రెండు గంటల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి! - Stock markets are in deep red
close

Updated : 05/04/2021 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు గంటల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి!

కరోనా భయాలతో కుదేలవుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: మార్కెట్లను కరోనా భయాలు కమ్మేశాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ పాతాలానికి పడిపోతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద ప్రతికూలంగా ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. దీనికి తోడు నేడు నమోదైన కరోనా కేసుల సంఖ్య మదుపర్ల సెంటిమెంటును పూర్తిగా దెబ్బతీసింది. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనంతగా దేశీయంగా రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా తొలిస్థానంలో ఉండగా.. ఇప్పుడు భారత్‌ రెండో స్థానానికి చేరింది. ఈ వార్తలు అప్పటికే నష్టాల్లో ఉన్న సూచీలను మరింత కిందకు దిగజార్చాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 1391 పాయింట్లు కుంగి 48,638 వద్ద కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం 388 పాయింట్లు దిగజారి 14,479కి చేరింది. మొత్తంగా నేడు మార్కెట్‌ ప్రారంభమైన తర్వాత తొలి రెండు గంటల్లో.. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువలో దాదాపు రూ. 4 లక్షల కోట్లు ఆవిరైంది. 

ఉదయం 11:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1307 పాయింట్ల నష్టంతో 48,722 వద్ద.. నిఫ్టీ 371 పాయింట్లు దిగజారి 14,496 వద్ద ట్రేడవుతోంది. ఐటీ షేర్లు రాణిస్తుండడం ఒకింత నష్టాల్ని కట్టడి చేస్తున్నాయనే చెప్పొచ్చు. బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఏకంగా నాలుగు శాతానికి పైగా నష్టాల్లో నడుస్తున్నాయి. విప్రో, బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.   కరోనా కేసుల కట్టడి కోసం దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు మరోసారి అమలులోకి రావొచ్చన్న అనుమానాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతంలో లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు తాజాగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల రూపంలో మరో సవాల్‌ ఎదురవనుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో ఆర్‌బీఐ సర్దుబాటు ధోరణి కొనసాగిస్తూనే కీలక రేట్లలో మార్పులు చేయకపోవచ్చని తెలుస్తోంది. దేశంలో కొవిడ్‌-19 కేసుల రూపంలో ఆర్థిక రికవరీకి ఇవి అడ్డుకట్ట వేసి..ద్రవ్యోల్బణ రేటు పెరిగేందుకు కారణమవ్వొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు ఈవారం వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలపై దృష్టి సారించి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని