మేం అడ్డుకుంటే జగన్‌ తిరిగేవారా?:చంద్రబాబు
close
Published : 05/02/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేం అడ్డుకుంటే జగన్‌ తిరిగేవారా?:చంద్రబాబు

తెనాలి: తెదేపా ప్రభుత్వం ధర్మం కోసం పోరాడుతోందని.. ఆ విషయం వైకాపా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సభలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్‌ ఎక్కడికెళ్లినా తెదేపా ప్రభుత్వం అడ్డుకోలేదని.. అలా అనుకుంటే జగన్‌ రాష్ట్రంలో తిరిగేవారా? అని ప్రశ్నించారు. నాయకులు మాట్లాడే ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలని చంద్రబాబు హితవుపలికారు. ఇప్పటివరకు 37 మంది చనిపోయారని.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా వైకాపా నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా వ్యవహరిస్తోన్న తీరుకు త్వరలోనే వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో చిల్లర రౌడీలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అప్పుడప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?అనే అనుమానం కలుగుతుందన్నారు. సమావేశాలు నిర్వహించుకోవడానికి వైకాపా వారికి అనుమతులు లభిస్తాయి.. కానీ తెదేపాకు మాత్రం లభించవని అసహనం వ్యక్తం చేశారు. ఆఖరికి ధర్నా శిబిరాన్ని సైతం తగలబెడతారా?అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం, కక్షకు కూడా హద్దులు ఉంటాయని.. సీఎం జగన్‌ ఆ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు.

అమరావతిని మార్చే అధికారం లేదు..

‘సీఎం జగన్‌ హద్దులు దాటి ప్రవర్తిస్తూ ప్రజావేదికను కూల్చారు. అది ఎవరి ఆస్తి? ప్రజల ఆస్తి. పోరాటంలో ఎప్పుడూ ధర్మం, న్యాయమే గెలిచాయి. నేను ఒక్క పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. మన ముఖ్యమంత్రి నయా తుగ్లక్‌లా తయారయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి నీతులు చెబుతున్నారు. అమరావతిని మార్చే అధికారం మీకు లేదు. శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అమరావతికి సిఫారసు చేసింది. ఒక రాజధానే ఉండాలని జాతీయ పత్రికలు సైతం చెప్పాయి. సామాజిక స్పృహ లేకుండా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రార్థనాలయాల నుంచి మట్టి తీసుకొచ్చి అమరావతిని పవిత్రం చేశాం’ అని చంద్రబాబు తెలిపారు.

భూ అక్రమాలు జరిగితే విచారణ జరపండి..

‘అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో భూ అక్రమాలు జరిగితే విచారణ జరపండి. బినామీల పేరుతో కొట్టేసే అలవాటు నాకు లేదు. ఐఐటీ చెన్నై నివేదిక ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేశారు. జీఎన్‌ రావు కమిటీ విశాఖ గురించి ఇచ్చిన నివేదికను కనీసం చదవనేలేదు. విశాఖలో నేను ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయితే ఈరోజు మెగాసిటీగా మారేది. కానీ అక్కడకు వచ్చిన కంపెనీలను బలవంతంగా వెనక్కు పంపించేశారు’ అని చంద్రబాబు వివరించారు.

అలా అయితే రాజధానిని తిరుపతిలో పెట్టేవాడిని..

‘నేను నా స్వార్థం చూసుకోలేదు. అలా అయితే తిరుపతిలో రాజధానిని పెట్టేవాడిని. నేను అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశాను. ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ మీతో ఓటు వేయించుకున్నారు. అలాంటి వారు ఈరోజు ప్రజలు బాధపడేలా చేస్తున్నారు. అమరావతిలో భూములు వెనక్కి ఇచ్చేసి కొత్తగా విశాఖలో బలవంతంగా తీసుకుంటారంట.. విశాఖలో 4 వేల ఎకరాల ప్రభుత్వ భూములను బిల్డ్‌ ఏపీ కింద అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను రాయలసీమ ద్రోహిగా ముద్ర వేస్తున్నారు. రాయలసీమకు ఎవరు మేలు చేశారనే విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధం. అనంతపురంలో కియా మోటార్స్‌ ఏర్పాటు చేయించింది మేము కాదా?కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సీడ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేశాం. తిరుపతిని హార్డ్‌వేర్‌ హబ్‌గా మార్చాం’ అని పేర్కొన్నారు.

కనీస సమయం ఇవ్వలేదు..

‘అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే అమరావతిపై రెఫరెండం పెట్టాలి. తెనాలి వేదిక నుంచి ప్రభుత్వానికి సవాల్‌ చేస్తున్నా. మేనిఫస్టో కమిటీలో అమరావతిని మారుస్తానని చెప్పలేదు కదా! ముఖ్యమంత్రి సభలను ప్రజలు బహిష్కరించాలి. అసెంబ్లీలో సైతం వికేంద్రీకరణ బిల్లును హడావుడిగా పెట్టారు. బిల్లును చదిదేందుకు కనీస సమయం ఇవ్వలేదు. శాసనమండలిలో బిల్లును సెలెక్ట్‌ కమిటీకి ఇవ్వాలని ఛైర్మన్‌ నిర్ణయించారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. దీంతో నేను గ్యాలరీకి వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్సీలు నీతి, నిజాయతీలతో వ్యవహరించారు. ప్రలోభాలకు గురికాలేదు. ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి అనేక విధాలుగా నష్టం చేస్తుంది’ అని వైకాపా తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని