ఉపాధ్యాయుడు.. పోలీసుగా.. ఒకే వ్యక్తి!
close

తాజా వార్తలు

Published : 21/06/2021 01:13 IST

ఉపాధ్యాయుడు.. పోలీసుగా.. ఒకే వ్యక్తి!

బరేలీ: ఒక ఉద్యోగం దొరకడమే కష్టమైన ఈ రోజుల్లో.. ఓ వ్యక్తి ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నాడు. ప్రభుత్వం కళ్లుగప్పి ఐదేళ్లుగా ఉపాధ్యాయుడిగా, పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..! తాను ఉపాధ్యాయుడుగా పని చేస్తూ.. పోలీసు ఉద్యోగానికి తన బావను పంపాడు ఆ వ్యక్తి. అయితే ఓ ఫోన్‌ కాల్‌తో వారి గుట్టు రట్టయింది. దీంతో వారిద్దరూ కటకటాలపాయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనిల్‌ కుమార్‌ ఐదేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అధికారిక రికార్డుల ప్రకారం పోలీసు శాఖలో డయల్‌ 112 వాహనంలో అనిల్‌ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఓ వ్యక్తి మొరాదాబాద్‌ పోలీస్‌ ఠాణాకు ఫోన్‌ చేశాడు. అనిల్‌ పేరుతో వేరొక వ్యక్తి తనతో మాట్లాడినట్టు అతడు గుర్తించాడు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే ఉన్నతాధికారులు అనిల్‌ను పోలీస్‌ ఠాణాకు రావాల్సిందిగా ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు అతడు యూనిఫాం ధరించి అధికారుల ముందుకు వచ్చాడు. అధికారులు అతడి వ్యక్తిగత వివరాల గురించి ప్రశ్నించగా.. తాను ముజఫర్‌నగర్‌ నుంచి వచ్చినట్టు చెప్పాడు. 2011లో బరేలీ పోలీస్‌ లైన్‌లో కానిస్టేబుల్‌గా శిక్షణ పొందినట్లు వివరించాడు. అయితే శిక్షణ సమయంలో బరేలీ పోలీస్‌ లైన్‌ ఎస్‌ఎస్‌పీగా పని చేసిన అధికారి పేరు అడగడంతో అతడి నోట మాట రాలేదు. శౌచాలయానికి వెళ్లొస్తానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే పోలీసులు రికార్డులు తిరగేశారు. అప్పటిదాకా వారితో మాట్లాడిన వ్యక్తికి బదులుగా రికార్డుల్లో వేరొక వ్యక్తి ఫొటో చూసి వారు కంగు తిన్నారు. ఫొటోలో ఉన్న వ్యక్తిని సునీల్‌ కుమార్‌గా గుర్తించారు.

అనిల్‌, సునీల్‌ ఇద్దరూ బంధువులు. పోలీసు ఉద్యోగంతోపాటు అనిల్‌ ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికయ్యాడు. బీఎడ్‌ పూర్తి చేసే వరకు తనకు బదులుగా పోలీసు ఉద్యోగానికి వెళ్లమని సునీల్‌ను అనిల్‌ కోరాడు. ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు పోలీసు ఉద్యోగాన్ని మొరాదాబాద్‌ ఠాణాకు బదిలీ చేయించుకున్నాడు. తాను మాత్రం ముజఫర్‌నగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు. ఐదేళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వారిద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు పంపారు.     
      


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని