2028నాటికి అమెరికాను అధిగమించనున్న చైనా! - China is going to beat America by 2028 says a Report
close

Updated : 01/01/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2028నాటికి అమెరికాను అధిగమించనున్న చైనా!

లండన్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాను.. రెండో స్థానంలో ఉన్న చైనా 2028 నాటికి అధిగమించనుందని ఓ నివేదిక వెల్లడించింది. తొలుత అంచనా వేసిన దానికంటే ఐదేళ్లు ముందుగానే అగ్రరాజ్యాన్ని చైనా దాటేయనుందని తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడంలో ఇరు దేశాల మధ్య ఉన్న భారీ వైరుధ్యమే ఇందుకు కారణమని వివరించింది. కొంత కాలంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇతివృత్తం.. చైనా, అమెరికా మధ్య ఆర్థిక, అధికారం కోసం జరుగుతున్న పోరు చుట్టే తిరుగుతోందని ‘సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చి(సీఈబీఆర్‌)’ వార్షిక నివేదిక అభిప్రాయపడింది.

చైనాకు కలిసొచ్చిన కరోనా..

కరోనా మహమ్మారి, దాని మూలంగా తలెత్తిన ఆర్థిక పరిణామాలు కాలక్రమంలో చైనాకు అనుకూలంగా మారాయని నివేదిక తెలిపింది. కరోనా కట్టడికి ముందుగానే విధించిన లాక్‌డౌన్‌ డ్రాగన్‌కు కలిసొచ్చిందని పేర్కొంది. అదే సమయంలో పాశ్యాత్య దేశాలు చేసిన జాప్యం చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి అనుకూలంగా మారిందని తెలిపింది. 2021-25 మధ్య డ్రాగన్‌ వృద్ధి రేటు 5.7 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక అది 2026-30 మధ్య 4.5 శాతానికి తగ్గనుందని పేర్కొంది.

జపాన్‌ను వెనక్కి నెట్టనున్న భారత్‌..

ఇక కరోనా సంక్షోభం తర్వాత అమెరికా భారీ స్థాయిలో పుంజుకొని.. 2021-24 మధ్య 1.9శాతం వృద్ధి రేటు నమోదు చేయనుందని నివేదిక అంచనా వేసింది. ఆ తర్వాత అది 1.6శాతానికి పరిమితం కానున్నట్లు తెలిపింది. 2030 దశాబ్ది తొలినాళ్ల వరకు జపాన్‌ తన మూడో స్థానాన్ని అట్టిపెట్టుకోనుందని తెలిపింది. తర్వాత రోజుల్లో ఆ స్థానానికి భారత్‌ చేరుకుంటుందని లెక్కగట్టింది. ఇక ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న జర్మనీ ఐదుకు, ఐదులో ఉన్న బ్రిటన్‌ ఆరుకు పడిపోనుందని తెలిపింది.

భారంగా మారనున్న అప్పులు..

ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమణ కారణంగా 2021లో బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ.. 2035 నాటికి ఫ్రాన్స్‌ కంటే ఆ దేశ జీడీపీ 23శాతం అధికంగా ఉండనుందని తెలిపింది. డిజిటల్‌ ఎకానమీని ఒడిసిపట్టడలో బ్రిటన్‌ ముందంజలో ఉండడమే దీనికి కారణమని వెల్లడించింది. 2020 దశాబ్దిలో వడ్డీ రేట్లు పెరిగే ధోరణిని గమనించవచ్చని తెలిపింది. కొవిడ్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు అప్పులు చేసిన ప్రపంచ దేశాలకు ఇది పెనుభారంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అయితే, 2030ల్లోకి వెళుతున్న కొద్దీ సాంకేతికత, పర్యావరణ అనుకూల ధోరణులు బలపడడం సానుకూలంగా మారనుందని తెలిపింది.

ఇవీ చదవండి...

హృద్రోగ ఔషధాలకు అనూహ్య గిరాకీ

ఐఎంజీ-ఆర్‌లో 50% వాటా కొనుగోలు: ఆర్‌ఐఎల్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని