రుణ వృద్ధికి అనువుగా బ్యాంకింగ్‌ వ్యవస్థ

ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌

ముంబయి: గతంలో కంటే అధిక రుణ వృద్ధికి అనువుగా మన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉత్తమంగా తయారైందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా వెల్లడించారు. బ్యాంక్‌ ఏర్పాటు చేసిన ‘ఎకనామిక్స్‌ కాంక్లేవ్‌’లో ఆయన మాట్లాడుతూ ‘గతంలో రుణ వృద్ధి అధికమైనా, మొండి బకాయిలు ఎక్కువగా ఉండేవి. ఆ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రస్తుతం బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్ఠంగా మారింది. బ్యాంకులు తగినంత మూలధనం కలిగి ఉన్నాయి. రుణ వృద్ధి స్థిరంగా ఉంటోంద’ని తెలిపారు.

* వార్షిక రుణ వృద్ధిని రెండంకెల స్థాయికి తీసుకెళ్లడానికి కొన్నేళ్లపాటు బ్యాంకింగ్‌ వ్యవస్థ కష్టపడాల్సి వచ్చింది. తాజాగా నవంబరు 4తో ముగిసిన పక్షం రోజులకు రుణ వృద్ధి 17 శాతానికి చేరిందని దినేశ్‌ చెప్పారు.

* బ్యాంకింగ్‌ తీరులో మార్పులు రుణదాతలకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. దివాలా స్మృతి, జీఎస్‌టీ నెట్‌వర్క్‌ డేటా, రేటింగ్స్‌ ఎకోసిస్టమ్‌, క్రెడిట్‌ బ్యూరోల వంటివి బ్యాంకులకు బలాన్ని అందిస్తున్నాయని వివరించారు.

15% పెరగొచ్చు: క్రిసిల్‌  

ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుని రికవరీ దిశగా పయనిస్తుండటం, బ్యాలెన్స్‌ షీట్లు బాగుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంక్‌ రుణాల వృద్ధి 15 శాతం మేర పెరగొచ్చని క్రిసిల్‌ నివేదిక వెల్లడించింది. 2022-23లో ఇప్పటి వరకు సుమారు 18 శాతం రుణ వృద్ధి నమోదైంది. ఇది దశాబ్ద కాలంలోనే అత్యధికం.

* మూలధన వ్యయాలతో పాటు వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాల కోసం కార్పొరేట్లు బ్యాంకులకు రుణ దరఖాస్తులు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

* మొత్తం రుణాల్లో 26% వాటా కలిగిన రిటైల్‌ రుణాలు కూడా వేగంగా 17-19% వృద్ధి సాధిస్తాయని అంచనా వేసింది. ప్రధానంగా  గృహ రుణాలకు గిరాకీ పెరుగుతుందని తెలిపింది.

* సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎస్‌ఎంఈ) విభాగంలో 16-18% రుణ వృద్ధి నమోదవుతుందని, వ్యవసాయ రుణాలు సుమారు 10 శాతం పెరగొచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు