రెండో రోజూ ముందుకే

సమీక్ష

బ్యాంకింగ్‌ షేర్లు పరుగులు తీయడంతో వరుసగా రెండో రోజూ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 26 పైసలు తగ్గి 81.93 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.05 శాతం పెరిగి 89.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా షేర్లు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 61,779.71 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. ఒకదశలో 61,442.69 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 91.62 పాయింట్ల లాభంతో 61,510.58 వద్ద ముగిసింది. నిఫ్టీ 23.05 పాయింట్లు పెరిగి 18,267.25 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,246- 18,325.40 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 రాణించాయి. ఎస్‌బీఐ 1.44%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.41%, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.04%, మారుతీ 0.74%, సన్‌ఫార్మా 0.73%, కోటక్‌ బ్యాంక్‌ 0.71% మెరిశాయి. పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ 1.24% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. చమురు-గ్యాస్‌ 0.68%, లోహ 0.65%, ఆర్థిక సేవలు 0.53%, ఇంధన 0.53% పెరిగాయి. కమొడిటీస్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, టెలికాం, యంత్ర పరికరాలు, మన్నికైన వినిమయ వస్తువులు, టెక్‌ నిరాశపరిచాయి. బీఎస్‌ఈలో 1804 షేర్లు లాభాల్లో ముగియగా, 1691 స్క్రిప్‌లు నష్టపోయాయి. 132 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* ఎయిరేషియా విమానాల్లో వైఫై సేవలు: విమానాల్లో వైఫై సేవలు అందించేందుకు క్లౌడ్‌ టెక్నాలజీ సంస్థ షుగర్‌బాక్స్‌తో ఎయిరేషియా ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో 1000కు పైగా అంతర్జాతీయ, భారతీయ చిత్రాలను చూసే సౌలభ్యం ప్రయాణికులకు కలగనుంది. లఘు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ యాప్‌ల ఉచిత కంటెంట్‌ కూడా ఇందులో ఉంటుంది. ‘ఎయిర్‌ఫ్లిక్స్‌’ పేరిట అందించనున్న ఈ సేవలకు ఎటువంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఎయిరేషియా తెలిపింది. వాణిజ్య ప్రకటనల ద్వారా కంపెనీ ఆదాయాన్ని పొందనుంది. ఎయిరేషియా ఇండియాకు ఉన్న 28 విమానాల్లో ఎయిర్‌ఫ్లిక్స్‌ సేవలు లభిస్తాయి.

* ఐనాక్స్‌ గ్రీన్‌ ఎనర్జీ సర్వీసెస్‌ షేర్ల అరంగేట్రం నిరుత్సాహకరంగా సాగింది. ఇష్యూ ధర రూ.65తో పోలిస్తే బీఎస్‌ఈలో 6.92% నష్టంతో రూ.60.50 వద్ద షేరు నమోదైంది. ఇంట్రాడేలో రూ.58.50 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 9% నష్టంతో రూ.59.10 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,725.36 కోట్లుగా నమోదైంది.

* అగ్రోకెమికల్‌ కంపెనీ థర్మాజ్‌ క్రాప్‌ గార్డ్‌ ఐపీఓ నవంబరు 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.216- 237ను సంస్థ నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.251.15 కోట్లు సమీకరించనుంది.

* స్థానిక విక్రేతలతో కొనుగోలుదార్లను కలపడానికి ప్రభుత్వానికి చెందిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ)లో చేరినట్లు మీషో వెల్లడించింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు