కరోనాపై చర్చకు పార్లమెంట్‌ సమావేశాలు!  - shivsena cong mps demand for call special parliament session to discuss corona surge
close
Published : 20/04/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై చర్చకు పార్లమెంట్‌ సమావేశాలు! 

కేంద్రాన్ని కోరిన రౌత్‌, మనీశ్ తివారీ

 ముంబయి: దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న తరుణంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ కేంద్రాన్ని కోరారు. కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ పరిస్థితిపై రాష్ట్రాలు కేంద్రంతో చర్చించి, కొవిడ్‌పై పోరాటానికి అవసరమైన మద్దతు కోరాలనుకుంటున్నాయని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, టీకా, రెమ్‌డిసివిర్‌ ఔషధం కొరత ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిస్థితులపై పలు రాష్ట్రాల్లోని సీనియర్‌ నాయకులతో తాను మాట్లాడానని, దేశం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోందో అర్థమైందన్నారు. ఆక్సిజన్‌, పడకలు, ఔషధాలు, టెస్టుల కోసం సాయం కోరుతూ ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో కాల్స్‌ వస్తున్నట్టు మంత్రులు చెబుతున్నారని రౌత్‌ తెలిపారు. 

ఈ నేపథ్యంలో కనీసం రెండు రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశ పరిస్తే దేశంలోని కరోనా పరిస్థితిపై చర్చించే వీలు ఉంటుందని ప్రధానిని కోరారు. ఈ మహమ్మారిపై పోరాటానికి అనుసరించాల్సిన మార్గాలతో పాటు వైద్య పరిస్థితుల మెరుగుదల గురించి రాష్ట్రాలు పార్లమెంట్‌ వేదికగా చర్చించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ సేకరణ సందర్భంగా చెలరేగిన బ్రూక్‌ ఫార్మా వివాదంపైనా రౌత్‌ స్పందించారు. ఔషధాలను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. ఆ‌ ఔషధాల సరఫరాపై రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఈ వివాదంపై హోంమంత్రి తదుపరి విచారణకు ఆదేశించారని చెప్పారు.

నీరోని తలపిస్తున్న భాజపా నేతలు!

మరోవైపు, కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆస్పత్రుల్లో పడకలు లేవు, ప్రాణవాయువు లేదు.. వ్యాక్సిన్‌ కొరత ఉందంటూ మండిపడ్డారు. దేశం కరోనాతో మండిపోతుంటే భాజపా నేతలు పశ్చిమ్‌బెంగాల్‌ రాజకీయాల్లో తీరికలేకుండా ఉంటూ.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే రెండు రోజుల పాటు పార్లమెంట్‌ను అత్యవసరంగా సమావేశ పరచాలని రాష్ట్రపతిని కోరారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని