ఆ ఈవెంట్‌ మేనేజర్‌ని కింద పడేసి కొట్టా! - alitho saradaga interview with sreevani and navya sri
close
Published : 27/05/2021 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఈవెంట్‌ మేనేజర్‌ని కింద పడేసి కొట్టా!

అందం.. అభినయం.. కలిపిన రూపం వారి సొంతం. ఆ అభినయంతోనే ప్రతి తెలుగువారి ఇంట్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నటనలోనే కాదు, మాటల్లో కూడా ఏమాత్రం తీసిపోమంటూ ‘ఆలీతో సరదాగా..’ కార్యక్రమంలో అలరించారు బుల్లితెర భామలు.. శ్రీవాణి, నవ్య స్వామి. వారు పంచుకున్న విశేషాలు, చేసిన అల్లరి మీకోసం..

నవ్యస్వామి అంటే..?అరవింద స్వామి మీకు బంధువా?

నవ్యస్వామి: లేదు సర్‌. మాకు ఇంటిపేరు లాంటిదేమీ ఉండదు. మా నాన్న పేరు స్వామి. ఆ పేరు లాక్కుని నవ్యను నవ్యస్వామిగా మార్చుకున్నా.

తెలుగు పరిశ్రమలోకి ఎలా వచ్చారు?

నవ్యస్వామి: కన్నడ సీరియల్స్‌ చేస్తుంటే డైరెక్టర్‌ చిరంజీవిగారు చూశారు. నాలోని అమాయకత్వం నచ్చి తొలిసారి తెలుగు సీరియల్‌లో అవకాశం ఇచ్చారు. నిజానికి అప్పుడు నాకు తెలుగు అస్సలు తెలియదు. అందుకే మొదట్లో రాకూడదనుకున్నాను. ఆయనే ఇంట్లో అందరినీ ఒప్పించి మరీ తీసుకొచ్చారు.

కొత్తలో మౌనంగా ఉన్న నవ్య.. ఇప్పుడు అందర్నీ ఆటాడిస్తుందట.. నిజమేనా?

నవ్యస్వామి: అదేమీ లేదు సర్‌. నేను ఏదైనా నేరుగా మాట్లాడేస్తాను. అంతకు మించి ఏంలేదు.

శ్రీవాణి: తనుంటే లొకేషన్‌లో అందరికీ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడూ నవ్విస్తూ, మాట్లాడుతూ ఉంటుంది.

టీవీ పరిశ్రమలో కరోనా మొదట వచ్చింది మీకే కదా?

నవ్యస్వామి: అవును. మొదట నన్నే టార్గెట్‌ చేసింది. చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. మధ్యాహ్నం 2 గంటలకు కరోనా పాజిటివ్‌ అని తెలిసింది.  రాత్రి 10గంటల వరకూ కారులో ఉండి ఏడుస్తూనే ఉన్నా. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. జీవితంలో అంతగా ఇంకెప్పుడూ బాధపడలేదు. మొత్తం మూడుసార్లు పరీక్ష చేసినా కరోనా పాజిటివ్‌గానే వచ్చింది. 24 రోజుల తర్వాత నెగెటివ్‌ వచ్చింది. నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. ఆ సమయంలో ధైర్యంగానే ఉన్నాను కానీ.. ఒంటరితనం కారణంగా ఏదో పోగొట్టుకున్న బాధ ఉండేది.

ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి?

శ్రీవాణి: నా చిన్నప్పుడు అంటే 2002లోనే టీవీ పరిశ్రమలో అడుగుపెట్టా. ఈటీవీలో ‘సినీ రంజని మనోరంజని’ కార్యక్రమానికి మొదట చైల్డ్‌ యాంకర్‌గా చేశా. అదే తొలి అడుగు. అప్పుడు కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఎంత భయం ఉండేదో, ఇప్పుడూ అంతే ఉంది.

యాంకరింగ్‌ నుంచి సీరియల్స్‌లోకి ఎందుకొచ్చారు?

శ్రీవాణి: చాలా షోలకు యాంకరింగ్‌ చేశాను. కానీ, పెద్దగా పేరు రాలేదు. అప్పుడే మహేశ్‌ బాబు సోదరి మంజుల ‘ఘర్షణ’ అనే సీరియల్‌లో అవకాశమిచ్చారు. అదే సమయంలో పెళ్లి చేసుకోవాల్సి రావడంతో ఆ సీరియల్‌ ఆగిపోయింది. అప్పటి నుంచి ఆవిడ మళ్లీ ఆ సీరియల్‌ తీయలేదు. ఆ తర్వాత రెండుసార్లు నటించమని ఫోన్‌ చేశారు. కానీ కుదరలేదు.

పెళ్లి వింతగా జరిగిందని తెలుసు. అసలేం జరిగింది?

శ్రీవాణి: అప్పటికి నా మొదటి సీరియల్‌ ‘ఘర్షణ’ చేస్తున్నా. కొన్ని రోజుల చిత్రీకరణ కూడా జరిగింది. మా ఆయన పెళ్లి ప్రతిపాదన తెచ్చారప్పుడే. అంతే, సీరియల్‌ మధ్యలో వదిలేసి వెళ్లా. 45 రోజులు బయటే ఉన్నాం. తిరిగొచ్చాక మా మామగారు ‘చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి. మాకు చెబితే మేమే చేసేవాళ్లం కదరా?’ అని అడిగితే, మా ఆయన వింత సమాధానం ఇచ్చారు. ‘అమ్మాయిని ఇలా తీసుకెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచే ఉన్న కోరిక’ అని చెప్పారు. నన్ను మాత్రం ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని హడావుడిగా తీసుకెళ్లాడు. మా వారు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. కానీ సొంతూరు ఖమ్మం. మాది వికారాబాద్‌ దగ్గర పరిగి. మా అక్క గవర్నమెంట్‌ టీచర్‌. తను పెళ్లి చేసుకుంది. కాబట్టి నేను కూడా చేసుకోవాలని అలా చేసుకున్నాను.

నీక్కూడా.. ఇలా ఛేజింగ్‌లు చేస్తూ పెళ్లి చేసుకోవాలని ఉందా?

నవ్యస్వామి: అలాంటిదేం లేదు సర్‌. ఇంట్లో ఒప్పుకున్నాకే ఏదైనా..  ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు.

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు పూర్తిగా మకాం మార్చారట?

నవ్యస్వామి: నేను ఇక్కడికి వచ్చినప్పుడు పూర్తిగా తెలుగమ్మాయి అవుతానని అనుకోలేదు. ఒక్క సీరియల్‌ చేసి తిరిగి వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ, హైదరాబాద్‌ తెగ నచ్చింది. ఇక్కడ పలకరింపులు ఆత్మీయంగా ఉంటాయి. ఎవరైనా వరుసలతో పిలుచుకోవడం బాగుంటుంది. అలా హైదరాబాద్‌కు సంబంధించిన ప్రతీది నచ్చింది. ఇప్పుడు పూర్తిగా తెలుగమ్మాయిగా మారిపోయాను.

నటి కాకముందు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజమేనా?

నవ్యస్వామి: మొదట్లో మాది ఆర్థికంగా మంచి కుటుంబమే. నాన్న ప్రభుత్వోద్యోగి. కానీ, వ్యాపారంలో దిగి బాగా నష్టపోయారు. ఆర్థికంగా బాగా గడ్డు రోజులు ఎదుర్కొన్నాం. మెడికల్‌ సీట్‌కు రూ.50వేలు కూడా కట్టలేని పరిస్థితులు వచ్చాయి. ఆ కష్టాల ద్వారానే జీవితమంటే ఏంటో, డబ్బు విలువ ఏంటో తెలిసొచ్చింది.

సీరియల్స్‌లోకి ఎలా వచ్చారు?

