
వసుంధర
ఇంటిని పట్టించుకుంటాం కానీ... మన ఆరోగ్యం గురించి వదిలేస్తాం! స్వేచ్ఛగా నవ్వడానికే వెనకాడతాం.... నచ్చిన డ్రస్ వేసుకోవడానికి భయం. మగవాళ్లు గుచ్చిగుచ్చి చూసే చూపుల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరం ఏదో దారి వెతుక్కున్న వాళ్లమే! ఇవేకాదు మన సమస్యలు ఇంకా బోలెడు. వాటిపై చర్చ జరగడానికీ, సమాజంలో అవగాహన పెరగడానికీ ‘ప్రిన్సెస్ పి’ పేరుతో ఒక అమ్మాయి ఏం చేస్తోందో చూడండి..
అది స్త్రీల ఆరోగ్యంపై కార్యక్రమం. మొదట్లో ఒక్కరు కూడా ఇబ్బందులను చెప్పలేదు. కారణం... ఆ సమస్యల్ని ‘గుట్టు’గా భావించటమే. ఆ నిశబ్దాన్ని ఛేదించడానికి బఠాణి గింజ మాస్క్‌ని ధరించిన ‘ప్రిన్సెస్ పి’ వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పింది. నెమ్మదిగా అక్కడున్న వాళ్లు బిడియాన్ని వదిలారు. మాస్క్ ధరించి తమ బాధల్ని చెప్పడం మొదలుపెట్టారు. ‘మా కులంలో ఆడపిల్లలు నెలసరులు ఆగిపోయాయని డాక్టర్ దగ్గరకు వెళ్తే నవ్వుతున్నారు. అందుకని ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నాం’ అంటూ ఒకమ్మాయి బాధపడింది. సఖీ, గౌరవ్ గ్రామీణ్ మహిళా వికాస్ మంచ్, అశోకా యంగ్ ఛేంజ్మేకర్ వంటి సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలతో స్త్రీల సమస్యలని ప్రపంచానికి చాటుతోంది ప్రిన్సెస్ పి.
ఈ వేషం ఎందుకంటే... ప్రిన్సెస్ పి ఆహార్యం చిత్రంగా ఉంటుంది. తలకి బఠాణి గింజ ఆకృతిలో పెద్ద మాస్క్ ఉంటుంది. గుడ్‌గావ్‌కి చెందిన ఈ కళాకారిణి... దిల్లీ కాలేజీ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ చదివింది. 2009లో దిల్లీ ప్రగతి మైదాన్‌లో ఇండియా ఆర్ట్ ఫెయిర్ జరిగినప్పుడు... మహిళా సమస్యలపై ప్రజల్లో చర్చ రేకెత్తించాలన్న ఆలోచనతో ఈ వినూత్న అవతారం ఎత్తింది. ఆ మైదానానికి వచ్చిన పిల్లలు, పెద్దలూ ‘ప్రిన్సెస్ పి’ ఎవరా అని విపరీతమైన ఆసక్తిని కనబరిచారు. అప్పుడే తనకో విషయం అర్థమైంది. ఏదైనా సమస్యపై అందరి దృష్టీ పడేట్టు చేయాలంటే ఉత్సుకతను రేకెత్తించాలని.
‘ఈ మాస్క్‌లో నన్ను ఒకరు చూస్తారన్న భయం లేదు. చేయాలనుకున్నది నిర్భయంగా చేయగలను. ధైర్యంగా ప్రశ్నించగలను’ అనే ప్రిన్సెస్ మహిళలపై వివక్షని ప్రశ్నించేందుకు, చైతన్యాన్ని రేకెత్తించేందుకూ 2019 నుంచీ పూర్తి స్థాయిలో ఈ అవతారం ఎత్తి దేశమంతా తిరుగుతోంది. ‘గోవాలో అమ్మాయిలు ఫుట్‌బాట్ ఆడరు. ఈ వివక్షని ప్రశ్నించేందుకు 8 నెలలు అక్కడే ఉండి స్థానికులకు అవగాహన శిబిరాలు నిర్వహించా. ప్రభుత్వబడుల్లో శిబిరాలు నిర్వహించి అమ్మాయిల్లోనూ బిడియాన్ని పోగొట్టాను. బిహార్ మహిళలు ఆప్లిక్ వర్క్ బాగా చేస్తారు. కళతో వారి బాధని ఎలా వ్యక్తీకరించవచ్చో వివరించా. 72 మంది మహిళలు.. ఆప్లిక్ పనితనంతో, రక్షణకు ప్రతీకగా మహిళ ఆకృతిలో పెద్ద సేఫ్టీపిన్ బొమ్మని చేశారు. పాట్నాలోని ప్రముఖ ఆర్ట్ సెంటర్లో ఈ కళాఖండం ఎంతో మందిని ఆలోచింపచేస్తోంది. కళ అంతిమ లక్ష్యం సామాజిక ప్రయోజనమే కదా!’ అనే ‘ప్రిన్సెస్ పి’ వివిధ వర్గాల బాధితులతో మాట్లాడి సమస్యల్నీ సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకి తెస్తోంది. ఇన్‌స్టాలో తనను వేలమంది అనుసరిస్తున్నారు. తను విశాఖ జిల్లాకూ వచ్చింది. ఏటికొప్పాక కళాకారులతో కాళి, దాది, ఎవ్రీడే ఈజ్ప్రొటెస్ట్ పేరుతో బొమ్మలు చేయించి ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శించింది. తన ముఖాన్ని, పేరుని బయటపెట్టకుండా గోప్యతను పాటిస్తూ మహిళలకు ప్రశ్నించే శక్తిని ఇవ్వాలన్న ‘ప్రిన్సెస్ పి’ ప్రయత్నం అభినందనీయం కదూ.