close

Published : 08/03/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూచీల ఊగిసలాటకే అవకాశం

అమెరికా బాండ్లు, ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంపై దృష్టి
చమురు ధరలూ కీలకమే

గురువారం మార్కెట్లకు సెలవు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

స్టాక్‌ మార్కెట్లలో ఈ వారం కూడా విక్రయాల ఒత్తిడి కొనసాగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ట్రెజరీ ప్రతిఫలాలు, ముడిచమురు ధరల వల్ల ఊగిసలాటలు తప్పకపోవచ్చని అంటున్నారు. ఈనెల మధ్యలో జరిగే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి విధాన సమావేశ నిర్ణయాల నుంచి ప్రపంచమార్కెట్లకు సంకేతాలు లభిస్తాయి. ఈ వారం నిఫ్టీ-50 సూచీకి 14,800 వద్ద బలమైన మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లకు గురువారం సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. నిఫ్టీ బ్యాంక్‌ ఈ వారం బలహీనంగా కదలాడొచ్చు. 34800 వద్ద బలమైన మద్దతుకు అవకాశం ఉంది. బుధవారం జరిగే క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ బోర్డు సమావేశాన్ని మదుపర్లు గమనిస్తారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.
* సిమెంటు కంపెనీల షేర్లు సానుకూల ధోరణితో చాలా తక్కువ శ్రేణిలో కదలాడొచ్చు. ఇటీవల పెరిగిన ధరలు సెంటిమెంటుకు ఊతమివ్వొచ్చు. అయితే ధరలపై ప్రభుత్వం ఆందోళన చెందుతుండడం షేర్లపై ప్రభావం చూపొచ్చు.
* స్పెక్ట్రమ్‌ వేలం పూర్తయిన నేపథ్యంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ మళ్లీ పెరగొచ్చు. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు భారీగా స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిన నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేర్లు రాణించవచ్చు. నెలవారీ వినియోగదార్ల గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.
* ఐటీ కంపెనీల షేర్లు చాలా సానుకూల ధోరణితో కదలాడొచ్చు. రక్షణాత్మక రంగాలకు మదుపర్లు మళ్లుతుండడం ఇందుకు నేపథ్యం. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు డిజిటలీకరణకు మారుతున్నందున, మధ్యకాలానికి ఈ రంగం సానుకూలంగానే ఉండొచ్చు.
* మరో దశ లాభాలకు ముందు ఔషధ కంపెనీల షేర్లు ఈ వారం మరింత స్థిరీకరణకు గురికావొచ్చు. భారీ లాభాల అనంతరం నిఫ్టీ ఫార్మా సూచీ స్థిరీకరణ దిశగా పయనిస్తోంది. దీర్ఘకాలానికి ఈ రంగంపై సెంటిమెంటు బులిష్‌గా ఉంది.
* తొమ్మిది నెలల తర్వాత ఉక్కు కంపెనీలు ధరల్లో కోత విధిస్తుండడం లోహ కంపెనీలపై ప్రభావం పడుతుంది. చైనా నుంచి మద్దతు లభిస్తున్నందున, ఉక్కు షేర్లు తిరిగి పుంజుకోవచ్చు. గురువారం బోర్డు సమావేశం ఉన్నందున ఎన్‌ఎమ్‌డీసీ షేర్లు వెలుగులోకి రావొచ్చు.
* భారీ ఆర్డర్ల నేపథ్యంలో యంత్ర పరికరాల షేర్లు లాభాలు అందుకోవచ్చు. భెల్‌, బ్రెత్‌వైట్‌ అండ్‌ కోకు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లపై మదుపర్లు దృష్టి సారింవచ్చు. పీఎల్‌ఐ పథకాల వల్ల దేశీయ ఉత్పత్తి వచ్చే అయిదేళ్లలో 52000 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందన్న ప్రధాని వ్యాఖ్యలు సానుకూలంగా పనిచేయొచ్చు.
* ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ వారం స్థిరీకరణకు గురికావొచ్చు. అంతర్లీనంగా సానుకూలతలు కనిపిస్తున్నాయి. రిఫైనరీ షేర్లతో పోలిస్తే అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు నష్టపోవచ్చు. ముడి చమురు ఉత్పత్తిలో కోత వేయకూడదని ఒపెక్‌ నిర్ణయించడమూ ప్రభావం చూపొచ్చు.
* ఫాడా విడుదల చేసే ఫిబ్రవరి రిటైల్‌ విక్రయ గణాంకాల నుంచి వాహన షేర్లు సంకేతాలు అందుకోవచ్చు. టోకు విక్రయాల్లో దాదాపు అన్ని కంపెనీలూ వృద్ధి నమోదు చేశాయి.
* స్వల్పకాల అంచనాలు మెరుగుపడినందున ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభాల్లో పయనించవచ్చు.  
* బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగొచ్చు. ట్రేడింగ్‌ నాలుగు రోజులే కావడం, తాజా సంకేతాలు లేకపోవడంతో మదుపర్లు బ్యాంకు షేర్లలో జాగ్రత్తగా ట్రేడింగ్‌ చేయొచ్చు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని