
తెలంగాణ
రైతుసమస్యలపై కేంద్రం తీరు దారుణం
ఎంపీలు, మంత్రులతో భేటీలో కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: ధాన్యం సేకరణ అంశంపై కేంద్రాన్ని అడుగడుగునా నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎంపీలకు సూచించారు. పార్లమెంటు లోపల, బయట సాగుతున్న నిరసనలను ఉద్ధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరిని ఎండగట్టాలని, విభజన హామీల అమలు వైఫల్యాలు, నిధుల విడుదలలో నిర్లక్ష్యంపైనా ప్రశ్నించాలని ఆదేశాలిచ్చారు. ఇదే అంశంపై పార్టీ ఆధ్వర్యంలో దిల్లీలో ప్రత్యక్ష ఆందోళనకు దిగడంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. ధాన్యం కొనుగోళ్లపై అనుసరించాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు మంత్రులు, తెరాస లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం సమావేశమయ్యారు. 8గంటలపాటు సాగిన ఈ భేటీలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రైతుల సమస్యలపై ఎంపీలు నిరవధికంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ అంశాలన్నింటినీ సభలో లేవనెత్తడం ద్వారా కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. ఇందుకు కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
దేశం దృష్టికి ధాన్యం సమస్య
పార్లమెంట్లో ఆందోళన ద్వారా ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరిని ఎంపీలు దేశమంతా తెలియజేశారని, ఇది అభినందనీయమని సీఎం అన్నారు. ‘‘మున్ముందూ ఇదే పంథా కొనసాగించాలి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో అబద్ధాలు చెప్పారు. గత యాసంగికి సంబంధించి పెండింగులో ఉన్న 5లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకోవాలని మనం కోరుతుంటే, అంతకంటే ఎక్కువే ఇవ్వాల్సి ఉందని సభలో చెప్పడం దారుణం. సమస్యను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతులకు అండగా తెరాస చేస్తున్న ఆందోళనకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఇతర పార్టీలు మనతోపాటు గళమెత్తేందుకు సిద్ధంగా ఉన్నాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన ప్రకటనచేయని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలి. ఇతర పార్టీలను కలుపుకొని ముందుకుసాగుదాం’’ అని సీఎం ఎంపీలకు దిశానిర్దేశం చేశారని సమాచారం.
ఎమ్మెల్సీ స్థానాలన్నీ మనవే
ఈ నెల 10న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని సీఎం తెలిపారు.