపాఖండంలో పర్యటించారు. ‘పూర్ణసూత్రాలు’ గ్రంథం జర్మనీలో ముద్రితమైంది. అక్కడ వేదాంతం, యోగా, పూర్ణసూత్రాలపై పలు ఉపన్యాసాలు ఇచ్చారు. ‘కాలం-స్థలం’ అంశంపై జ్ఞానానంద ప్రసంగం అక్కడి భౌతిక శాస్త్రాచార్యుడు డాక్టర్‌ డెంబర్‌ను అమితంగా ఆకర్షించింది. డెంబర్‌, ఇతర ఆచార్యుల ప్రోత్సాహంతో గణిత, భౌతిక, రసాయన శాస్త్రాల్లో జ్ఞానానంద ఉన్నత విద్యాభ్యాసం సాగించారు. అప్పట్లో చెకొస్లొవేకియాలో భాగంగా ఉన్న ప్రేగ్‌లో డీఎస్‌సీ (డాక్టరేట్‌ ఇన్‌ సైన్స్‌), బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. ‘ఎక్స్‌-రే స్పెక్ట్రోస్కోపీ, ఫిలాసఫీ ఆఫ్‌ నేచురల్‌ సైన్సెస్‌ అండ్‌ ది థియరీ ఆఫ్‌ టైమ్‌ అండ్‌ స్సేస్‌’ అంశాలపై ఆయన పరిశోధన సాగింది. న్యూట్రాన్‌ను ఆవిష్కరించిన జేమ్స్‌ చాడ్విక్‌తో కలిసి పరమాణు భౌతిక విజ్ఞానంపైనా పరిశోధనలు చేశారు. లండన్‌లోని భారత భౌతికశాస్త్ర సంస్థ ఫెలోషిప్‌ సాధించారు. స్వదేశానికి తిరిగి వచ్చాక కాశీ విశ్వవిద్యాలయంలో కొన్నాళ్లు పనిచేశారు. పరిశోధనలపట్ల ఉత్సుకతతో తెహ్రీ సంస్థానాధిపతి నరేంద్ర షా ప్రోత్సాహంతో రెండోసారి ఐరోపా వెళ్ళారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీలో పనిచేయలేక న్యూయార్క్‌ వెళ్ళి అణుశాస్త్రంలో పరిశోధనలు సాగించారు. ‘ది ఎలిమెంట్స్‌ ఆఫ్‌ నూక్లియర్‌ ఫిజిక్స్‌, నూక్లియర్‌ మోడల్స్‌’ అనే ప్రామాణిక గ్రంథాలు రచించారు.

భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరవాత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆహ్వానంపై స్వదేశానికి తిరిగివచ్చి, దిల్లీలోని జాతీయ భౌతికశాస్త్ర ప్రయోగశాలలో (ఎన్‌పీఎల్‌) ఆచార్యులుగా జ్ఞానానంద విధులు నిర్వహించారు. 1954 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నూక్లియర్‌ ఫిజిక్స్‌ విభాగ వ్యవస్థాపక ఆచార్యులుగా, విభాగాధిపతిగా పదేళ్లు పనిచేశారు. వారి మార్గదర్శనంలో 25 మంది విద్యార్థులు పరిశోధనలు సాగించారు. జ్ఞానానంద గొప్ప దేశభక్తులు. జర్మనీలో ఆయనకు సుభాష్‌ చంద్రబోస్‌ ఆతిథ్యం ఇచ్చారు. లండన్‌లో బ్రిటిష్‌ వ్యతిరేక ప్రసంగాలు సైతం చేశారు. జ్ఞానవైరాగ్యాలతో పాటు, అత్యుత్తమ వైజ్ఞానిక తృష్ణను తన జీవితంలో భాగంగా చేసుకున్న జ్ఞానానంద 1969 సెప్టెంబర్‌ 21న భౌతికంగా తనువు చాలించారు. ఆయన స్వీయచరిత్ర ‘శ్రీస్వామి జ్ఞానానంద చరిత్రామృతం’ ఆయన నిర్యాణానంతరం ముద్రణ పొందింది.

- డి.భారతీదేవి


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.