నవ్యస్వామి: మెడిసిన్‌ చేద్దామనుకుంటున్న సమయంలోనే పత్రికలో ప్రకటన కనిపించింది. ఓ సీరియల్‌ కోసం కొత్తనటులు కావాలని వేసిన ప్రకటన అది. అప్పటికే నటనంటే పిచ్చి. ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. అద్దం ముందు నిల్చొని ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ఓ సారి ప్రయత్నించి చూస్తానని అమ్మతో చెప్పి, పాస్‌పోర్ట్ సైజ్‌ ఫొటో పంపాను. అదృష్టవశాత్తూ ఆ కన్నడ సీరియల్‌కు ఎంపికయ్యాను. ఆ తర్వాత నటిగా కొనసాగుతూ వచ్చాను. అలా డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాను. అందుకు బాధేం లేదు. మంచి నిర్ణయం తీసుకున్నాననిపిస్తుంది.

మీకు కావాలనే నెగెటివ్‌ రోల్స్‌ ఇస్తారా?

శ్రీవాణి: చంద్రముఖి సీరియల్‌లో వేసిన పాత్రకు మంచి పేరొచ్చింది. ప్రతినాయిక పాత్రల్లో ప్రేక్షకులు నన్ను ఇష్టపడటం మొదలైంది. దర్శకులు ఆయా పాత్రలకు నేను సరిపోతాననే ఎంచుకుంటారని అనుకుంటాను.

డైరక్టర్‌ అవ్వాలని ఆలోచన ఉందా?

నవ్యస్వామి: ఆ ఆసక్తి అయితే ఉంది. కొన్నేళ్లుగా సీరియల్‌ నటిగా బిజీగా ఉన్నాను. నటనలో పూర్తి సంతృప్తి కలిగి, మరో అడుగు ముందుకు వేద్దామనిపించినప్పుడు అవకాశం వస్తే తప్పకుండా చేస్తా.

సినిమా అవకాశాలు వచ్చాయా?

నవ్యస్వామి: గత అయిదారేళ్ల నుంచి టీవీ పరిశ్రమలో ఉండటం వల్ల సినిమాల్లోకి వెళ్లేందుకు కుదరలేదు. కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ డేట్స్‌ సర్దుబాటు కాలేదు. భవిష్యత్‌లో వెండితెర మీద మెరవాలన్న కోరిక అయితే బలంగా ఉంది.

నవ్య ప్రేమలో విఫలమై ఇబ్బంది పడింది నిజమేనా?

నవ్యస్వామి: అదొక చేదు అనుభవం. మా ఇద్దరికీ కుదరలేదంతే.

మీరు నటించే సీరియల్స్‌ అమ్మానాన్న చూస్తారా?

నవ్యస్వామి: నాన్న చూడరు. అమ్మ ప్రతీది చూసి నటన, మేకప్‌ అన్నింటి మీద కామెంట్‌ చేస్తుంది. అన్నయ్య మాత్రం నేను ఏడవని సీరియల్‌ ఏదైనా ఉంటే చెప్పు చూస్తానంటాడు.

మీ అమ్మ గారు చాలా ధైర్యంగా కనిపిస్తారు?

నవ్యస్వామి: మా అమ్మ లేకపోతే నేనిక్కడ ఉండేదాన్ని కాదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కుటుంబానికి అండగా నిలబడింది. మాకు వండి పెట్టి, బేకరీ బిజినెస్‌ చూసుకునేది. షాప్‌ మూసేసి రాత్రి ఎప్పుడో వచ్చేవారు. కుటుంబం కోసం చాలా కష్టపడింది. అందుకే అమ్మానాన్నలకు సౌకర్యవంతమైన జీవితం ఇవ్వాలనే నేనూ, అన్నయ్య కష్టపడ్డాం. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. శక్తి ఉన్నంత వరకూ బాగా చూసుకుంటాను.

ఓ ఈవెంట్‌ మేనేజర్‌ను బాగా కొట్టావట కదా?నిజమేనా?

నవ్యస్వామి: ఒక మ్యూజిక్‌ ఈవెంట్‌కి నా ఫ్రెండ్స్‌తో వెళ్లాను. అక్కడే ఈవెంట్‌ మేనేజర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. తాకకూడని చోట తాకాడు.  ఎక్కడలేని కోపమొచ్చింది. కాలర్‌ పట్టుకుని కిందపడేసి కొట్టాను. నా చేతి వేళ్లు కందిపోయేలా చితక్కొట్టాను. ఇప్పటికీ తలచుకుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఎందుకిలా చేస్తారో అర్థం కాదు.

నవ్య ఫైర్‌ బ్రాండ్‌.. అవునా?

నవ్యస్వామి: అలా ఏం లేదు సర్‌. నేను చాలా మంచిదాన్ని.

శ్రీవాణి: అవును సర్‌. చాలా మంచిది. టీవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లలో మంచి నటి కూడా. తనతో ఇలా కూర్చోవడం సంతోషంగా ఉంది.

మీరు నటి కాకుంటే ఏమయ్యేవారు.?

శ్రీవాణి: నాకు ఆ ఆలోచన లేకుండానే టీవీ పరిశ్రమలోకి వచ్చేశాను. ఓ రోజు ఆడిటోరియంలో ఏదో పోటీలో పాల్గొన్నాను. అక్కడికొచ్చిన మీడియా వారు యాంకరింగ్‌ చేస్తారా? అని అడిగారు. అప్పటికి నాకేం తెలియదు. ఆ సమయంలో మా వారే నన్ను తీసుకెళ్లడం, యాంకరింగ్‌లో చేర్పించడం.. ఆ తర్వాత సీరియల్స్‌లో అవకాశాలు రావడం.. అలా జరిగిపోయింది.

మీ పాప చాలా యాక్టివ్‌ అట!

శ్రీవాణి: అవును చాలా యాక్టివ్‌. ఆమె పుట్టిల్లు కూడా ఈటీవీనే. పుట్టిన పదో రోజునే ఈటీవీలో కనిపించింది. ఇంకో విషయం చెప్పాలి.. నన్ను మా అమ్మే పెంచింది. తను ఉద్యోగానికి వెళ్తూ నన్ను యాంకరింగ్‌కు తీసుకెళ్తూ కష్టపడింది. మా నాన్న ఉన్నా లేనట్టే. నన్ను స్కూల్‌కి తీసుకెళ్లడం, చదువుకునే కాలేజీకి రావడం.. చేయలేదు. నా తోటి స్నేహితురాళ్ల నాన్నలు వారితో ప్రేమగా ఉండటం చూస్తే బాధ వేసేది. నాన్న ప్రేమ అనేది నాకు తెలియదు. ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడింది లేదు. ఓ కొత్త డ్రెస్‌ కూడా కొనలేదు. మా మామయ్యే నన్ను తండ్రిలా చూసుకుంటున్నారు. భర్త, అత్తమ్మ వీళ్ల దగ్గరే నాకు ఆ ప్రేమ మళ్లీ దొరికింది. ఇంత మంచి కుటుంబం దొరకడం అదృష్టం. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ గొడవకు కూడా మా నాన్నే కారణం. మీడియా అంతా నన్నో విలన్‌లాగా చిత్రీకరించింది. నేనెక్కడో షూటింగ్‌లో బిజీగా ఉంటే.. ‘శ్రీవాణి ఇల్లు కూలగొట్టింది.. ఇంట్లోంచి సామాను బయటపడేసింది’ అని అయిదు రోజులు ఛానెళ్లలో ఊదరగొట్టేశారు. నేను ఖండించింది మాత్రం చూపించలేదు. ఇప్పటికీ యూట్యూబ్‌లో అవే వీడియోలొస్తాయి. ఇలాంటివి వేసే ముందు వాస్తవాలు తెలుసుకుని చూపిస్తే బాగుంటుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని