రజనీ రూ.45 లక్షలిచ్చాడు: మోహన్‌బాబు
close
Updated : 15/06/2020 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ రూ.45 లక్షలిచ్చాడు: మోహన్‌బాబు

ఆనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్న నటుడు

హైదరాబాద్‌: ‘పెదరాయుడు’ షూటింగ్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తన స్నేహితుడు రజనీకాంత్‌ రూ.45 లక్షలు ఇచ్చాడని నటుడు మోహన్‌బాబు తెలిపారు. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. 1995 జూన్‌ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారంతో ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు అయిన సందర్భంగా మోహన్‌బాబు తాజాగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

‘మా అన్నయ్య నందమూరి తారకరామారావు చేతుల మీదగా 1982లో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌ను ప్రారంభించాను. మొదట్లో ‘ప్రతిజ్ఞ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాను. మా బ్యానర్‌లో ఎన్నో చిత్రాలు రూపొందించి జయపజయాలను చూశాను. అయితే 1995లో మా బ్యానర్‌పై ‘పెదరాయుడు’ నిర్మించాం. అదే ఏడాది జూన్‌ నెలలో ఆ సినిమాని విడుదల చేయగా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి వసూళ్లు కూడా వచ్చాయి. కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘నాట్టమై’ ఆధారంగా చేసుకుని ‘పెదరాయుడు’ నిర్మించాం. రజనీకాంత్‌ చెప్పడంతోనే ‘నాట్టమై’ చూసి, నచ్చడంతో కాపీ రైట్స్‌ కొనుగోలు చేశాను. డైరెక్టర్‌ రవిరాజా నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి ‘ఎం.ధర్మరాజు ఎం.ఏ’ సినిమా తీశాం. ‘నాట్టమై’ గురించి చెప్పగానే ఒకరోజు టైం కావాలని అన్నాడు. ఆ తర్వాత రోజు వచ్చి డైరెక్ట్‌ చేస్తానన్నాడు.’ 

‘రవిరాజా ఒప్పుకున్నాక రజనీకాంత్‌కి కాల్‌ చేసి పెదరాయుడు తండ్రి పాపారాయుడు పాత్రకి ఏ నటుడ్ని ఎంపిక చేయాలో తెలియడం లేదని చెప్పాను. దానికి రజనీ తాను ఆ పాత్ర చేస్తానని చెప్పాడు. ‘పెదరాయుడు’ టైటిల్‌ చెప్పింది కూడా రజనీకాంతే. అలా నటీనటులందర్ని ఎంపిక చేసుకున్నాక ఎన్టీఆర్‌ చేతుల మీదుల సినిమా ప్రారంభించాం. తూర్పుగోదావరి జిల్లాలో షూటింగ్‌ చేశాం. అక్కడి మనుషులు చాలా మంచివాళ్లు. ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. అక్కడి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ జిల్లాలో షూటింగ్‌ చేసిన నా సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి.’

‘రాజమండ్రిలో షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో నేను కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ విషయం రజనీకాంత్‌కి తెలిసింది. వెంటనే అతను రాజమండ్రి వచ్చి రూ.45 లక్షలు ఇచ్చాడు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పాడు. రిలీజ్‌ అయ్యాక డబ్బులివ్వమని అన్నాడు. అలాంటి మంచి స్నేహితుడు ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అని మోహన్‌బాబు తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని