Cinema News: సల్మాన్‌ వదిలేశారు... షారుక్‌ గెలిచేశారు.. - telugu news shahrukh khan hit movies rejected by salman khan
close
Published : 17/09/2021 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: సల్మాన్‌ వదిలేశారు... షారుక్‌ గెలిచేశారు..

బాక్సాఫీసుని వసూళ్లతో నింపేసే సత్తా ఉన్న మాస్‌ హీరో సల్మాన్‌ఖాన్‌. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. పక్కా వాణిజ్యహంగులతో నిండిన అంశాలతో అభిమానులతో థియేటర్లలో గోల చేయిస్తుంటారు. ఆయన కెరీర్‌లో ఎన్నో భారీ విజయాలు ఉన్నాయి. పరాజయాలూ ఉన్నాయి. జయాపజయాలు చాలా    సహజమే కానీ కొన్ని కారణాలతో ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా మంచి చిత్రాలను వదలుకోవాల్సి వస్తుంటుంది. సల్మాన్‌ కెరీర్‌లో అలాంటి చిత్రాలున్నాయి. విచిత్రంగా ఏంటంటే ఆయన వద్దనుకున్న ఆ చిత్రాలే మరో స్టార్‌ హీరో షారుక్‌ఖాన్‌ చేతుల్లోకి వెళ్లి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఆయన కెరీర్‌లో ది బెస్ట్‌ చిత్రాలుగా మిగిలిపోయాయి. అవే చిత్రాల్లో సల్మాన్‌ నటించి ఉంటే ఆయన కెరీర్‌లో విజయాల సంఖ్య మరింత పెరిగేది. ఇంతకీ ఆ చిత్రాలేంటి? వాటి వెనక కథేంటి? చదివేద్దాం.

బాజీగర్‌

షారుక్‌ఖాన్‌ సినిమా కెరీర్‌లోని గొప్ప చిత్రాల్లో ఒకటి ‘బాజీగర్‌’. అబ్బాస్‌ మస్తాన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో కాజోల్, శిల్పాశెట్టి నాయికలుగా నటించారు. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో రూ.18 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ కథ మొదట సల్మాన్‌ఖాన్‌ వద్దకే వచ్చింది. ఆ విషయాన్ని సల్మానే ఓ సందర్భంలో చెప్పారు. ‘‘నేను ‘బాజీగర్‌’లో నటించడానికి అంగీకరించలేదు. అబ్బాస్‌ మస్తాన్‌ నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు మా నాన్న ఆ కథలో కొన్ని మార్పులు కోరారు. ‘కథ కొంచెం నెగెటివ్‌గా ఉంది. అందులో తల్లి సెంటిమెంట్‌ను జోడిస్తే బాగుంటుంది’ అని చెప్పారు నాన్న. అబ్బాస్‌ మస్తాన్‌లు అందుకు ఒప్పుకోలేదు. దాంతో నేను ఆ చిత్రాన్ని వదిలేసుకున్నాను. ఆ తర్వాత ఆ కథలో షారుక్‌ నటించారు. చివరికి ఆ కథలో తల్లి సెంటిమెంట్‌ను జోడించినా నేనేమీ పట్టించుకోలేదు’’అని చెప్పారు.

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే

భారతీయ చిత్ర సీమలో ఐకానిక్‌ చిత్రంగా నిలిచిపోయింది ‘దిల్‌ వాలే దుల్హనియా లే జాయేంగే’. రాజ్, సిమ్రన్‌ పాత్రల్లో షారుక్, కాజోల్‌లు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా   నిలిచిపోయారు. ప్రతినాయక పాత్రలతో అలరిస్తున్న షారుక్‌ను కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌గా మార్చేసిన చిత్రమిది. దీన్ని మొదట సల్మాన్‌ఖాన్‌తో తీయాలనుకున్నారు. ఆయన అంగీకరించలేదు. సైఫ్‌ అలీఖాన్‌నూ సంప్రదించారు యశ్‌ చోప్రా. కుదరలేదు. తర్వాత అది షారుక్‌కు దక్కింది.

కల్‌ హో నా హో

షారుక్‌ఖాన్, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కల్‌ హో నా హో’ చిత్రం బాక్సాఫీసుని వసూళ్లతో నింపేసింది. ముక్కోణపు ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రీతి జింటా నాయిక. సైఫ్‌ అలీఖాన్‌ పోషించిన రోహిత్‌ పటేల్‌ పాత్ర కోసం ముందుగా సల్మాన్‌ఖాన్‌నే సంప్రదించారు ఆ చిత్ర దర్శకుడు నిఖిల్‌ అద్వానీ. షారుక్‌ నటిస్తున్న చిత్రంలో రెండో హీరోగా చేయడం ఇష్టం లేక సల్మాన్‌ దాన్ని వదులుకున్నారట.

జీరో

ఆనంద్‌ ఎల్‌రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ నటించిన చిత్రం ‘జీరో’. అందులో  మరుగుజ్జు పాత్రకు మంచి విమర్శలు దక్కాయి. ఇందులోనూ మొదట అనుకున్నది సల్మాన్‌ఖాన్‌నే అట. ఈ విషయాన్ని షారుక్‌ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ‘‘జీరో’ కోసం ముందుగా అనుకున్నది సల్మాన్‌నే. అందులోని మరుగుజ్జు పాత్ర చేయడం ఆయనకు ఇష్టం లేదు.  తర్వాత అతిథిగా సందడి చేశారు సల్మాన్‌’’ అని చెప్పారు షారుక్‌.

జోష్‌

గోవాలోని రెండు గ్యాంగ్‌ల నేపథ్యంగా సాగే కథతో తెరకెక్కిన ‘జోష్‌’ చిత్రం మంచి విజయమే సాధించింది. ఈ చిత్రంలో షారుక్‌ పోషించిన పాత్ర కోసం ముందుగా సల్మాన్‌నే అనుకున్నారు. ఆయన డేట్స్‌ కుదరకపోవడంతో కథ నచ్చినా వదిలేసుకున్నారు సల్మాన్‌. రూ.16కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.36కోట్లకు పైగానే వసూలు చేసింది

‘చక్‌ దే ఇండియా’

భారతీయ వెండితెరపై వచ్చిన క్రీడా నేపథ్య చిత్రాల్లో ముందువరసలోనే ఉండే చిత్రం ‘చక్‌ దే ఇండియా’. హాకీ కోచ్‌గా షారుక్‌ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు. 2007 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.110కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇందులోని కోచ్‌ కబీర్‌ ఖాన్‌ పాత్ర కోసం ముందుగా సల్మాన్‌నే అడిగారట నిర్మాత ఆదిత్య చోప్రా. కానీ ఆయన అంగీకరించలేదు. ‘‘చక్‌ దే ఇండియా’ అనే టైటిల్‌తోనే నాకు కొంచెం సమస్య. ఎందుకంటే నాకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లోనూ అభిమానులున్నారు. అందుకే ఈ చిత్రాన్ని వదులుకున్నాను’’అని ఓ సందర్భంలో చెప్పారు సల్మాన్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని