close
టాలీవుడ్‌


సరికొత్త వినోదానికి సిద్ధమా!

తెలుగు సినిమా సరళిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇదివరకు ‘అవే కథలు... అవే సినిమాల’నే విమర్శలు బలంగా వినిపించేవి. నాలుగేళ్లుగా భిన్నమైన కథలు వెలుగు చూస్తున్నాయి. విజయం అందుతుందనే నమ్మకం ఉన్నా సరే... ఫార్ములా కథలతో ప్రయాణం చేయడంపై దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. కథా నాయకులూ అలా మూస పద్ధతుల్లో సినిమాలు చేయడానికి ఇష్ట పడటం లేదు. కొత్త కథే చెబుదామనే ధోరణిలో అడుగులు వేస్తున్నారు. దాంతో ప్రేక్షకుడికి ప్రతి టికెట్టుపైనా కొత్త వినోదాల్ని ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. ఈ ఏడాది రాబోయే సినిమాల్ని పరిశీలిస్తే... మన వెండితెర సరికొత్త రుచుల్నే పంచబోతోందనే విషయం స్పష్టమవుతోంది. 

 సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకొక్కటి  ఒక్కో రకమైన కథతో రూపుదిద్దుకొన్నదే. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రతో రూపుదిద్దుకోగా... ‘వినయ విధేయ రామ’ కమర్షియల్‌  అంశాలతో ముస్తాబై ప్రేక్షకుల ముందుకొచ్చింది. కుటుంబ అంశాలతో    మేళవించిన ఫక్తు వినోదాత్మక చిత్రంగా ‘ఎఫ్‌2’ అలరించేందుకు సిద్ధమైంది. ఇక ‘పేట’రజనీ ఇమేజ్‌నీ, ఆయన అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని         తెరకెక్కింది. ఇలా ఒకొక్క సినిమాదీ ఒక్కో పంథా. దేని దారిలో అది పండగ రుచుల్ని ఆస్వాదించినంత కమ్మగా వినోదాల్ని పంచుతోంది. రాబోయే     సినిమాలు కూడా ఇదే తరహాలోనే సరికొత్త కథలు, వినోదంతో సందడి చేసేలా కనిపిస్తున్నాయి. ఆ చిత్రాల కోసం దర్శకులు ఎంచుకొన్న కథలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

చరిత్ర పేజీల నుంచి... 
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ఒకటి... ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో    రూ.200 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రంపై     అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రాలు రూపొందాయి. తొలి చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక రెండో భాగం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ తెరకెక్కింది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. ఇవన్నీ జీవిత కథలతో తెరకెక్కిన చిత్రాలే అయినా అవి సాగే కాలం, వాటి నేపథ్యం కొత్తగా ఉండబోతున్నాయి. రాజశేఖర్‌ ఒక పీరియాడిక్‌ కథతో ‘కల్కి’ చేస్తున్నారు. 1983 నేపథ్యంలో సాగే చిత్రమది. 

బాండ్‌ని గుర్తు చేస్తాడా? 
‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌ చేస్తోన్న చిత్రం ‘సాహో’. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకి ముహూర్తం కుదిరిపోయింది. రూ.250 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రంతో ప్రభాస్‌ జేమ్స్‌బాండ్‌ సినిమాల్ని గుర్తు     చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆ     విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రం      ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం చెబుతోంది. మహేష్‌బాబు ఈ ఏడాది ‘మహర్షి’ చిత్రంతో ప్రేక్షకులకు వినోదాలు పంచబోతున్నారు. కొంతకాలంగా మహేష్‌ సామాజికాంశాలతో కూడిన కథల్ని   ఎంచుకొంటున్నారు. ఈ చిత్రంలోనూ అలాంటి అంశాల్నే స్పృశించినట్టు  తెలుస్తోంది. మహేష్‌ స్టైల్‌కి తోడు ఆయన చెప్పే కథ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. వేసవికి ఈ చిత్రం రాబోతోంది. కొంతకాలం పాటు సీరియస్‌ కథలతోనే ప్రయాణం చేసిన వెంకీ మళ్లీ తనదైన దారిలోకి వచ్చారు. ‘ఎఫ్‌2’తో తన మార్క్‌ వినోదం పండించిన ఆయన తదుపరి చేయబోయే ‘వెంకీమామ’లోనూ తన నుంచి ఆశించే అంశాలు పుష్కలంగా ఉంటాయని వెంకటేష్‌ చెబుతున్నారు. 

వీళ్లూ కొత్తగానే 
కథల విషయంలో యువతరం కథానాయకులు మరింత పక్కాగా   ఉంటున్నారు. థియేటర్‌కి వెళ్లే యువతరం అభిరుచులకి తగ్గట్టుగా ఆలోచిస్తూ కథల్ని ఎంపిక చేసుకొంటున్నారు. నాని ఈసారి క్రికెట్‌ నేపథ్యంలో సాగే కథతో ‘జెర్సీ’ చేశారు. ప్రేక్షకులకి కొత్తదనాన్ని పంచడమే కాదు నటుడిగా నాకూ గౌరవాన్ని పెంచే చిత్రమవుతుందని చెబుతున్నారాయన. అఖిల్‌ అక్కినేని ‘మిస్టర్‌ మజ్ను’గా మారి ప్రేమకథ చెప్పబోతున్నారు. ఆయన సోదరుడు నాగ   చైతన్య ‘మజిలీ’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. నాగచైతన్య, ఆయన భార్య సమంత నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం పెళ్లయిన ఓ జంట నేపథ్యంలో సాగుతుందని సమాచారం. సమంత కథానాయిక ప్రాధాన్యంతో కూడిన మరో చిత్రం చేస్తున్నారు. ఒక యువతి, ఆమె బామ్మ నేపథ్యంలో సాగే కథతో ‘ఓ బేబీ... ఎంత సక్కగున్నావే’ పేరుతో ఆ చిత్రం రూపొందుతోంది. కీర్తిసురేష్‌, అనుష్క తదితరులు కూడా ఈ ఏడాది కథానాయిక ప్రాధాన్యమున్న  చిత్రాలతో సందడి చేయబోతున్నారు. విజయ్‌ దేవరకొండ ఎంచుకొనే కథలు కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఆయన ఈసారి ‘డియర్‌ కామ్రేడ్‌’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్‌రామ్‌ ఓ థ్రిల్లర్‌ కథతో ‘118’    చేశారు. అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. ఈసారి ఈ  కలయికలో ఎలాంటి సినిమా రాబోతుందన్నది    త్వరలోనే తెలుస్తుంది. గతేడాది కూడా జీవిత కథలతో పాటు... రాజకీయం, గ్రామీణ, ప్రేమ, ఫ్యాక్షన్‌, థ్రిల్లర్‌ తదితర నేపథ్యాలతో కూడిన కథలు తెరపైకొచ్చి విజయాల్ని అందుకొన్నాయి. అదే స్ఫూర్తి ఈ ఏడాది కూడా కనిపిస్తోంది. అరుదుగా తెరకెక్కే క్రీడా నేపథ్య చిత్రాలు కూడా ఈసారి ప్రేక్షకుల ముందుకు రానుండడం మంచి పరిణామం.

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.