ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..?
ఇవి గుర్తుంచుకోండి
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి మనలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేలా చేసింది. దీంతో అనుకోకుండా వచ్చే వ్యాధుల కోసం ముందే ఆర్థికంగా సిద్ధమవ్వాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య బీమాపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ ప్రీమియంతో భవిష్యత్తులో వచ్చే రూ.లక్షల ఖర్చును ఎలా తప్పించుకోవడం అన్న దానిపై అవగాహన పెంచుకుంటున్నారు. నిజానికి అనుకోకుండా వచ్చి పడే జబ్బులు.. ఆరోగ్య పరంగానే కాకుండా.. ఆర్థికంగానూ కుంగదీస్తాయి. అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమా ఉండడమే మంచిది. మరి బీమా అనగానే అనేక కంపెనీలు.. వందల పథకాలు! మరి వీటిలో దేన్ని ఎంచుకోవాలన్నది పెద్ద సమస్యే. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక అంశాలను పరిశీలిద్దాం..
అనువైనదే ఎంచుకోవాలి
ఎవరి అవసరాలు వారివి. ఎన్ని పాలసీలు ఉన్నప్పటికీ.. మనకు అనువైనదే ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాలసీ ఎంపికలో ప్రీమియం ఒక్కటే ప్రామాణికం కాదు. ప్రీమియం తక్కువగా ఉండడం అవసరమే. అలాగే పాలసీ సమగ్రంగా ఉండడమనేది మరింత ముఖ్యమైన అంశం. అలాగే ఎంత మొత్తానికి పాలసీ ఉండాలన్నది కూడా కీలకమైన అంశమే. నిజానికి దీన్ని నిర్ధారించుకోవడం కొంత కష్టమైన పనే. అయితే, మన ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి బట్టి ఏ పాలసీ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. అలాగే రోజురోజుకీ పెరుగుతున్న వైద్య ఖర్చుల్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఈరోజు చికిత్స లేని వ్యాధికి ఓ ఐదేళ్ల తర్వాత మందులు రావొచ్చు. కానీ, దాని కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సి రావొచ్చు. అలాగే ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి రూ.5 లక్షల పాలసీ సరిపోవచ్చు. కానీ, జీవనశైలి, వయసును బట్టి భవిష్యత్తులో వైద్య ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.
పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించుకోండి
ఆరోగ్య బీమా తీసుకునే ముందు మీ ఆరోగ్య స్థితిపై మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అందుకోసం వ్యక్తిగత లేదా కుటుంబ వైద్యుణ్ని సంప్రదించండి. వైద్యుడి సూచన మేరక అవసరమైన పరీక్షలు చేయించుకోండి. ఇక మీ అలవాట్లు కూడా ఓసారి చెక్ చేసుకోండి. నిజానికి ఆరోగ్యానికి హానిచేసే అలవాట్లకు దూరంగా ఉండడం ఉత్తమం. లేదంటే వాటినీ పరిగణనలోకి తీసుకొని.. వాటివల్ల భవిష్యత్తులో ఆరోగ్యానికి ఉన్న ముప్పును బట్టి పాలసీ తీసుకోండి.
వ్యక్తిగత బీమానా లేక ఫ్యామిలీ ఫ్లోటరా?
వ్యక్తిగత బీమా తీసుకోవాలా? లేక కుటుంబం మొత్తానికి కలిపి తీసుకోవాలా అన్నది అందరూ ఎందుర్కొనే సమస్య. అవివాహితులైతే వ్యక్తిగత బీమా సరిపోతుంది. కానీ, పెళ్లైన వారైతే వీలైనంత వరకు ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఖర్చు కూడా కలిసొస్తుంది. అయితే, ఇంట్లో మీరొక్కరే సంపాదించేవారైతే.. ఫ్యామిలీతో పాటు అదనంగా మరో వ్యక్తిగత బీమా కూడా ఉంటే మంచిదని నిపుణుల సలహా. అయితే, స్తోమత, అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకునే ముందు ఇంట్లోని సభ్యులందరికీ కలిపి కవర్ ఇస్తున్నారా లేదా సరిగ్గా చెక్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కరిపై ఏమైనా పరిమితి ఉందా అడిగి తెలుసుకోండి. ఉంటే ఎవరిపై ఎంత ఉందో కనుక్కోండి. దాన్ని బట్టి అది మీకు సరిపోతుందో లేదో చూసుకోండి.
నగదురహిత వైద్యం వెసులుబాటు ఉందా?
ఆరోగ్య బీమా క్లెయిం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి రీయింబర్స్మెంట్. రెండోది నగదురహిత చెల్లింపులు. రీయింబర్స్మెంట్ విధానంలో ముందు మనమే ఆసుపత్రి ఖర్చులన్నీ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత బిల్లులను బీమా సంస్థకు అందించి డబ్బు తీసుకోవాలి. ఇక నగదు రహిత చెల్లింపుల విధానంలో.. బీమా కంపెనీలు కొన్ని ఆసుపత్రులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకొని బీమాదారులకు నగదురహిత సేవలను అందిస్తాయి. ఈ ఆసుపత్రులనే నెట్వర్క్ ఆసుపత్రులంటారు. ఈ నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు బీమాదారుడికి ఓ ప్రత్యేకమైన కార్డును జారీచేస్తారు. ఈ కార్డును ఉపయోగించి బీమాదారు నగదురహిత వైద్యం చేయించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, నెట్‌వర్క్‌లోని ఆసుపత్రులు మీ ప్రాంతంలో ఉన్నాయా.. ఉంటే ప్రమాణాలు ఎలా ఉన్నాయి ముందే చూసుకోవాలి.
అన్నీ కవర్ కావు
ఏ ఆరోగ్య బీమా పాలసీలో అన్ని వ్యాధులు.. ప్రమాదాలు కవర్ కావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి పాలసీలో కచ్చితమైన నిబంధనలు, పరిమితులు ఉంటాయి. వాటిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అసలు మీరు తీసుకునే పాలసీలో ఎలాంటి జబ్బులు కవర్ అవుతున్నాయో తెలుసుకోవాలి. అలాగే ఆ పాలసీ మీ ఆరోగ్య పరిస్థితికి సరిపోతుందో లేదో ఆలోచించుకోవాలి.
వేచి ఉండే కాలం..
పాలసీ తీసుకున్న వెంటనే అది అమల్లోకి రాదు. కొంత వేచి చూసే సమయం (వెయింటింగ్ పీరియడ్) ఉంటుంది. సాధారణంగా ఇది 15-90 రోజుల వరకు ఉంటుంది. అయితే, కొన్ని పాలసీల్లో తొలి రోజు నుంచే రోడ్డు ప్రమాదాల వంటి వాటికి బీమా వర్తిస్తుంది. అలాగే ఒక్కోరకం వ్యాధికి ఒక్కో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాతే ఆయా జబ్బులకు పాలసీ వర్తిస్తుంది. ఈ విషయాలను పాలసీ తీసుకునేటప్పుడే బీమా సంస్థ ప్రతినిధుల్ని అడిగి తెలుసుకోవాలి.
ప్రీమియం పెరుగుదల
వయసును బట్టి ఆరోగ్య బీమా ప్రీమియంను నిర్ధారిస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. అయితే, ఎన్నేళ్లకోసారి.. ఎంత మొత్తం ప్రీమియం పెరుగుతుందన్న దానిపై స్పష్టమైన సమాచారం తెలుసుకోవాలి. అలాగే వైద్య ఖర్చులు కూడా ద్రవ్యోల్బణానికి అతీతం కాదన్నది గుర్తుంచుకోవాలి. రోజులు గడుస్తున్న కొద్దీ వైద్య ఖర్చులూ పెరుగుతాయి. దాన్ని బట్టి పాలసీ మొత్తంలోనూ పెరుగుదల ఉండేదాన్ని ఎంచుకుంటే ఉత్తమం.
నిజాల్ని దాచిపెట్టొద్దు
పాలసీ తీసుకునేటప్పుడు ఏ విషయాన్నీ దాచిపెట్టొద్దు. ఏదైనా సమస్య వెలుగులోకి వచ్చిన తర్వాత అది ముందు నుంచే ఉందని రుజువైతే పాలసీ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. అందుకే పాలసీ పత్రాల్లో అన్ని విషయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పొగ తాగేవారు, మద్యం సేవించే వారు ఈ విషయాల్ని ముందే చెప్పెయ్యాలి. లేదంటే తర్వాత సమస్యలు ఎదురుకావొచ్చు.
చికిత్సలపై పరిమితి
పాలసీని బట్టి వివిధ వ్యాధుల చికిత్సకు బీమా కంపెనీలు చెల్లించే మొత్తంపై పరిమితులు ఉండే అవకాశం ఉంది. ఆ వివరాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగే సహచెల్లింపులు(కోపేమెంట్స్) అనే ఐచ్ఛికం ఉందేమో కనుక్కోండి. అంటే మనం ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నాం. దానికి వారు రూ.45వేల బిల్లు వేశారు. కానీ, బీమాలో మనకు రూ.40వేలే చెల్లించే వెసులుబాటు ఉంది. అలాంటప్పుడు మిగిలిన రూ. ఐదు వేలు కూడా చెల్లించేందుకు కొన్ని సంస్థలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. ఆ అవకాశం మీ పాలసీలో ఉందో లేదో తెలుసుకోవాలి.
అదనపు ప్రయోజనాలు
గతం నుంచీ ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ ఉంటోందా? లైఫ్‌టైమ్ రెన్యూవల్ సదుపాయం ఉందా? ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలకు కవరేజీ లభిస్తోందా? డే కేర్ ట్రీట్మెంట్ వంటివి ఉన్నాయా? ఇవన్నీ అడిగి తెలసుకోవాలి. అలాగే దేనికి ఎంత వరకూ కవరేజీ (సబ్ లిమిట్స్) ఉంటోంది చూసుకోవాలి. క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు సాధారమైపోతున్న నేపథ్యంలో వీలైతే రెగ్యులర్ ప్లాన్‌తో పాటు టాప్ అప్ ప్లాన్ కూడా తీసుకునే అవకాశాన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఉత్తమం. అలాగే పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిం చేసుకోకపోతే.. కొన్ని సంస్థలు వివిధ రూపాల్లో బోనస్ చెల్లిస్తుంటాయి. ఆ ఆప్షన్ ఉందేమో కనుక్కోండి. బ్యాకప్, రీఛార్జి వంటి సదుపాయాలు కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. అవి మీ పాలసీకి వర్తిస్తాయో లేదో తెలుసుకోండి. వీలైతే తీసుకోండి.
ఇవీ చదవండి...
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?