ఇంజినీర్‌ నుంచి సీఎం పీఠం వరకు.. బొమ్మై రాజకీయ ప్రస్థానం - telugu news bommai political career
close
Published : 28/07/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంజినీర్‌ నుంచి సీఎం పీఠం వరకు.. బొమ్మై రాజకీయ ప్రస్థానం

బెంగళూరు: కర్ణాటక సీఎం పదవి మళ్లీ లింగాయత్‌ సామాజిక వర్గానికే దక్కింది. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా రేపు ఉదయం 11 గంటలకు బసవరాజ్‌ బొమ్మై ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం కర్ణాటక హోం మంత్రిగా ఉన్న బసవరాజ్‌, మాజీ సీఎం ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడుగా అందిరికీ సుపరిచితుడు. యడియూరప్పకు బసవరాజ్‌ అత్యంత సన్నిహితుడు. కాగా ఆయన యూత్‌ లీడర్‌ నుంచి సీఎంగా ఎదిగిన తీరు ఆదర్శప్రాయం. బసవారజ్‌ బొమ్మై 1960 జనవరి 28వ తేదీన హుబ్లీలో జన్మించారు. హుబ్లీలోని బీవీ భూమారెడ్డి ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. డిగ్రీ పూర్తయ్యాక మూడేళ్లపాటు టాటా మోటార్స్‌ గ్రూప్‌లో ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం జేడీయూ నుంచి యువజన సభ్యుడిగా బొమ్మై రాజకీయ రంగప్రవేశం చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. 1996లో ఆయన అప్పటి కర్ణాటక సీఎం జేహెచ్‌ పటేల్‌కు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 

బసవరాజ్‌ బొమ్మై 2008లో భాజపాలో చేరారు. అనంతరం షిగ్గాన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీ బాధ్యతలు చేపట్టారు. 2008-2013 కాలంలో నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, యడియూరప్ప ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈనేపథ్యంలోనే భాజపా అధిష్ఠానం కర్ణాటక సీఎం పీఠాన్ని బసవరాజ్‌కు ఖరారు చేసింది. ఇంజినీర్‌గా మొదలైన ఆయన ప్రస్థానం సీఎం పీఠం అధిరోహించే వరకు వెళ్లింది.

కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌రెడ్డిల సమక్షంలో భాజపా శాసనసభాపక్షం బసవరాజ్‌ బొమ్మైను సీఎంగా ఎన్నుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని విభాగాల్లో కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపించడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, వరదల నియంత్రణ, ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడమే తొలి ప్రాధాన్యాంశాలుగా ఆయన పేర్కొన్నారు. సీఎంగా తన నియామకానికి అధిష్ఠానం ఎలాంటి షరతులూ విధించలేదని స్పష్టం చేశారు. భాజపాపై ప్రజలకున్న విశ్వాసం, అంచనాలను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చారు. అధికార పగ్గాలు అప్పగించి తనను ఆశీర్వదించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, మాజీ సీఎం యడియూరప్పకు ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో తనపై పెద్ద బాధ్యత పెట్టారని, పేదల సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. బసవరాజ్‌ను కొత్త సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని మాజీ సీఎం యడియూరప్ప తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బసవరాజ్‌ కష్టపడి పనిచేస్తారని అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని