కరిపై మలయప్పస్వామి కటాక్షం

ఈనాడు, తిరుపతి, తిరుమల, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి తిరుమలలో శ్రీమలయప్పస్వామి గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఆసీనుడై మాడవీధుల్లో విహరించారు. వేల మంది మహిళలు ఉత్సాహంగా రథాన్ని లాగారు. ఉదయం హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరగనున్నాయి. ఈనెల 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

వాహనసేవలో సీజేఐ, హైకోర్టు సీజే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. సీజేఐ దంపతులకు తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. జస్టిస్‌ లలిత్‌తో పాటు వచ్చిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులకు సుబ్బారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు, 2023 క్యాలెండర్‌, డైరీలు అందజేశారు. అనంతరం న్యాయమూర్తులు సతీసమేతంగా హనుమంత వాహనసేవలో పాల్గొన్నారు. సీజేఐ సతీమణి అమిత కళాకారులతో కలిసి కోలాటం ఆడారు. నృత్యం చేశారు.

దర్శనానికి తితిదే సరికొత్త చర్యలు
తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల్లో ఈ దఫా చేసిన ఏర్పాట్లతో గరిష్ఠ సంఖ్యలో భక్తులు వాహనసేవలను తిలకించినట్లు తితిదే వర్గాలు చెబుతున్నాయి. శనివారం గరుడోత్సవం సందర్భంగా ఈవో ధర్మారెడ్డి ఆదేశాలతో వాహనం ముందు హారతులు రద్దు చేశారు. ఈశాన్యం, నైరుతి, వాయవ్య మూలలతో పాటు కర్ణాటక సత్రాల సమీపంలోంచి భక్తులను మాడవీధుల్లోకి అనుమతించారు. అప్పటికే గ్యాలరీల్లోని రెండు లక్షల మందితో పాటు అదనంగా 45 వేల మంది మాడవీధుల్లోకి వచ్చి దర్శనం చేసుకున్నారు. గరుడ సేవ ప్రారంభమైనప్పుడే తూర్పు గ్యాలరీలోని భక్తులకు దర్శనం లభించినందున, వాహనం ఆగ్నేయం వైపు కదలగానే వారిని ఖాళీ చేయించారు. మళ్లీ బయటి భక్తులతో నింపి, వాహనసేవ ముగింపు వేళ వీరికి దర్శనం కల్పించారు. ఈ రద్దీ కారణంగా ఆదివారం స్వామివారి సర్వదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులకు 12 గంటల సమయం పట్టినట్లు తితిదే ప్రకటించింది.


తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దుప్పల వెంకటరమణ దంపతులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు దర్శించుకున్నారు.


రేపు తిరుమలకు జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

* సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈనెల 4న తిరుమలకు రానున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. 5న శ్రీవారి చక్రస్నానంలో పాల్గొననున్నారు.
* గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం తిరుపతికి రానున్నారు. మధ్యాహ్నం తిరుమలలో స్వామివారిని దర్శించుకుంటారు.మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు