‘అ ఆ’లతో గారడీ చేసే ‘అజ్ఞాతవాసి’ త్రివిక్రమ్‌ - Trivikram Srinivas Birthday special story
close
Updated : 07/11/2020 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అ ఆ’లతో గారడీ చేసే ‘అజ్ఞాతవాసి’ త్రివిక్రమ్‌

‘అతడు’.. ‘అఆ’లతో మొదలు పెట్టి ‘అల వైకుంఠపురము’ మీదుగా ‘అత్తారింటికి’ తీసుకెళ్తాడు.. మధ్యలో ‘చిరునవ్వుతో’ మనల్ని పలకరిస్తూ మనతో ‘తీన్‌మార్‌’ ఆడిస్తాడు.. ఆయన సినిమాల్లో హీరోకు ఉండే ‘ఖలేజా’నే వేరు. ‘మల్లీశ్వరి’ అలాంటి అందమైన అమ్మాయిని పరిచయం చేసి, ‘మన్మథుడు’తో ‘జల్సా’ చేయించి, పదే పదే ‘నువ్వేకావాలి’ అనిపిస్తాడు. అందుకే పైకి ‘అజ్ఞాతవాసి’లా కనిపించినా, ఆయన మాటలకు ‘సముద్ర’మంత లోతైన అర్థాలు ఉంటాయి. ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్‌ అంటారు ‘మాయబజార్‌’ చిత్రంలో ఎస్వీఆర్‌. మనిషి జీవితంలో ప్రతీ దశలోనూ మాటకు విలువ ఉంది. అసలు మాటే విలువైనది. విలువలేని మాట అనర్థాలకు దారితీస్తుంది. అలాంటి మాటలనే మాలగా కూర్చి ప్రేక్షకులను మైమరిపించగల దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ‘మాట’ విలువ తెలుసు కనుకే ఆయన మాటలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. శనివారం ఆ ‘మాటల మాంత్రికుడి’ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.

సినీ రంగంలో ప్రతీ రచయితకూ ఒకశైలి ఉంటుంది. త్రివిక్రమ్‌దీ అంతే. కాకపోతే ఆయన కలం కాస్త చిలిపిదనం.. కాస్త వెటకారం.. ఇంకాస్త గాంభీర్యం ఒలకబోస్తుంది. అన్నింటికీ మించి ఆత్మీయమైన మాటలతో ఆలోచింపజేస్తుంది. కొన్ని సంభాషణలు వింటే అరె! నిజమేగా అనిపిస్తుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పూర్తి పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్‌. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. చదువంతా భీమవరంలోనే సాగింది. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు. అంతేకాదు గోల్డ్‌ మెడలిస్ట్‌ కూడా. కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. సాహిత్యంపై ఉన్న అభిరుచే త్రివిక్రమ్‌ను సినిమాల వైపు మళ్లేలా చేసింది. అలా హైదరాబాద్‌ వచ్చిన ఆయన సునీల్‌తో కలిసి ఒకే రూమ్‌లో ఉన్నారు. పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా కూడా పనిచేశారు. ఈ సమయంలోనే ‘స్వయంవరం’ సినిమాకు సంభాషణలు రాసే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ‘నువ్వేకావాలి’, ‘చిరునవ్వుతో..’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘నువ్వునాకు నచ్చావ్‌’, చిత్రాలకు సంభాషణలు రాశారు. తొలిసారి మెగాఫోన్‌ పట్టి తరుణ్‌తో తీసిన ‘నువ్వే నువ్వే’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్‌ రచయిగా కొనసాగారు. ‘వాసు’, ‘మన్మథుడు’, ‘ఒకరాజు ఒకరాణి’, ‘మల్లీశ్వరి’, ‘జై చిరంజీవ’ చిత్రాలకు మాటల రాశారు. ‘చిరునవ్వుతో..’  రచయితగా నంది అవార్డు తెచ్చిపెట్టిన తొలి చిత్రం.

‘అతడు’ పవన్‌తో చేయాలి కానీ..

‘నువ్వే నువ్వే’ చిత్రం తర్వాత మరో సినిమాకు దర్శకత్వం వహించడానికి మూడేళ్లు సమయం తీసుకున్నారు త్రివిక్రమ్‌. మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కించిన ‘అతడు’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. తొలుత ఈ కథను పవన్‌కల్యాణ్‌తో తీద్దామని అనుకున్నారట. కథ చెప్పడానికి పవన్‌ దగ్గరకు వెళ్తే ఆయన వింటూ వింటూ నిద్రపోయారట. దీంతో అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత మహేష్‌తో ఆ సినిమా తీయడం ప్రేక్షకాదరణ పొందడం జరిగిపోయింది. ‘అతడు’ వచ్చి పదేళ్లు దాటినా ఆ సినిమా టీవీలో వస్తే కొద్దిసేపనై ఛానల్‌ మార్చకుండా చూసేవాళ్లు ఎందరో ఉన్నారు. ఆ తర్వాత పవన్‌తో తీసిన ‘జల్సా’ రికార్డుల మోత మోగించింది. పవన్‌ స్టామినా ఎంటో మరోసారి తెలియజెప్పిన సినిమా అది.

ప్రతి సినిమాకు అంచనాలను పెంచుతూ..

మహేశ్‌తో ఆయన తీసిన ‘ఖలేజా’ ఆకట్టుకోలేకపోయినా, సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో త్రివిక్రమ్‌ సక్సెస్‌ అయ్యారు. ఆ తర్వాత  ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అ ఆ’, ‘అజ్ఞాత వాసి’, ‘అరవింద సమేత’ ఇలా ప్రతి చిత్రానికి అంచనాలను పెంచుకుంటూ వెళ్లారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల వైకుంఠపురం’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బాగా దగ్గరయ్యారు. తమన్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మరోసారి ఎన్టీఆర్‌తో..!

‘అరవింద సమేత’తో అలరించిన ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే కథ, కథనాలను సిద్ధం చేసిన మాటల మాంత్రికుడు ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.  మరి కొత్త చిత్రంలో ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారో చూడాలి.

త్రివిక్రమ్‌ సినిమాలోని పంచ్‌డైలాగ్‌లు కొన్ని..

‘‘వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయినట్లు.. ఫెయిల్‌ అయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్‌ అయిపోరు’’- చిరునవ్వుతో..

‘‘మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్లు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్లు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు’’- నువ్వునాకు నచ్చావ్‌

‘‘మనం తప్పు చేస్తున్నామో.. రైట్‌ చేస్తున్నామో మనకు తెలుస్తుంది.. మన ఒక్కళ్లకే తెలుస్తుంది’- నువ్వే నువ్వే

‘‘నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’’- అతడు

‘‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు’- ఖలేజా

‘‘తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది’’- అత్తారింటింకి దారేది

‘‘పని చేసి జీతం అడగొచ్చు. అప్పు ఇచ్చి వడీ అడగొచ్చు. కానీ హెల్ప్‌ చేసి మాత్రం థ్యాంక్స్‌ అడగకూడదు’’- మల్లీశ్వరి

‘‘బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావ్‌ అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగటం అనవసరం’’- నువ్వునాకు నచ్చావ్‌

‘‘కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం’’- తీన్‌మార్‌

‘‘గన్‌ చూడాలనుకోండి తప్పులేదు. కానీ బులెట్‌ చూడాలనుకోవద్దు. చచ్చిపోతారు’’ - అతడు

‘‘బెదిరింపునకు భాష అవసరం లేదప్ప అర్థమైపోతుంది’’-జల్సా

‘‘మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు’’ -సన్నాఫ్‌ సత్యమూర్తి

‘‘రావణాసురిడి మమ్మీ డాడీ కూడా సూర్పణకని సమంత అనే అనుకుంటారు కదే..’’ ‘నువ్వు కత్తి నాన్న’ ‘‘రావణాసురుడి వాళ్లవిడా కూడా వాళ్లయనను పవన్‌కల్యాణ్‌ అనే అనుకుంటుంది’’ ఇది అమ్మోరు కత్తినాన్నోయ్‌’ -అ ఆ

‘‘ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలుకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్‌ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్‌ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్‌ అంటారు. కానీ, ప్రతి జనరేషన్‌లోనూ ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడినే టార్చ్‌ బేరర్‌ అంటారు’’ -అరవింద సమేత

‘‘నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుందా నాన్న.. చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది’’ -అల వైకుంఠపురములో..

‘‘దేనినైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సర్‌.. ఒకటి నేలకు.. రెండు వాళ్లకి...’’ -అల వైకుంఠపురములో..

‘‘గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునేవాళ్లతోనే’’ -అల వైకుంఠపురములో..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని